Skip to main content

సమస్యాపూరణం

శ్రీ కంది శంకరయ్య గారు నిర్వహిస్తున్న శంకరాభరణం బ్లాగులో ఇటీవల నేను చేసిన పూరణలు.

ఆ.వె.

జడలు ముడియ గట్టి జపమాల చేబట్టి
దొంగ స్వామి నగరి దూరి నంత
చేరె చక్రధరుని చెల్లియే తనచెంత
కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె

కం.

మిడిమేళపు దొర యొక్కడు
కడ గ్రేడు సిమెంటు వాడి కట్టగ డ్యామున్
నడిరేయి గండి పడెనట
గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్!

కం.

ఏమూలో దాగిన కవి
సాముగరిడి చేసె కంది శంకరు మహిమన్
ఆ మాన్యు ప్రోద్బలము చే
పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్.

కం.

హవ్వా యనగను సిబియై
చివ్వున బోఫార్సు కేసు చీపుగ మార్చెన్
ఇవ్విధమగు శోధనమున
పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్

తే.గీ.

రైతు మరచిన హైటెక్కు రాజకీయు
డతని నోడించి నొక 'దేవు' కందల మిడ
వేల కోట్లతో పుత్రు కుబేరు జేసె
పామునకు బాలు వోసిన ఫలిత మిదియె?

కం.

తానధికారము నుండగ
ఏనాడూ కానలేదు ఈయన రైతున్
కానగ రైతులపై అభి
మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్.

ఆ.వె.

దారి తప్పుటెల్ల తప్పుకాదెచటను
దారి మరచినంత తప్ప నగును
దారి వెతికి వెతికి దరిజేరకున్నను
దారి తప్పు వాడు; ధర్మ విధుడు

తే.గీ.

వీధివీధిలో భిక్షకై వేడుకొనగ
దొరకలేదెట నొక రొట్టె తునకయైన
కోర మృష్టాన్నమును; సద్ది కూడు, గొడ్డు
కార మొసఁగు జల్లదనము కన్నుఁ గవకు

కం.

లడ్లా స్వీట్లవి పడదుర
గ్రుడ్లా వద్దుర అరుగవు కుక్షికి బరువై
గుడ్లను కన్నీరు దిరుగు
ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

కం.

మర మనుషుల కాలంబున
తెరువరియై మనిషి జేయ దీటుగ క్లోనింగ్
అరయగ నచ్చెరువెందుకు?
"సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్"

తే.గీ.

పరమ గురువు నిత్యానంద బాబ యైన
కల్కి భగవానుడని చెప్పు కపటుడైన
తనకు కోర్కెలు కలిగి సందడిని చేయ
యతి విటుఁడు గాకపోవునే యతివ బిలువ.

కం.

ఓదార్పు యాత్రలనుచును
గోదాలో దిగిన జగను కొంపల పైనన్
సోదా జరుగునని తలచి
ఆదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్.

కం.

భాషించడు దుర్భాషలు
ద్వేషించడు వెనుక గొయ్యి తీసెడు జనులన్
దోషుల గాంచుచు పలుకక
రోషమ్మును వీడు వాడె రోషయ్య యగున్

కం.

ఓదార్చెద నేనంచును
ఓదారుపు యాత్ర చేయ నొక్కడు వెడలెన్
'ఓదార్పు' పదవి కైనను
ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!

కం.

వినినంత జనులు ఆగక
తనగొప్పలు చెప్పి చెప్పి దంచుచు ఊకన్
జనులను ఊదర గొట్టగ
వినువారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.

Comments

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...