Skip to main content

Posts

Showing posts with the label రాజకీయం

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...

లోక్ పాల్ కమిటీ మరో తెలంగాణా కమిటీ అవుతుందా?

హజారే విజయంతో అవినీతిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. లోక్ పాల్ బిల్లు ఎంతవరకు పాస్ అవుతుందో తెలియదు కాని అవినీతి పై దేశ ప్రజలు చర్చించేలా చేయగలిగినందుకు అన్నా ఎంతైనా అభినందనీయుడు. అయితే హజారే దీక్షకు అంత సులభంగా కాంగ్రెస్ తలవొగ్గడం విచిత్రంగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ స్వభావ సిద్ధంగా ఉద్యమాలకు, దీక్షలకు తలొగ్గే రకం కాదు. సమస్యలు నాన్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు ఎన్నో జరిగినా కూడా మిన్నకున్న చరిత్ర ఉంది ఈ ప్రభుత్వానికి. భవిష్యత్తులో ఉధృత రూపం దాల్చేదేమో కాని, సమస్యను పరిష్కరించే సమయానికి పట్టణాల్లో ప్రదర్శనలు తప్ప పెద్దగా ఉద్యమం కూడా ఏమీ కనిపించ లేదు. మరి హజారే నాలుగు రోజులు దీక్ష చేయగానే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఒక అంగీకారానికి ఎలా వచ్చింది?  సమస్యను పరిష్కరించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తారేమోనని అనుకున్నా కూడా అలాంటిదేమీ చేయలేదు.   తానొక్కటే మొత్తం క్రెడిట్ తీసుకోవాలనేమో, ఏక పక్షంగా ఆందోళన కారులతో చర్చలు జరిపింది. ఆ రెండువర్గాలు తప్ప మరే ఇతరులకు కూడా బిల్ డ్రాఫ్టు కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు. 2G, కామన్వెల్త్ మొదలై...

అశ్వత్థామ, కుంజర న్యాయం

ధర్మరాజు మనకు ఒక గొప్ప న్యాయాన్ని అందించి వెళ్ళాడు. అదే అశ్వత్థామ, కుంజర న్యాయం. కురుక్షేత్ర సంగ్రామంలో అప్రతిహతంగా ముందుకు వెళ్ళుతున్న ద్రోణుడు, తన కుమారుడైన అశ్వత్థామ మరణిస్తే కానీ క్రుంగిపోయి ఓటమి చెందడని భావించిన ధర్మరాజు ఇలా అరుస్తాడు. 'అశ్వత్థామ హతః' కాని ఆయన ధర్మాత్ముడని పేరు. అబద్ధం చెప్పకూడదు. కాబట్టి వ్రతానికి భంగం కలగకుండా 'కుంజరః' అని మెల్లిగా అంటాడు. అప్పుడే అశ్వత్థామ అనే పేరుగల ఏనుగు మరణించడం కొసమెరుపు. ఆ విధంగా పుత్రుని మరణ వార్త తప్పుగా వినడం వలన అశక్తుడు గా మారిన ద్రోణున్ని పాండవవర్గం వారు సులభంగా చంపివేశారన్నది మిగతా కథ. ఇలా ధర్మరాజు చేత కనిపెట్టబడిన ఈ న్యాయాన్ని ఈనాడు మీడియా గొప్పగా ఉపయోగిస్తుంది. ఎలాగంటే, తమకు అనుకూలంగా ఉండే విషయం ఎంత చిన్నదైనా బాకా ఊది, బానరు కట్టి మరీ చెప్పడం. అలాగే తమకు ప్రతికూలంగా ఉండే విషయం ఎంత ముఖ్యమైనదైనా చెప్పీ చెప్పనట్టు వెనక పేజీలో చిన్నగా వేయడం. తద్వారా తమ వ్యతిరేకులను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ తర్వాత అంతం చేయడం. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయంలో పేర్కొన్న మీడియా మేనేజిమెంటు ఇలాంటిదే అని భావించ వచ్చు. ఇక పోతే ఒక మహానా...

కాకరాపల్లిలో మానవమేధం

గంగవరం, ముదిగొండ మరపుకైనా రాలేదు. సోంపేట నెత్తురు తడి ఆరనైనా ఆరలేదు, మళ్ళీ కాకరా పల్లిలో మానవమేధం. ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తాకట్టు పెట్టి పెట్టుబడి దారుల పాదాలకు మడుగులోత్తే క్రమంలో ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాల్సి ఉందో ఆలోచిస్తేనే భయం గొల్పుతుంది. ఆ ప్రాంతపు ప్రజలు ప్రాణాలొడ్డి థర్మల్ ప్లాంటు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటేనే అది వారికి ఎంత నష్టదాయకమో చెప్పకనే చెపుతుంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్టు అక్కడే పెట్టాలనే యావ ఈ ప్రభుత్వానికెందుకు? సమాధానం జగద్విదితం. ఆ ప్రాంతం పెట్టుబడి దారులకు అనుకూలమైనది. నీటి లభ్యత ఉంటుంది. పోర్టు దగ్గరగా ఉంటుంది. అనగా పెట్టుబడి దారునికి అధిక లాభాలు వస్తాయి. లోపాయికారీగా తమకు ఎక్కువ కమీషన్లు ముడుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పెట్టుబడి దారుడు చెప్పిన దానికి గంగిరెద్దులా తలూపడం తప్ప ప్రజల గురించి ఏమాలోచిస్తుంది? అసలు రక్షణలన్నీ పెట్టుబడి దారునికేనా? ప్రజల కేమీ లేవా? అన్న సందేహం కలుగుతుంది. పంట భూములను నాశనం చేసి ఫ్యాక్టరీలు నిర్మించడం ఏమిటి? అలా నిర్మించడానికి రాష్ట్రంలో బీడు భూములు చాలా ఉన్నాయి. అక్కడ పనులు లేక ఎంతోమంది కార్మికులు ఉన్నారు. అలాం...

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్...

రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా ఉంది. స్వతంత్ర భారత దేశంలో బహుషా కాంగ్రెస్ పార్టీకి ఇంతటి గడ్డు పరిస్థితి ఇదివరలో ఎప్పుడూ వచ్చి ఉండదు. ఒకవైపు జగన్ వీరంగం. మరోవైపు తెలంగాణా సమస్య. మామూలుగా అయితే అవినీతి, అధిక ధరలు, పెట్రోలు ధర పెంపు లాంటివి ఆపార్టీకి దున్నపోతు మీద నీటి బొట్ల లాంటివే అయినా ఈ పరిస్థితులలో అవి కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి తన వైపు ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని ఏకంగా దేశ రాజధానిలోనే ప్రదర్శించి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన దయాదాక్షిన్యాల మీద ఆధారపడి ఉందని ప్రకటించాడు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి.   జగన్ వర్గం వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటే వారు రాజీనామా చేసేలా ఉన్నారు. తరువాత జరిగే ఉప ఎన్నికలలో ఎలాగూ ఆ స్థానాల్లో కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి ప్రభుత్వం పడిపోవడం ఖాయం. పోనీ ఉపేక్షిద్దామా అంటే ప్రభుత్వం ప్రతిష్ఠ నానాటికి తీసికట్టు, నాగంభొట్లు అన్న మాదిరిగా తయారౌతుంది. ఇక తెలంగాణా విషయానికి వస్తే గత ఆరేళ్ళుగా కాంగ్రేస్ ఆడుతున్న దొంగనాటకానికి చరమాంకం దగ్గర పడింది. అతి తొందరలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి...

రాష్ట్ర విభజన తప్పదా?

శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు రానే వచ్చింది. మొదటి సూచనగా రాష్ట్రం యధాతథంగా కొనసాగడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టింది. ఈవిషయం ఇప్పటికైనా సమైక్యవాదులు గుర్తిస్తే మంచిది. శ్రీక్రిష్ణ కమిటీ ఆరు సూచనలు చేసింది. అందులో నాలుగు ఆచరణసాధ్యం కాదని చెప్పింది. అది ఈ ఆరు సూచనలే ఎందుకు చేసిందనేది అంతు పట్టని తర్కం. ప్రజల నుండి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుందనుకుందామంటే,  ప్రజల్లోంచి ఇంకా చాలా సూచనలు వచ్చాయి. ఉదాహరణకు ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, వన్యసీమ మొదలైనవి. వాటిని కూడా చర్చించి సాధ్యాసాధ్యాలు వ్యాఖ్యానించాలి కదా! అందులో కూడా గ్రేటర్ రాయలసీమ, ప్రత్యెక రాయలసీమ, ప్రత్యేక ఆంధ్ర (సీమ లేకుండా) అనేవి బలంగా వినిపించాయి. మరి వీటిని కనీసం చర్చించనైనా లేదెందుకు? వాటిని కూడా చర్చించి సాధ్యం కాదని నిర్ణయం చేసి ఉండవచ్చు కదా? పోనీ, ఈ ఆరు సూచనలు చేసిందా అంటే, ఆరింట్లో నాలుగు పనికిరానివని తానే చెప్పింది. మరి పనికి రాని సూచనలు కమిటీ ఎందుకు చేస్తుంది? ఎవరిని గందరగోళంలో పడేద్దామని? నివేదిక ఈవిధంగా రావడం అంతుబట్టని చిదంబర రహస్యంగానే మిగిలి పోయింది. తానే సూచనల...

అయేషా మీరా హత్య కేసు

అయేషా మీరా హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధించబడిన సత్యం బాబు కన్ఫెషన్ వీడియో ఇది. ఈ కేసు విచారణలో ప్రత్యక్ష సాక్షులు గాని, సాక్ష్యాధారాలు గాని పోలీసులు ఏమీ సంపాదించ లేక పోయారు. ఈ కన్ఫెషన్ వీడియో, మరియు ఇతర సాంకేతిక పరమైన సాక్ష్యాలు తీర్పుకోసం పరిగణలోకి తీసుకున్నట్టు టీవీ ద్వారా విన్న సమాచారం. నాకు న్యాయ పరమైన విషయాలు పెద్దగా తెలియవు. కాని ఒక సామాన్యుడిగా పరిశీలించినా, ఈ కేసులో దర్యాప్తు గాని, విచారణ గాని న్యాయబద్ధంగా జరిగాయని అనిపించడం లేదు. ఎంతటి నేరస్తుడైనా, తాను చేసిన నేరాన్ని వివరిస్తున్నప్పుడు ఏదో ఒకలాంటి భావోద్వేగానికి గురి కావడం సర్వ సాధారణమైన విషయం. చేసిన డానికి పశ్చాత్తాపానికైనా గురవుతాడు, ఉన్మాదిగా నైనా మాట్లాడతాడు, ఏడుస్తాడు, లేదా గర్వంగా చెపుతాడు. కాని పై వీడియోలో చూస్తే సత్యం బాబు ఎలాంటి భావోద్వేగాలకు గురికాకుండా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పోలీసుల వైపునుండి ఒక్క ప్రశ్న కూడా లేకుండా కథంతా పూసగుచ్చినట్టు చెప్పడం కూడా ఎవరో నేర్పించినట్టుగా లేదూ? వెనక వైపున ఒక లుంగీనో దేన్నో బ్యాక్ డ్రాప్ గా కట్టారు. ఇది కూడా అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ పోలీసు స్టేష...

నిర్వీర్య మవుతున్న పోలీసు వ్యవస్థ

"దుండగులు ఎంతటి వారైనా వదిలిపెట్ట వద్దని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చాం" ఇవి శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడల్లా మన ముఖ్య మంత్రి గారు, లేక హోం మంత్రి గారు చెప్పే పడికట్టు పదాలు. అంటే ఏమిటి వీరి ఉద్దేశం? మామూలు పరిస్థితులలో ఎంతో కొంతటి వారైతే వదిలి పెడతారా? ఇప్పుడు మాత్రమే 'ఎంతటి వారైనా' వదిలి పెట్టకుండా శిక్షిస్తారా? అసలు ఎవరిని విడిచి పెట్టాలి, ఎవరిని విడిచి పెట్టొద్దు అని డీజీపీకి వీరు చెప్పే అవసరం ఏమిటి? వీరు చెపితే కాని డీజీపీకి ఈవిషయాలు తెలియవా? ఈ ఒక్క వాక్యం చాలదూ ప్రతి విషయంలో రాజకీయులు పోలీసుల వ్యవహారాలలో ఎంత జోక్యం కలిగించు కుంటున్నారో తెలుసుకోవా డానికి! "తప్పుచేసిన వారందరికీ  కఠినాతి కఠినమైన శిక్షలు విధించేలా చూస్తాం"  ఇది నాయకులు ఎప్పుడూ ఉపయోగించే మరొక వాక్యం. అసలు పోలీసు శాఖ విధి ఏమిటి? తప్పు చేసిన వారిని పట్టుకొని కోర్టులకు నివేదించడం. కోర్టులో వారి తప్పులను నివేదించడం. కొందరికి కఠినాతి కఠినమైన శిక్షలు, కొందరికి మామూలు మామూలు శిక్షలు విధించ డానికి వెసులుబాటు ఏమైనా ఉందా? లేక తప్పును బట్టి అందరికీ ఒకే రకమైన శిక్షలు ఉంటాయా? వీరు మాట్లాడే ...

ప్రజారాజ్యం పార్టీ వింత పోకడలు

ఆంధ్ర జ్యోతి పత్రిక కొన్ని అతిశయోక్తి అలంకారాలతో ప్రజారాజ్యం పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక వ్యాసం రాసింది. ఆ వెంటనే ప్రజారాజ్యం కార్యకర్తలు ఆగ్రహోదగ్రులై ఆంధ్ర జ్యోతి కార్యాలయం పై ఆటవికంగా దాడి చేశారు. ఈ విషయంలో ఆంధ్ర జ్యోతిది తప్పే కావచ్చు. అలా అని ఇప్పుడు తెలుగులో నిష్పక్షపాతంగా జర్నలిజం నియమాలను పాటిస్తున్న పత్రిక ఒక్కటైనా ఉందా? ఆంధ్ర జ్యోతి క్షమించ రానటువంటి ఘోరమైన వార్తనే వ్రాసింది అనుకుందాం. దాన్ని ఖండించ డానికి ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాయి. అంతే కాక press council కి కూడా నివేదించ వచ్చు. కాని ప్రజారాజ్యం వారు ఏం చేసారు? వీరు చేసిన దాడి ఏ విధంగానూ సమర్ధించ లేనిది. వీరు పార్టీ ఇంకా ఏర్పడకముందే రాజశేఖర్, జీవిత లపై దాడి చేసి 'పూవు పుట్టగానే పరిమళిస్తుంది' అన్న సామెతని నిజం చేశారు. ఇప్పుడేమో ఏకంగా ఒక మీడియా సంస్థ మీదనే దాడికి తెగ బడ్డారు. వీరు ఇప్పుడే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే, రేపు పొరపాటున అధికారం లోకి వస్తే పరిస్తితి ఎలా వుంటుందో ఊహించు కోవాలంటేనే భయం వేస్తుంది. ఇప్పటికీ చిరంజీవి ఈ దాడిని ఖండించక పోవడం చూస్తుంటే ఇదే వీరి పాలసీ అని అనుకోవలసి వస్తుంది.

తెలంగాణా

కాకతీయుల కాలంలో సుభిక్షమైన పరిపాలనకు నోచుకున్న తెలంగాణా తరువాత నవాబుల పాలనలోకి వచ్చింది. నాలుగు వందల సంవత్సరాల పాటు నిజాం కర్కశ పాలనకు కాకా వికలమైంది తెలంగాణా. నిజాం, అతని తాబేదార్లైన దేశ్ ముఖ్ లు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు తెలంగాణా ప్రజల ధన మాన ప్రాణాలను, కష్టాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. తెలంగాణా లో వీరు అమలు జరిపిన 'వెట్టి చాకిరీ', రోమన్ ల కాలం లోని బానిసత్వం కన్నా క్రూర మైనది. బానిసలకు కూడు పెట్టి పని చేయిస్తారు. కాని ఇక్కడ పని మాత్రమె చేయించుకునే వారు, కూడు ఎవరికీ వారే చూసుకోవాలి. ఎలాంటి ప్రతిఫలం లేకుండా ప్రతి ఇంటి నుండి దొరల పొలాల్లో, ఇళ్ళల్లో పనులు చేయించు కునే వారు. భారత దేశంలో నున్న ఇతర ప్రాంతాలు స్వతంత్ర వాయువులు పీల్చు కుంటున్నా తెలంగాణా బానిస బ్రతుకుల్లో మార్పు రాలేదు. కాశ్మీరు కోసం, జునాగడ్ కోసం తీరిక లేకుండా ప్రయత్నాలు చేసిన నెహ్రు, పటేల్ ద్వయం తెలంగాణా గురించి పట్టించుకోలేదు. చివరి ప్రయత్నంగా ప్రజలు సాయుధ పోరాటానికి దిగారు. మూడు వేల గ్రామాలను విముక్తం చేయగా దొరలంతా హైదరాబాదులో తల దాచుకొన్నారు. చివరికి హైదరాబాదును ముట్టడించిన తరుణంలో నెహ్రు, పటేల్ ...

కడప జిల్లా పేరు మార్పు

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన జిల్లా కడప. రాయల సీమ ప్రాంతానింకి చెందిన ఈ ప్రాంతానికి ఎప్పటినుంచి గుర్తింపు ఉందో ఇదమిద్ధంగా తెలియక పోయినా రామాయణంలోని కిష్కింధ కాండ ఈ ప్రదేశం లోనే జరిగినట్లు చెపుతారు. 7వ శతాబ్దంలో చైనా చరిత్ర కారుడు హుయాన్ త్సాంగ్ ఇక్కడ పర్యటించి గ్రంథస్తం చేసినట్టు తెలుస్తుంది. కనీసం పదవ శతాబ్దం నుంచి ఈ పేరుతొ ప్రసిద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. పదకొండవ శతాబ్దం నుండి చోళుల ఆధీనం లో ఉన్న కడప పధ్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. దరిమిలా క్రీ శ 1565 లో నిజాం చేత ఆక్రమించుకో బడింది. క్రీ శ 1800 లో నిజాం నవాబు సీడెడ్ జిల్లాలలో భాగంగా దీన్ని బ్రిటిష్ వారికి సమర్పించాడు. 1820 నుండి 1829 వరకు జిల్లా కలెక్టరు గా ఉన్న సి.పి.బ్రౌన్ ఇక్కడి భాష, సంస్కృతుల పై విశేష కృషి జరిపాడు. బ్రిటిష్ వారి హయాం లో Cuddapah గా వ్యవహరించ బడిన జిల్లా పేరును 2005 ఆగస్టు 19 నుండి తిరిగి అధికారికంగా Kadapa గా మార్చారు. ఈ ప్రాంతం యోగి వేమన, అన్నమా చార్యులు, పోతులూరి వీర బ్రహ్మం, కవయిత్రి మొల్ల మొదలైన గొప్ప కవులు, వాగ్గేయ కారులకు పుట్టినిల్లు. వీర...

ఎవరిదీ పాపం?

కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల్లో గత ఇరవై నాలుగ్గంటలుగా జరుగుతున్న దారుణ విలయం, అలాగే విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పొంచి వున్న ముప్పు కేవలం ప్రకృతి విలయం కాదనే విషయం హృదయాన్ని కలచి వేస్తుంది. ఈ పరిస్థితికి కారణం అహంకార పూరిత రాజకీయం, అధికారుల నిర్లక్ష్యం అని టీవీల్లో పేపర్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను. సుంకేసుల ఆనకట్ట నిండింది. అయినా గేట్లు తెరుచు కోకుండా మొరాయించాయి. ఫలితంగా మట్టికట్ట తెగిపోయి నీరు పొంగి పొర్లింది. ముందుగా కర్నూలు మునగడానికి ఇదే కారణం. వేసవి కాలం లో గేట్లకు సరియైన నిర్వహణ, పరిశీలన జరిపి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. శ్రీశైలం ప్రాజెక్టు పన్నెండవ గేటు ఇప్పటి వరకు తెరుచు కోలేదు. బాగా తుప్పు పట్టి తెరుచుకోక, ఒక ఉపకరణం విరిగి పొతే వెల్డింగు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదీ మన సన్నద్ధత. కొత్త ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించ డానికి ఉబలాట పడే ప్రభుత్వం పాత ప్రాజెక్టులు, చెరువుల మరమ్మత్తులకు పైసా విదిలించటం లేదని ఆరోపణ. నాగార్జున సాగర్ నీటిని నిలువ చేయడానికి ఉద్దేశించ బడింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని నిలువ చేయ డానికి రూపొ...

అధికారం

దివంగత ముఖ్య మంత్రి చని పోయి రెండు రోజులు కూడా కాలేదు. సంతాప దినాలు పూర్తి కావడానికి ఇంకా ఐదు రోజులున్నాయి. ఈ లోపలే కాంగ్రెస్ వారు కామెడీ మొదలు పెట్టారు. వీరి కామెడీకి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ముఖ్య మంత్రి పార్థివ శరీరాన్ని ఇంకా తీసుకు రాక ముందే కేబినేట్ మీటింగ్ ఒకటి పెట్టారు. ఒక సంతాప తీర్మానం, కడప జిల్లాని YSR జిల్లాగా మార్చాలని ఒకటి, జగన్ ని ముఖ్యమంత్రిగా నియమించాలని ఒకటి మొత్తం మూడు తీర్మానాలు చేసారు. మొదటి రెండు వరకు ఫరవా లేదు. ఒక కేబినేట్ మంత్రి వర్గం ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కొరకై సిఫారసు చేయడం... కామెడీగా లేదూ? ఇందులో అసలు కామెడీ ఏమిటంటే ముఖ్యమంత్రి చనిపోయాక, ఆయన నియమించుకున్న ఈ మంత్రివర్గం రద్దయినట్లే నని రాజ్యాంగ నిపుణులు సెలవిచ్చారు. మరి వీరి తీర్మానాలకు చట్ట బద్ధత ఏది? ఇక రెండోది కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం. వీరంతా సమావేశమై జగన్ మాత్రమే ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేశారట. వీరి తీర్మానం నాలిక గీక్కోవడానికి కూడా పనికి రాదు. వీరెందుకు హడావిడిగా ఇప్పుడు తీర్మానం చేయడం? ఒక వైపు అధిష్టానం ఈ విషయం పై ఏమీ మాట్లాడకండి అని చెపుతుంటే? మూడోది ఎమ్మెల్యేలు కూడా తీర్మా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...

అవినీతి మంత్రులకే తిరిగి పట్టం

కరుణానిధి చివరికి పంతం నెగ్గించుకున్నాడు. ఎ. రాజా, టి. ఆర్. బాలు తిరిగి కేంద్ర మంత్రులు కాబోతున్నారు. పరమ అవినీతి పరులని మన్మోహన్ సింగ్ మొత్తుకున్నా అతని మాట కరుణానిధి లెక్క చెయ్య లేదు. ఆ క్వాలిఫికేషనే DMK అధినేత వత్తిడికి ముఖ్య కారణం అని వేరే చెప్ప నవసరం లేదను కుంటాను. బాలు స్వయంగా తన కొడుకు కంపెనీకి గ్యాస్ సరఫరా కుంభకోణంలో ఇరుక్కుంటే, రాజా ఏమో 60,000 ల కోట్ల రూపాయల స్పెక్ట్రం అలోకేషన్ కుంభకోణం లో పాత్ర ధారి. ఇప్పుడు అవినీతి పూర్తిగా వ్యవస్తీకృత మైందన్న విషయానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదేమో? అధినేతలకు గాని, వారి అనుచరులకు గాని తమ అవినీతి భాగోతాలను ప్రజలు చూస్తున్నారన్న భయం ఏమాత్రం లేదు. వారు ఎంత సేపు ఎంత ఎక్కువ డబ్బు సంపాదించి వచ్చే ఎన్నికల్లో కొంత ఖర్చు పెట్టి నెగ్గుదామా అనే చూస్తున్నారు. అవినీతి వల్ల తాము ఓడిపోతామేమో అన్న ఆలోచనే లేదు. ఎన్ని అవినీతి కుంభకోణాలు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రబల సాక్ష్యంగా నిలుస్తుందాయే!

ఎన్నికల ఫలితాలు

ఎన్నికలు అయి పోయి ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ వారు తప్ప ప్రతి ఒక్కరు రాష్ట్రంలో హంగ్ వస్తుందనే అనుకున్నారు. కాని ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పీకల లోతు అవినీతిలో కూరుకు పోయి నప్పటికీ విజయం సాధించడం ఏ విపరిణామాలకు దారి తీస్తుందో నని భయంగా వుంది. చంద్రబాబు కాంగ్రెస్ అవినీతిపై పోరాటం చేసినప్పటికి అది ఆశించిన స్థాయిలో లేదు. కారణం సుస్పష్టం. చంద్ర బాబు ఏ విషయం లేవనెత్తినా కాంగ్రెస్ వారు దానికి ప్రతిగా గత తెలుగు దేశం పాలనలో జరిగిన ఉదంతాలను ఉదహరించి ఎదురు దాడికి దిగే వారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అంటే తామూ మచ్చ లేకుండా వుండటం ముఖ్యం. ప్రధాన ప్రతిపక్షంలో అది లోపించింది. పైగా కేంద్రంలో మన్మోహన్ సింగ్ మచ్చ లేని పాలన అందించడం కూడా కాంగ్రెస్ కి ఒక ప్లస్ అయింది. అంతకు ముందు తెదేపా పాలనలో అభివృద్ధికి కృషి జరిగినప్పటికీ అవినీతి, అట్టడుగు ప్రజానీకాన్ని, రైతులను పట్టించుకు పోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరింగింది. 2004 లో చంద్ర బాబు అధికారం లోంచి దిగి పోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు వ్యతిరేకత అలాగే వుంది. గత సంవత్సరంగా ఓటరులో మార్పు రాసాగింది. రాబందుల పాలన ఎలా వుం...

ఓటు ఎవరికి వేయాలి?

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయ నాయకులు వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నగదు బదిలీ, కలర్ టీవీలతో అగ్ర భాగాన నిలిచింది. మొదట వంద రూపాయలకే ఇంటి సరుకులు వగైరా హామీలతో ముందుకొచ్చిన ప్రజా రాజ్యం పార్టీ వెనుక బడింది. కాంగ్రెస్ అయితే ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచిత కరెంటు పథకాలు, జలయజ్ఞం ఇప్పటికే ఆచరించి చూపాం అంటుంది. ఇప్పుడు బీజేపీ కొత్తగా సెల్ ఫోనులు, పదివేలకే లాప్ టాపులు, బ్రాడ్ బ్యాండ్ వగైరాలతో బయలు దేరింది. మిగతా వారితో పోల్చి చుస్తే ఇది కొంచెం హైటెక్ గా కనపడుతుంది.. ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారో మరి! నిజానికి ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలే. ప్రజోపయోగమైనవే. అయితే ముఖ్య మైన ప్రశ్న ఏమిటంటే ఇవి ఎంత వరకు ఆచరణ సాధ్యాలు? రైతులు, చేనేత కార్మికులు ఆత్మ హత్యలు చేసుకునే తరుణంలో కలర్ టీవీలు అవసరమా? రెండువేల రూపాయలు ఎవరికి ఇస్తారు? లబ్ది దారులను గుర్తించటానికి ప్రాతిపదిక ఏమిటి? నిజంగా గర్భ దరిద్రులకే ఆ సొమ్ము చేరుతుందని భరోసా ఏమిటి? గతంలో తెదేపా హయాములో పనికి ఆహార పథకం బియ్యం నాయకుల ఇళ్ళలోకి పోయాయన్న విషయం జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఆ ...

ఎన్నికలు, ఓటు విలువ

ఎన్నికల నోటిసు వచ్చిన తరువాత రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కు తున్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తామనే ధీమాతో వున్నారు. చిరంజీవి గ్లామర్ మరియు సంతర్పణ హామీలు, చంద్రబాబు ఎల్లలు దాటిన సంతర్పణ, రాజశేఖర్ రెడ్డి ఇదివరకే చేసివున్న సంతర్పణ లపై నమ్మకం పెట్టుకున్నారు. వీళ్ళ మాటల వరస చూస్తుంటే వీళ్ళకు ప్రజలు తమ కాళ్ళమీద తామే నిలబడడం కంటే బిచ్చగాళ్ళ లాగా అడుక్కుంటే ఎక్కువ సంతోష పడతారేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెపుతుంటారు. వీళ్ళు ఎక్కడినుంచి తెచ్చి ఇస్తారు? ప్రజల డబ్బేగా? మనం ఇంకా జమీందారీ వ్యవస్థ లో నుంచి బయటికి రాలేదని అనిపిస్తోంది. ఎంత సేపూ ఎవరో రావాలి, ఏదో ఇవ్వాలి అని కోరుకుంటాం. నిన్న ఓ టీవీ ఛానల్ లో చూపించారు... ఒకరు ఫ్రిజ్ ఇస్తే వోటేస్తాం అంటున్నారు, ఇంకొకరు మరోటి ఇస్తే వోటేస్తాం అంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారి మాటలలో చెప్పాలంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ని రాబోయే ఐదేళ్ళలో ప్రవేశ పెట్ట బోతుంది. మూడు కోట్ల మంది వోటేస్తే చాలు గెలవడానికి. అంటే ప్రతి ఓటు విలువ రెండు లక్షల ముప్పై వేల పైమాటే. తమ వోటుకు ఇంత విలువ ఉందని సామాన్యులకు తెలువడం ...