Skip to main content

ముఖ్యమంత్రి నివాసం, వాస్తు.

పొద్దున్నే వార్త. ముఖ్యమంత్రి గారు క్యాంపు ఆఫీసు లోకి మార బోతున్నారు. శుభం. కాని పూర్తిగా కాదట. నివాసం ఇప్పుడు అమీర్ పేటలో ఉన్న స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట. ఇంతోటి దానికి అరవై లక్షల ప్రజా ధనం తగలేసి వాస్తు ప్రకారం మార్పు, చేర్పులు చేయించారు.

గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కన్నా ముందు ముఖ్యమంత్రులు తమ నివాసాల నుండే పరిపాలన సాగించే వారు. లోపాయికారీగా ప్రభుత్వ డబ్బులతో తమ ఇళ్ళను కావలసిన విధంగా రిపేర్లు కూడా చేయించు కునేవారనుకోండి, అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు, యన్టీయార్ కూడా దీనికి మినహాయింపు కాదు.

రాజశేఖర రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంటికివెళ్ళ లేదు. ఏకాఎకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మకాం పెట్టేసారు. యుద్ధ ప్రాతిపదిక పై ముఖ్యమంత్రి అధికార నివాస నిర్మాణం ప్రారంభించారు. దీనికోసం దాదాపు పది కోట్లవరకు ఖర్చు పెట్టారు. దీని ఖర్చు పైన కొన్నివిమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి భద్రత, పాలనా సౌలభ్యం మొదలైన వాటి దృష్ట్యా ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేదు.

కాని ఇప్పుడు రోశయ్య గారు స్వంత ఇంటిలో నివాసముంటూ అధికార గృహం నుంచి పరిపాలన సాగిస్తే, గతంలో ముఖ్యమంత్రి అధికార నివాసం ఆవశ్యకత గురించిన వివరణపై హేతుబద్ధత ఏమిటి? ఇది కోట్ల రూపాయల దుర్వినియోగం కాదా? ఈ డబ్బుని ఇతర కార్య క్రమాల కోసం వాడేవారు కాదా?

ఇప్పుడు ఈయన ప్రతిరోజూ ఇంటినుండి క్యాంపు ఆఫీసుకి, అక్కడి నుండి సెక్రెటేరియట్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఇల్లు, ఆఫీసు వేరు వేరుగా వాడు తుంటే రోజూ ఈ రెండిటి మధ్య తిరగ డానికి బోలెడంత ట్రాఫిక్ జాము అవుతుంది. ఈ అసౌకర్యాన్ని భారించాల్సింది ప్రజలే. ఈ ట్రాఫిక్ ని కంట్రోలు చేయడానికి ప్రతిరోజూ పోలీసులు అవస్థ పడాలి. ఇటు ఇంటికి, అటు క్యాంపు ఆఫీసుకి సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు బలగాలు కావాలి. ముఖ్యమంత్రి అంటే ఇరవై నాలుగ్గంటల ఉద్యోగం కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్, కమ్యూనికేషన్ వసతులు ఆఫీసులో సరేసరి, ఇంటిలో కూడా కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం అదనపు ఖర్చు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రి మూఢ విశ్వాసాల కొరకై అరవై లక్షలు తగలేసి వాస్తు పేరిట రిపేర్లు చేయించడం ఇంకో ఎత్తు. పైగా ఈ భవనం కట్టి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఒక వైపు రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటారు. ఆదాయం తగ్గిందంటారు. ఇలాంటి ఖర్చులకు మాత్రం నిధులు ఎలా ఊడి పడతాయో మరి! ఈ అరవై లక్షలు పెడితే అరవై మంది నిరు పేదలకు ఇందిరమ్మ గృహాలు ఇప్పించ వచ్చు. ఇరవై మంది పసికూనల గుండెలు ఆగిపోకుండా నివారించ వచ్చు.

అసలు వాస్తు విషయంలో మన రోడ్లు భవనాల శాఖ పాలసీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఈ శాఖ గృహ నిర్మాణాల విషయంలో వాస్తు నియమాలు పాటిస్తుందా, పాటించదా? ఒక వేళ పాటిస్తే, ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు అవసర మయ్యాయి? కాల క్రమేణా వాస్తులో కూడా మార్పులు వస్తుంటాయా? ఒక వేళ వాస్తు పాటించదు అనుకుందాం. మరి ఏ నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేశారు? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు.

Comments

  1. మంచి పాయింట్ ఫోకస్ చేసారు.

    ReplyDelete
  2. అమ్మ ఒడి గారు, ధన్యవాదాలు.

    ReplyDelete
  3. హరి దోర్నాల గారికి
    చాల మంచి వ్యాసం రాసారు. దీని సారంశాన్ని నా బ్లాగులో కుడా ఉంచుతాను.

    ReplyDelete
  4. కొడాలి గారు, ధన్యవాదాలు

    ReplyDelete
  5. బాగా అడిగారు. అసలు ముఖ్యమంత్రికి అధికార నివాసం ఉండగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి, అందుకు గాను ఈ అనవసరమైన ఖర్చులను మన నెత్తిన రుద్దుతున్నారు.

    ReplyDelete
  6. చదువరి గారు, ధన్యవాదాలు

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...