Skip to main content

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను. 




కావలసిన పదార్థాలు:

మైదా పిండి  150 గ్రా 
బియ్యం పిండి 50 గ్రా 
చక్కెర  75 గ్రా 
ఉప్పు చిటికెడు 
ఏలకులు రెండు 
లవంగాలు రెండు 
దాల్చిన చెక్క ఒక ముక్క 
పాలు కలపడానికి తగినన్ని 
కుకింగ్ బటర్ లేదా నెయ్యి 50 గ్రా 
గ్రుడ్డు ఒకటి (పచ్చసొన మాత్రమే)
బేకింగ్ సోడా  చిటికెడు 
బేకింగ్ సాల్ట్ చిటికెడు  

తయారు చేసే విధానం: 

ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె వరకు పిసుక్కోవాలి. గ్రుడ్డు వేసేటప్పుడు మాత్రం పచ్చ సొన మాత్రమే వేయండి. రెండూ కలిపి వేస్తే నీసు వాసన వచ్చే అవకాశం ఉంది. పిండి చపాతి పిండి మాదిరి గట్టి తనంతో ఉండాలి. ప్లాట్ ఫారం మీద పొడి పిండి వేసి (అంటుకోకుండా ఉండడానికి) రొట్టెల కర్రతో పావు అంగుళం మందం వచ్చేటట్టుగా వత్తుకోవాలి. తర్వాత ఏదైనా ఒకటిన్నర అంగుళాల వ్యాసం కలిగిన గ్లాసు లాంటి పాత్ర ఉపయోగించి బిస్కట్లుగా కట్ చేసుకోవాలి. ఇతర షేపుల్లో కావాలంటే కత్తితో కట్ చేసుకోవాలి. లేదా రకరకాల షేపులు మార్కెట్లో దొరుకుతాయి.

తర్వాత బేకింగ్ ట్రే తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. ఆ నూనెకి అంటేలా పొడిపిండి చల్లాలి. బిస్కట్లను ట్రే లో అమర్చుకోవాలి. 

బేకింగ్ చేసే విధానం: 

ముందుగా ఓవెన్ ని 170 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ప్రీ-హీట్ చేసుకోవాలి. తర్వాత బిస్కట్లు పెట్టి 170 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 12 నుండి 14 నిమిషాలు బేక్ చేయాలి. బేక్ అయిన బిస్కట్లను ఫ్యాను క్రింద పది నిమిషాలు ఆరబెట్టి తర్వాత డబ్బాలో నిలువ చేసుకోవాలి. 

మరి తయారు చేసి చెప్తారు కదా, ఎలా ఉన్నాయో. ఇంకేమైనా మార్పులు, చేర్పులు, సలహాలు ఉంటే క్రింద కామెంట్ల రూపంలో రాయండి.

Comments

  1. దాంక్స్. నేను ఇవి చేసేసి ఎలా ఉన్నాయో చెప్తాను. నాకు ఉస్మానియా బిస్కట్లంటే చాలా ఇష్టం.

    ReplyDelete
  2. ధన్యవాదాలండీ జ్యోతి గారు. మీరు చేసాక మార్పు చేర్పులుంటే తప్పక సూచించండి.

    ReplyDelete
  3. http://appalaraj.blogspot.com/2011/02/blog-post.html

    ReplyDelete
  4. నాక్కూడా ఇవి చాలా ఇష్టం. నేను మా ఆవిడను బతిమాలి ఒప్పించాను. పైన చెప్పిన విధానం చాలా సులభంగానే అగుపించిందట మరి. చూద్దాం.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...