Skip to main content

పోలవరం ప్రాజెక్టు

పోలవరం పై మళ్ళీ హడావుడి మొదలైంది. ఒక నాయకుడు పోలవరం అంటూ రక రకాల డ్రామాలాడి, ఇప్పుడు అధికారా పార్టీ నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అంటూ ఎదురు చూపులు చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకో నాయకుడు ఇన్నాళ్ళూ అధికార పార్టీ అందలం ఎక్కిస్తుందని వేచి చూచి, ఇక ఎదురు దాడి మాత్రమే శరణ్యమని తలచి అదే అదే పోలవరం డ్రామాను మరింతగా రక్తి కట్టించడానికి సిద్ధమౌతున్నాడు.

భారత దేశంలోని ప్రాజెక్టులలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టులలో పోలవరం మొదటిదిగా నిలుస్తుంది. దీన్ని ఒకవైపు గిరిజన జాతులవారు వ్యతిరేకిస్తుంటే, రెండో వైపు పర్యావరణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా దీన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా కోర్టుకే వెళ్ళింది. CPI, TRS వంటి రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.



ఒక ప్రాజెక్టును ఇంతమంది వ్యతిరేకించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల రెండువందలకు పైగా గ్రామాలు, రెండు లక్షలకు పైగా జనాభా నిర్వాసితులు అవుతున్నారు. వీరిలో సింహభాగం గిరిజనులు. 1,47,597 ఎకరాల భూమి నీటిలో మునిగి పోతుంది. ఇలా మునిగిపోయే భూమిలో ఎంతో ప్రకృతి సంపద, నల్లమల కొండల అందాలు కప్పబడి పోబోతున్నాయి. ఇక ముంపుకు గురయ్యే ప్రాంతానికి చెందిన వన్య ప్రాణులు లెక్క లేనన్ని. ఒక వన్య ప్రాణి సంరక్షక క్షేత్రం, బొగ్గు గనులు, పురాతత్వ నిర్మాణాలు, వ్యవసాయభూములు ఈ ప్రాజెక్టు వల్ల ముంపుకు గురికాబోతున్నాయి. ప్రఖ్యాతి చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రం కూడా ఈ ప్రాజెక్టు వల్ల మునిగిపోబోతోంది.

అంతేకాదు, గోదావరి వరదల ఉధృతి ఎంతగా ఉంటుందో మనకు ఇప్పటికే అనుభవ పూర్వకంగా తెలుసు. 2009 వ సంవత్సరంలో కృష్ణానది పై వచ్చిన వరదలు కర్నూలును నాలుగు రోజుల పాటు ముంచి వేశాయి. పోలవరం కట్టాక అలాంటి వరదలే పెద్ద పెట్టున వస్తే, ఆ నీటిని క్రిందికి వదలాల్సిన పరిస్థితులు వస్తే రాజమండ్రి లాంటి పట్టణాలకు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ భయాలు స్వయానా అక్కడి MP హర్ష కుమార్ వెల్లడించారు.

ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తే 2,32,000 ఎకరాలకు నీటిని సరఫరా చేస్తుంది. అంటే కనీసం మునిగి పోతున్న భూమికి కనీసం రెట్టింపు కూడా కాదు.

భారీ ప్రాజెక్టుల వల్ల ప్రాంతీయ అసమతుల్యతలు పెరుగుతాయనే వాదన ఒకవైపు ఉంటే, ఇప్పటికే ప్రాజెక్టులు ఉండి, నీటి లభ్యత ఉన్నచోటే మరిన్ని ప్రాజెక్టులు కట్టడం ఎంతవరకు హేతుబద్ధం అనే వాదన ఉంది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం అనుమతులకోసం, నిధులకోసం ప్రయత్నిస్తూనే, అవేమీ రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆఘ మేఘాల మీద వేళ కోట్ల రూపాయలు వెచ్చిచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి నిధులు అన్ని అనుమతులు ఉండి, సాధికారికమైన ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు కలిగి వుండి, ఏళ్ల తరబడి పూర్తికాకుండా వున్న కరువు ప్రాంతాలలోని ప్రాజెక్టులకు కేటాయించ వచ్చు. కానీ దోపిడీ వర్గాలకు కీలు బొమ్మగా ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వంనుండి అలాంటి పనులు ఆశించలేం.

Comments

  1. nallamala kondalu kadu mastaru...papi kondalu

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...