Skip to main content

గ్రేటర్ రాయలసీమ, గ్రేటర్ తెలంగాణా

శ్రీకృష్ణ కమిటీ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ ఎంపీలతో జోరుగా మంతనాలు జరుపుతుంది. సమస్య కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పరిష్కారమైతే చాలు, పరిష్కారం వచ్చినట్టే అనిపిస్తోంది. కానీ సీమాంధ్ర వారిని, తెలంగాణా వారిని ఒకే పరిష్కారం దిశగా ఒప్పించడం నిజంగా కత్తి మీద సామే. ఈ విషయంలో చిదంబరం గారు ఎలా నెట్టుకొస్తారో చూడాలి.

జస్టిస్ శ్రీకృష్ణ గారికి కర్ర విరక్కుండా, పాము చావకుండా నివేదికలు సమర్పిస్తారనే పేరు ఉంది. కానీ ఈ నివేదిక విషయంలో ఆయన పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి. కమిటీ వారి వద్దకు వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు చేసిన సూచనలు క్రోడీకరించారని మాత్రమే చెప్పాలి. అది తనంత తానుగా కొత్త పరిష్కార మార్గాలకు అన్వేషించినట్టుగా కనపడదు. కనీసం వివిధ ప్రజా సంఘాలు చేసిన గ్రేటర్ రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ లాంటి కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయమై TG వెంకటేష్ లాంటివారు నిరసన వ్యక్తం చేశారు కూడా.

ఏ పరిస్థితిలోను సీమాంధ్రతో యధాతథంగా కలిసి ఉండటానికి తెలంగాణా వారు ఒప్పుకోరని శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది. అయితే తనంత తానుగా అలాంటి మార్గాలను అన్వేషించ డానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బహుశా అది తన విధివిధానాలలో లేని అంశమని భావించ వచ్చు.

తెలంగాణా వారు సీమాంధ్రులతో కలిసి ఉండడం ఒప్పుకోనట్టే, రాయలసీమ వారు కూడా కోస్తా ఆంధ్రతో కలిసి ఉండడం ఒప్పుకోవటం లేదు. సమైక్యంగానైనా ఉంచండి, లేదా రాయలసీమ (వీలైతే గ్రేటర్ రాయలసీమ) రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని వారు చెపుతున్నారు.

కోస్తా పెట్టుబడిదారులపై తెలంగాణా వారు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో, వారికీ అలాంటి భయాలే ఉన్నాయి. ఇప్పటికే వారు  శ్రీబాఘ్ ఒప్పందం తుంగలో తొక్కారని ప్రతి వేదికపై కోస్తాంధ్ర వారిపై ఆరోపణలు చేస్తుంటారు. అయితే రాష్ట్రం సమైక్యంగా ఉన్నంత వరకు ఈ లుకలుకలు కనపడవు. విడిపోయే పరిస్థితి వచ్చినపుడు మాత్రం ఇవన్నీ తప్పక బయటికి వస్తాయి. అయితే ఇవి తెలంగాణా/ఆంధ్ర వంటి జటిలమైన సమస్యలు కాక పోయినా వీటిని పూర్తిగా త్రోసివేయలేం.

ఇటువంటి పరిస్థితిలో కోస్తాని రెండు ముక్కలు చేసి, రాయలసీమకు తెలంగాణాకు ఒక్కోటి కలిపివేసి రెండురాష్ట్రాలు గా చేసే ఆలోచన చేసిఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కోస్తా వారిపై తెలంగాణా వారిదే మెజారిటీ అవుతుంది కాబట్టి తెలంగాణా వారు ఈ ప్రతిపాదనకి ఒప్పుకునే అవకాశం ఉంది. పైగా తెలంగాణాకి ఓడ రేవుల సమస్య కూడా తీరుతుంది. హైదరాబాదుపై , నదీజలాలపై కోస్తావారికున్న భావోద్వేగాల దృష్ట్యా కోస్తా వారు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం ఉంది. రాయలసీమ వారు మొదటి నుండి గ్రేటర్ రాయలసీమ కావాలంటున్నారు కాబట్టి వారు కూడా సంతోషించే అవకాశం ఉంది.

నిజానికి ఇలాంటి ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజల వద్దనుండి వచ్చాయి. వారు చేసిన ఆరు ప్రతిపాదనలకి తోడుగా ఏడోదిగా దీన్నికూడా చేర్చి ఉంటే చర్చకు కొంత అవకాశం ఉండేది. అలాగే కేంద్రప్రభుత్వం కూడా అన్ని వర్గాలతో ఈ ప్రతిపాదనని అంగీకరింప చేసేందుకు ప్రయత్నించేదేమో. ఏదేమైనా ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రతిపాదనకి తెర పడినట్టే. 
  

Comments

Popular posts from this blog

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...