Skip to main content

Posts

Showing posts with the label ఆలోచన

జూనియర్ డాక్టర్ల సమ్మె - ఒక దీర్ఘ కాలిక పరిష్కారం

జూనియర్ డాక్టర్ల సమ్మె మళ్ళీ మొదలైంది.  ప్రతి సంవత్సరం వీరి సమ్మె ఒక తంతుగా జరుగుతూ వస్తుంటుంది, మనం చూస్తుంటాం.  నిబంధనల ప్రకారం చదువు పూర్తయ్యాక వీరు తప్పని సరిగా గ్రామాల్లో ఒక సంవత్సరం పాటు చేయవలసి వుంటుంది. వీరి సమ్మె జరిగిన ప్రతిసారీ ఆ నిబంధనను తీసివేయడమే పరమావధిగా ఉంటుంది. గ్రామాల్లో డాక్టర్ల లభ్యత లేక పోవడం వల్ల ప్రభుత్వం కూడా ఆ విషయంలో సడలింపు ఇవ్వలేక పోతుంది. అవసరాలకు సరిపడా డాక్టర్లు లేకపోవడమే సమస్యకు మొత్తం మూలకారణంగా కనిపిస్తోంది. నగరాల్లో అధిక మొత్తంలో వేతనాలతో అవకాశాలు లభిస్తున్నప్పుడు ఊళ్లల్లోకి వెళ్లి స్టైపెండ్ పైనే ఉద్యోగం చెయ్యమంటే సహజంగానే వారికి నిరాశ కలుగుతుంది కదా. గొప్ప ఆశయాలతో, కొంత సేవా దృక్పథంతో వారు కూడా గ్రామాల్లో సర్వీస్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ పోటీ సమాజంతో అంతటి దేశభక్తి కాని, మానవతా దృక్పథం కాని కలిగిన వారు పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో జుడాలు మాత్రం అందుకు అతీతంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమో. వారు కోరుతున్నట్టు అధిక వేతనాలు ఇచ్చి ఊళ్లకు పంపవచ్చు, కాని దానివల్ల అనేక ఇతర ఇబ్బందులు, ఉద్యోగుల కేడర్ల వేతనాల...

బాబా దేవుడా, మనిషా?

సత్యసాయిబాబా శరీరావయవాలు చికిత్సకి సహకరిస్తున్నాయని తాజా వార్త. సంతోషం. గత వారం పది రోజులుగా రోజూ ఇలాంటి వార్తలే వస్తున్నాయి తప్ప ఇదమిద్ధంగా ఇది జరిగింది, దీనికి ఈ చికిత్స చేస్తున్నాం అని ఎక్కడా చెప్పడం లేదు. ఇలా ఇంకెంత కాలం చేస్తారో వేచి చూడ్డమే. ఈ మధ్యన రకరకాల వాదోపవాదాలు ఊపందుకుంటున్నాయి. సాయి దేవుడని కొందరు, కాదు మనిషే అని కొందరు. మొత్తానికి వీరందరూ అస్తికులే నండోయ్, నమ్మనివారు నాస్తికులనుకునేరు! అస్తికులంటేనే నమ్మేవారని అర్థం. నమ్మే వారంటే, తర్కం జోలికి వెళ్ళకుండా దేవునిపై విశ్వాసం ఉంచేవారనికదా అర్థం? ఎందుకంటే, ఎక్కడైతే తర్కం ఉంటుందో అక్కడ ప్రశ్న ఉంటుంది, మూఢవిశ్వాసానికి స్థానం ఉండదు. అటువంటప్పుడు అస్తికులై ఉండి కూడా సత్యసాయి దేవుడని నమ్మని వారినేమనాలి? నమ్మీ నమ్మనివారనా? సగం తర్కించి, సగం నమ్మే వారనా? ఏదేమైనప్పటికీ, వీరి మధ్య వాదనలు మాత్రం జోరుగానే నడుస్తున్నాయి. సాయి దేవుడైతే చికిత్సలు చేయడం ఎందుకు అని కొందరు. నిజమే మరి, సర్వ జనులను కాపాడే వాడికి తన శరీరం మీద కూడా ఆధిపత్యం ఉండాలి కదా! మరి కొందరు మాత్రం దేవుడైనా కూడా, మానవ రూపంలో ఉన్నప్పుడు అన్ని రకాలా ఈతి బాధలు తప్ప...

దేవుడికి ఒంట్లో బాగోలేదట

దేవుడికి ఒంట్లో బాగోలేదట! దైవభక్తులారా, మీరంతా తలో దేవున్ని పూజించండి, ఈ దేవున్ని బ్రతికించమని కోరుతూ. దేవుడైన వాడికి మా పూజలతో పనేంటి అనుకుంటున్నారా? ఒద్దొద్దు, కొత్త దేవుళ్ళకు ప్రజల తోనే పని. ప్రజాదరణే వారి బలం. మీరు పూజలు చేయండి, ఇళ్ళల్లో భజనలు చేయండి, ఎప్పటి మాదిరిగానే. వీలయితే పక్కింటి వారిని కూడా కలుపుకోండి. మంత్రులారా, మీకు మీ కమీషన్ల వ్యవహారాల్లో క్షణం తీరిక ఉండదని తెలుసు. భోలక్ పూర్ లో మునిసిపాలిటీ నీళ్ళు తాగి కుక్క చావులు చచ్చినా, మన్యసీమలో విషజ్వరాలొచ్చి  వందల మంది చచ్చినా అక్కడికెళ్ళే మాట దేవుడెరుగు, కనీసం అరగంట సమీక్షా సమావేశం ఏర్పాటు చేసే సమయం కూడా మీకు దొరకదని నాకు ముందే తెలుసు. అయినా అడుగుతున్నాను. మీరు వెళ్లి వారాల తరబడి దేవుడి పాదాల చెంతే ఉండండి. ఆయన తిరిగి లేచి తిరిగే దాకా కదలొద్దు, వదలొద్దు. రాష్ట్రం ఏమై పోతుందో అని భయం అవసరం లేదు. నడుస్తూనే ఉంటుంది ముక్కుతూ మూలుగుతూ, మీరున్నప్పుడు ఎలాగో, లేకపోయినా అలాగే. దేవున్ని మాత్రం కంటికి రెప్పలా చూసుకొండి. ముఖ్యమంత్రిగారూ, మీరు మాత్రం ఎందుకు? రాష్ట్రంలో ఏం వుంది గనక చేయడానికి? వెంటనే వెళ్లి దేవుడి సంగతి చూడండి. ...

అశ్వత్థామ, కుంజర న్యాయం

ధర్మరాజు మనకు ఒక గొప్ప న్యాయాన్ని అందించి వెళ్ళాడు. అదే అశ్వత్థామ, కుంజర న్యాయం. కురుక్షేత్ర సంగ్రామంలో అప్రతిహతంగా ముందుకు వెళ్ళుతున్న ద్రోణుడు, తన కుమారుడైన అశ్వత్థామ మరణిస్తే కానీ క్రుంగిపోయి ఓటమి చెందడని భావించిన ధర్మరాజు ఇలా అరుస్తాడు. 'అశ్వత్థామ హతః' కాని ఆయన ధర్మాత్ముడని పేరు. అబద్ధం చెప్పకూడదు. కాబట్టి వ్రతానికి భంగం కలగకుండా 'కుంజరః' అని మెల్లిగా అంటాడు. అప్పుడే అశ్వత్థామ అనే పేరుగల ఏనుగు మరణించడం కొసమెరుపు. ఆ విధంగా పుత్రుని మరణ వార్త తప్పుగా వినడం వలన అశక్తుడు గా మారిన ద్రోణున్ని పాండవవర్గం వారు సులభంగా చంపివేశారన్నది మిగతా కథ. ఇలా ధర్మరాజు చేత కనిపెట్టబడిన ఈ న్యాయాన్ని ఈనాడు మీడియా గొప్పగా ఉపయోగిస్తుంది. ఎలాగంటే, తమకు అనుకూలంగా ఉండే విషయం ఎంత చిన్నదైనా బాకా ఊది, బానరు కట్టి మరీ చెప్పడం. అలాగే తమకు ప్రతికూలంగా ఉండే విషయం ఎంత ముఖ్యమైనదైనా చెప్పీ చెప్పనట్టు వెనక పేజీలో చిన్నగా వేయడం. తద్వారా తమ వ్యతిరేకులను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ తర్వాత అంతం చేయడం. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయంలో పేర్కొన్న మీడియా మేనేజిమెంటు ఇలాంటిదే అని భావించ వచ్చు. ఇక పోతే ఒక మహానా...

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ ...

కుహనా సమైక్య వాదం, కుహనా ప్రత్యేక వాదం

ఇప్పుడు రగులుతున్న తెలంగాణా సమస్యలో ప్రధానంగా రెండు వాదాలు వినిపిస్తాయి. రాష్ట్రాన్ని విభజించాలని చెప్పే ప్రత్యేక వాదం ఒకటి కాగా, రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని చెప్పే సమైక్య వాదం ఒకటి. ప్రత్యేక వాదుల విషయానికొస్తే మొదలు చెప్పుకోవాల్సింది తెలంగాణా రాష్ట్ర సాధనం మాత్రమే సమస్యకు ఏకైక వికల్పంగా భావిస్తున్న తెలంగాణా ప్రాంతంలోని అత్యధిక శాతం మంది ప్రజలు, మేధావులు, రాజకీయులు. అలాగే ప్రత్యేక ఆంద్ర రాష్ట్రంతో మాత్రమే తమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పే ఆంధ్రా ప్రజలు, మేధావులు, రాజకీయులు. తెలంగాణా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై సానుభూతితో విభజన కోరుతున్న ఆంధ్రా ప్రజలు, మేధావులు. వీరందరూ ఏదో ఒక కారణంతో రాష్ట్ర విభజననే కోరుతున్నారు. ఇక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పే వాదనలు తెలుగు జాతి, తెలుగు జాతి సౌభ్రాతృత్వం, తెలుగు జాతి సమైక్యత చుట్టూ తిరుగుతుంటాయి. వీరి వాదనలో విపరీతమైన భాషాప్రేమ తప్ప మరేమీ కనిపించదు. సగటు తెలంగాణా పౌరుడు 'తన పొట్ట నిండడమా? తెలుగుపై ప్రేమా?' అన్న మీమాంసలో మొదటి దాన్నే ఎంచుకున్నాడని వీరు గుర్తించరు. తెలుగు జాతి సౌభ్రాత్వుత్వం గురించి మాట్లాడే వారికి, తమ సోదర...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...

దోపిడీ స్వభావం

మనిషి నాగరికత నేర్చుకుంటున్న కాలం నించీ అనివార్యంగా సాగుతున్న కార్యక్రమం దోపిడీ. కాలానుగుణంగా దోపిడీ స్వభావం మారింది కాని దోపిడీ అలాగే ఉంది. అసలు దోపిడీ అంటే ఏమిటి? ఒకడి కష్టార్జితాన్ని ఇంకోడు కొల్లగొట్టడం. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది, కష్టార్జితం కాకపొతే కొల్లగొట్ట వచ్చునా, అని. ఇవన్నీ నిర్ణయించడానికి, లెక్కగట్టడానికి కారల్ మార్క్స్ ఒక పెద్ద పుస్తకమే రాశాడు. ఇప్పుడు ఆవివరాలలోకి పోవడం నా ఉద్దేశం కాదు. ఆసలు ఈ దోపిడీ ఎలా పుట్టింది అని ఆలోచిస్తే, ఆదిమ సమాజంలోనే దీనికి బీజాలు పడి ఉంటాయి అని చెప్పక తప్పదు. మనిషి జంతువులా జీవించిన కాలంలో దోపిడీ అంతగా ఉండే అవకాశం లేదు. అయితే గియితే కుటుంబంలోనే బలవంతుడు బలహీనుడు నోటి దగ్గరి కూడు లాక్కునివుంటాడు. అది కూడా దోపిడీయే! కాని వ్యవస్థీకృతం కాదు. నాగరికత పెరుగుతున్న కొద్దీ జనం జానపదాలుగా (గ్రామాలు) గుమికూడడం మొదలు పెట్టారు. వ్యవసాయం చేసి కొంత అదనపు ధాన్యమో, పనిముట్లో కూడబెట్టుకోనే అవకాశం కలిగింది. ఇలా మొదలైంది ప్రైవేటు ఆస్తి. అయితే వ్యవస్థ పై నియంత్రణ లేక పోవడం వలన కొంత మంది బలవంతులు సహజంగానే బలహీనులను బెదిరించి ఇలా కూడబెట్టిన ఆస్తులను కొల్...

మతం మంచిదా, చెడ్డదా?

మతం మంచిదా, చెడ్డదా అనే విషయం మీద రక రకాల చర్చలు జరుగుతున్నాయి. మంచి, చెడుల స్వభావం గూర్చి గతం లోనే ఒక వ్యాసం వ్రాసి ఉన్నాను. మంచి, లేదా చెడు అనేవి విశ్వంలో ముందే నిర్ణయించ బడి లేవు. అవి దేశ కాల పరిస్థితుల కనుగుణంగా మారుతుంటాయి. ఒక దృష్టి కోణం లోంచి మంచిగా కనపడిన విషయం మరో దృష్టి కోణం నుంచి చెడుగా కనపడేందుకు ఎంతైనా అవకాశం ఉంది. ఇంతకీ మతమంటే ఏమిటి? మతమంటే ఒక మార్గం. ఒక జీవన విధానం. ఇప్పటి వరకు ఎన్నో మతాలు ఉద్భవించాయి, కొన్ని మతాలు స్థాపించ బడ్డాయి. చాలా మంది పుట్టుకతో మతాన్ని వారసత్వంగా పొందుతున్నారు. కొంతమంది ఇష్ట పడి మతాన్ని స్వీకరిస్తున్నారు. దార్శనికులైన వ్యక్తులు తాము చూసిన ప్రపంచం లోని రకరకాల అవకరాల గురించి తీవ్రంగా ఆలోచించి కొన్ని నియమాలను ప్రతిపాదిస్తారు. ఈ నియమాలనే జనానికి ప్రభోధిస్తారు. ఎక్కువ మంది జనం ఈ నియమాలు నిజంగా తమ సమస్యలని పరిష్కరిస్తాయని భావించినప్పుడు వారంతా ఒక మతంగా మారటం మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఇలా ఏర్పడ్డ మతంలోని అనుయాయులు తరువాత తరంలో తమ మత సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేక దిశలో పయనించడం కూడా చూశాం. ఉదాహరణలు కోకొల్లలు. క్రీస్తు, 'తప్పు చేయని వాడు మ...

అడవులు

ఈ మధ్య ఒక శుభ కార్యానికి హాజరు కావడానికి వరంగల్ జిల్లాలోని ఒక ఊరికి వెళ్లాను. ఇదివరలో చూసినప్పుడు ఆ వూరిలో నిండుగా చెట్లు ఉండేవి. ఈ సారి ఒక్కటి కూడా కనపడక పోయేసరికి ఊళ్ళో ఒకతన్ని విషయం అడిగాను. 'ఏం చెప్ప మంటారు సార్. పనికి ఆహార పథకం కింద ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నారు.' అని సమాధానం. పనికి ఆహార పథకం క్రింద ఉన్న పనుల్లో చెట్లు నరకడం ఒకటి. డబ్బులు పంచుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి కనపడిన చేట్టునల్లా నరికేస్తున్నారు. దీనివల్ల ఊరికి, పర్యావరణానికి ఎంత అపకారం జరుగుతుందో ఎవరికీ పట్టడం లేదు. నలభయ్యేడు డిగ్రీల ఉష్ణోగ్రత. ఎండా భగ భగ మండి పోతుంది. నిలబడదామంటే చెట్టు కనిపించ లేదు. 'ఊళ్ళో చెట్లు సరే, మరి ఇళ్ళల్లో చెట్లు ఏమయ్యాయి?' మళ్ళీ అతనే చెప్పాడు. 'ఈ మధ్య ఊరిలో వాస్తు పిచ్చి ఎక్కువయ్యింది. ఇంట్లో ఉండ కూడదని మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, యూకలిప్టస్ చెట్టు, పొప్పడి చెట్టు... ఇలా రక రకాల చెట్లను నరికేస్తున్నారు.' నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎవరు ఏది చెపితే అది నమ్మే ఈ జనం ఎప్పుడు బాగు పడతారో అర్థం కాదు! పల్లెటూళ్ళలో విద్యాగంధం లేని ప్రజలు ఇలా చేస్తుం...

ముఖ్యమంత్రి నివాసం, వాస్తు.

పొద్దున్నే వార్త. ముఖ్యమంత్రి గారు క్యాంపు ఆఫీసు లోకి మార బోతున్నారు. శుభం. కాని పూర్తిగా కాదట. నివాసం ఇప్పుడు అమీర్ పేటలో ఉన్న స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట. ఇంతోటి దానికి అరవై లక్షల ప్రజా ధనం తగలేసి వాస్తు ప్రకారం మార్పు, చేర్పులు చేయించారు. గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కన్నా ముందు ముఖ్యమంత్రులు తమ నివాసాల నుండే పరిపాలన సాగించే వారు. లోపాయికారీగా ప్రభుత్వ డబ్బులతో తమ ఇళ్ళను కావలసిన విధంగా రిపేర్లు కూడా చేయించు కునేవారనుకోండి, అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు, యన్టీయార్ కూడా దీనికి మినహాయింపు కాదు. రాజశేఖర రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంటికివెళ్ళ లేదు. ఏకాఎకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మకాం పెట్టేసారు. యుద్ధ ప్రాతిపదిక పై ముఖ్యమంత్రి అధికార నివాస నిర్మాణం ప్రారంభించారు. దీనికోసం దాదాపు పది కోట్లవరకు ఖర్చు పెట్టారు. దీని ఖర్చు పైన కొన్నివిమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి భద్రత, పాలనా సౌలభ్యం మొదలైన వాటి దృష్ట్యా ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేదు. కాని ఇప్పుడు రోశయ్య గారు స్వంత ఇంటిలో నివాసముంటూ అధికార గృహం నుంచి...

ఇంటర్నెట్లో అమెరికా, చైనాల కంటే ఎక్కువగా వెదక బడుతున్న దేశం?

గూగుల్ లో అమెరికా, రష్యా, చైనా, జపాన్ ల కంటే ఇండియా నే యెక్కువగా వెతుకు తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ?

మన విద్యా విధానం ఎటు వెళ్తుంది?

అందరం క్లాసులో నిశ్శబ్దంగా కూర్చున్నాం. అపుడు నేను REC వరంగల్ లో కొత్తగా చేరాను. మొదటి క్లాసు కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. రాబోయేది అయ్యంగార్ సార్. అందరికీ కొత్త కావడంతో భయం భయంగా కూర్చున్నాం. అందులో జరగ బోయేది మాథ్స్ క్లాసు. అయ్యంగార్ గారు రానే వచ్చారు. మొదట అందరిని పరిచయం చేసుకున్నారు. తనను తానూ పరిచయం చేసుకున్నారు. తరువాత చాక్ పీసు తీసుకుని బోర్డుపై అడ్డంగా ఒక గీత గీసారు. "ఇదేమిటి"? ఒకడిని లేపి అడిగారు. వాడు సరిగా చెప్పలేక పోయాడు. ఒకరిద్దరి తర్వాత ఒకడు చెప్పాడు. "X axis". "Good. మరి ఇదేమిటి?" ఇప్పుడు నిలువుగా గీత గీసి ఇంకొకడిని అడిగారు. ఈసారి వెంటనే వచ్చింది జవాబు. "Y axis". అలా ఒక్కొక్క బిందువును గుర్తిస్తూ, గీతలు గీస్తూ క్లాసులో ప్రతి ఒక్కరిని లేపి ప్రశ్నలు వేయ సాగారు. కొద్ది నిముషాల్లో మా భయం, బెరుకు పోయింది. అయన మాకో అధ్యాపకుడిగా కాక ఒక స్నేహితుడిగా కనిపించ సాగారు. ఉత్సాహంతో జవాబులు చెప్పడం మొదలు పెట్టాం.అలా అరగంట పాటు చర్చ కొనసాగింది. ఇంతలో నా స్నేహితుడు లేచి ఒక విషయం చెప్పాడు. "Yes, this is what exactly is call...

సత్యాన్వేషణ, రాగ ద్వేషాలు

'వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, చెప్పగలవాడు పుట్టలేదురా...' అన్నాడో సినీ గేయ కవి. ఎంత నిజం! గుడ్ అంటే ఏమిటి? సత్యం. సత్యం అంటే? నిజం. నిజం అంటే? ... మళ్ళీ సత్యానికొద్దాం. సంస్కృతంలో 'సత్' అంటే మంచి అనే అర్థం ఉంది. అంటే మంచి చేసేదే సత్యం, నిజమూను. మళ్ళీ మొదటికోచ్చామా? ఏది మంచి? ఏది చెడు? మంచి పని అంటే ఏమిటి? మనకు లాభం జరిగితే మంచా? నష్టం జరిగితే చెడా? మనకు నష్టం జరిగినా ఇతరులకు లాభం జరిగితే? దాన్నేమనాలి? ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రకారం ఎక్కువమందికి ఏది లాభం జరిగితే అదే మంచా? మరి తక్కువ మంది విషయమో? ఉదాహరణకు శ్రీలంకలో తమిళులు తక్కువ శాతం ఉన్నారు. అక్కడి చట్టాలు సింహళులకు మంచి చేసేవిగా ఉన్నాయి. అది మంచేనా? అంతెందుకు? మనం ఆఫీసులో ఎక్కువ గంటలు పనిచేస్తే ఆఫీసరుకు మంచి. ఇంట్లో ఎక్కువ గంటలు గడిపితే కుటుంబ సభ్యులకు మంచి. ఇలా ఆలోచించుకుంటూ పోతే... మంచి, చెడుల మధ్యన ఎంత అస్పష్టత దాగి వుందో తెలుస్తుంది. ఈ మంచి, చెడుల గురించిన ఆలోచనలు మనిషి ఆలోచించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్నాయనిపిస్తుంది. అన్ని మతాలు, అన్ని ఇజాలు తాము చెప్పేదే మంచి అని బోధిస్తాయి. నిజానికి ...

రోజు రోజుకి పెరుగుతున్న అవినీతి.

ప్రతిరోజూ పెరిగిపోతున్న అవినీతిని చూస్తుంటే భయమేస్తుంది. ఈ అవినీతికి అంతం లేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఒకప్పుడు లక్షలు, తర్వాత కోట్లు, ఇప్పుడయితే వందల కోట్లు, వేలకోట్లు! ప్రతి రోజు పేపరు చదువుతున్నప్పుడు వళ్ళు ఉడికి పోతుంది. లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. లక్ష మంది కైనా ఉపయోగ పడుతుందా అనేదే ప్రశ్న. బహుశా పాలక వర్గానికి చెందిన లక్ష మందికి ఉపయోగ పడుతుందేమో? ఈ రోజు జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్వ్యూ చూసాను. అయన చెప్పే విషయాలు కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. ఉదాహరణకి రెండు రూపాయలకు కిలో బియ్యం మరియు ఉచిత కరెంటు. ఉచిత కరెంటు కోసమై రెండొందల కోట్లు కర్చవుతుంది. రెండు రూపాయలకు కిలో బియ్యం ఉచితంగా పంచి పెట్టినా కర్చు 800 కోట్లు మించదు. అంటే లక్ష కోట్ల బడ్జెట్ లో ప్రజలకు వీళ్ళు తాయిలం వేసేది వెయ్యి కోట్లు. మిగతాతొంభై తోమ్మిదివేల కోట్ల రూపాయలు నిరాటంకంగా కైంకర్యం చేయడానికి ఇదొక రాజ మార్గం. ఆయన్ రాండ్ అనే ప్రముఖ రచయిత్రి మాటల్లో చెప్పాలంటే, "సంక్షేమకర్యక్రమల పేరుతో నిరంకుశత్వానికి బాట వేయడం చాలా సులభం". ఇప్పుడు రాష్ట్రం లో అదే జరుగుతోంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల బూచి చూపుతున్నారు. వాళ...