Skip to main content

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది.

అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు. 

ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు.

ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది.

హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గురించి నాకు ఎప్పుడూ ఏదో కొంచెం డౌటు గానే ఉంటుంది. వీరి ఉద్దేశం ఏమిటసలు?  అన్ని మతాలు సమానమే అని చెప్పడమా? అన్ని మతాలకు సమాన అవకాశాలు ఇవ్వడమనా? ఏ మతానికి పక్షపాతం   చూపకూడదనా?  అసలు కామన్ సివిల్ కోడు ఉండాలా, లేక అన్ని మతాలకూ వేర్వేరు వెసులుబాట్లు ఉండాలా? ఒక మనిషిని విచారించే టప్పుడు మనిషిగా విచారించాలా? లేక హిందువుగానో, ముస్లిముగానో, క్రిస్టియను గానో విచారించాలా? అసలు ముందు మనం లౌకికవాదాన్ని సరిగా నిర్వచించు కోవాలేమో ననిపిస్తుంది. ఈ విషయంలో ఎవరైనా వివరణ ఇస్తే బాగుంటుంది.

ఈ మధ్య ఇంకో వాదం కూడా పుట్టుకొచ్చిందండోయ్! అదే, కుహనా లౌకికవాదం. ఈ వాదం ప్రత్యేకం ఏంటంటే, మేం కుహనా లౌకిక వాదులమని ఎవ్వరూ చెప్పరు. కానీ లౌకికవాదులం అని చెప్పుకునే వారికి ఇతర లౌకికవాదుల నుండి కానీ, వారి వ్యతిరేకుల నుండి కానీ 'కుహనాలౌకికవాదులు' అనే బిరుదు అప్పుడప్పుడు ఇవ్వబడుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్ట పడక్కర్లేదు. పైకి లౌకిక వాదులమని చెప్పుకుంటూ ఏదో ఒక మతానికి కొమ్ము కాసే వారే కుహనా లౌకికవాదులు.   

రాసే ఓపిక లేదు కానీ, ఇలా చాలా ఉన్నాయి వాదాలు. కొన్ని వింతైన వాదాలని మాత్రం చర్చిద్దాం. స్త్రీవాదం, పురుషవాదం. ఆపైన మానవతావాదం.

స్త్రీవాదం అంటే, స్త్రీల హక్కులని, ఆత్మగౌరవాన్ని, వగైరా వగైరాలని కాపాడాలని చెప్పేదే స్త్రీవాదం. అంటే మగవాల్లేమై పోయినా  ఫరవాలేదన్న మాట! ఆగండాగండి. మగవారి కోసం కూడా ఒక వాదం ఉంది. అదే పురుషవాదం, బహుశా మగ హక్కుల పోరాటం అనుకుంటాను. ప్రపంచాన్నే నడిపేది మగవాల్లైతే ఇంకా వారికి హక్కులేమిటి అనుకుంటున్నారా? అసలు మగవారికే ఏ హక్కులూ లేక ఇబ్బందులు పడుతున్నారని వీరంటున్నారు మరి! 

మరి కొంత మంది మగాలేదు, ఆడాలేదు ఉన్నది మానవతా వాదమే అంటున్నారు. ఈ మానవతావాదం అంటే ఏమిటో సరిగ్గా తెలియటం లేదు. మానవుడు సరిగ్గా ఉంటే చాలు, మిగతా ఏమైనా ఫరావాలేదనా? మిగతా అంతా సరిగా లేకపోతే మానవుడు కూడా సరిగ్గా ఉండ లేడుగా? మానవుడే సర్వశక్తి సంపన్నుడు అని చెప్పడమా? అందరు మానవులు సమానంగా ఉండాలని చెప్పడమా? ప్రపంచం నుండి మానవుణ్ణి చూడ్డం కాకుండా మానవుడి నుండి ప్రపంచాన్ని చూడడమే మానవతావాదం అనుకుంటా. అంటే మానవుడే ప్రపంచానికి కేంద్రం అన్న మాట! మరి మీరేమంటారు? 

Comments

  1. కమ్యూనిజం గురించి అర్థం కావాలంటే సమాజం గురించి సమగ్రంగా అర్థం కావాలి. కమ్యూనిజంలో ఒకరి పని చేసి ఇంకొకరు పని చెయ్యకపోవడం జరగదు. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందినప్పుడు 8 గంటల పని 5 గంటలకి తగ్గాలి. కానీ పెట్టుబడిదారుడు వేగంగా పని చేసే కొత్త యంత్రాలు వస్తే కార్మికుల పని గంటలు తగ్గించడు. అవసరమైతే కార్మికుల సంఖ్యని తగ్గించుకుని ఖర్చు మిగుల్చుకుంటాడు. స్త్రీవాదం విషయానికి వద్దాం. స్త్రీవాదానికి ప్రత్యామ్నాయం ఉందనుకోను. ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించినా స్త్రీ-పురుష సంబంధాల విషయంలో మూఢనమ్మకాలు పోలేదు. USAలో ఒకప్పుడు తెల్లజాతివాడు నల్లజాతి స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు కానీ తెల్లజాతి స్త్రీ నల్లజాతి పురుషుడిని పెళ్లి చేసుకోకూడదు అని చట్టం ఉండేది. మన దేశంలోనూ ఒక ఇంజినీర్ అమ్మాయిని టీచర్ ఉద్యోగం చేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఒప్పుకోరు. అదే ఇంజినీర్ అబ్బాయి తన కంటే లో ప్రొఫైల్ ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. స్త్రీవాదం లేకపోతే పురుషాధిక్యత ఉంటుంది కానీ మూడో ప్రత్యామ్నాయం ఉండదు.

    ReplyDelete
  2. మరి కెలుకుడువాదం సంగతేమిటి అధ్యక్షా?

    ReplyDelete
  3. హరి గారు. మీరు నీహారిక పోస్ట్ చదివి ఇక్కడ స్త్రీవాదం గురించి వ్రాసారని నాకు తెలుసు. ఆవిడకి స్త్రీవాదం గురించి అర్థమైనట్టు లేదు. మగవాడు అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్య క్షమిస్తుంది. ఆడది అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త వెంటనే విడాకులు ఇస్తాడు. ఇప్పటి సమాజంలో మగవాళ్లకి ఉన్న హక్కులు ఆడవాళ్లకి లేవు. అటువంటప్పుడు స్త్రీవాదానికి ప్రత్యామ్నాయం ఎక్కడ ఉంటుంది?

    ReplyDelete
  4. ప్రవీణ్ గారు,

    కమ్యూనిజం ఒక ఉదాత్తమైన భావనే, కాని అది ఒక వ్యవస్థగా ఇప్పటివరకు ఎక్కడా సఫలం కాలేదు.

    ఒక ప్రభుత్వరంగ సంస్థలో పని చేసిన వాడిగా చెపుతున్నాను. ఉద్యోగభద్రత ఉన్నా కూడా నిజాయితీగా పని చేసేవారు 70% మంది ఉంటారు. కానీ మిగతావారు మాత్రం disciplinary actionsకి భయపడి మాత్రమే పని చేస్తారు. కమ్యూనిజంలో disciplinary actions అంటే నియంతృత్వాన్ని ఆహ్వానించడమే. కాబట్టి మంచో చెడో, మనిషిని భయ పెట్టకుండా, డబ్బాశ చూపి పనిలోకి లాగేది ప్రజాస్వామిక పెట్టుబడిదారీ విధానమే.

    ReplyDelete
  5. మలక్‌పేట్ రౌడీ గారు,

    కొంపదీసి ఇది కెలకడ మనుకుంటున్నారా ఏంటి? అందరూ రకరకాల వాదాల గురించి రాస్తుంటే, ఏదో నాకు తోచింది రాశానంతే.

    ReplyDelete
  6. ప్రవీణ్ గారు,

    నా టపాలో స్త్రీవాదం గురించి ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. అయితే పురుషుణ్ణి విస్మరించే స్త్రీవాదం వద్దంటాను. పురుషుణ్ణి కూడా కలుపుకొని వెళ్ళే స్త్రీవాదం కావాలి.

    ReplyDelete
  7. మిమ్మల్ని కాదండీ. అందరికీ అన్నివాదాలున్నత్టే మాకు కూడా కెలుకుడువాదం ఉంది. మీరు దానిని ప్రస్తావించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం!

    ReplyDelete
  8. ప్రజాస్వామిక పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి? పూర్వం జాన్ మేనార్డ్ కీనెస్ అనే పెట్టుబడిదారీ ఆర్థికవేత్త ఉండేవాడు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే పెట్టుబడిదారులకి లాభాలు పెరుగుతాయి, కనుక పెట్టుబడిదారులు కార్మికులకి జీతాలు పెంచాలని వాదించాడు. మొదట్లో అతని వాదనలని పెట్టుబడిదార్లు పట్టించుకోలేదు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ గెలిచింది. అప్పుడు పెట్టుబడిదార్లు తమ ఆర్థిక విధానాలు మార్చుకోవలసిన పరిస్థితి వచ్చింది. 1950 తరువాత యూరోపియన్ దేశాలలో మోటర్ వాహనాల పరిశ్రమ అభివృద్ధి చెందడంతో కార్మికుల జీతాలు పెంచడం సులభమయ్యింది. 1991లో గోర్బచేవ్ సోవియట్ యూనియన్‌ని రద్దు చేసిన తరువాత పెట్టుబడిదారులు కీనెసియన్ విధానాలని త్యజించారు. రొనాల్డ్ రీగన్ ఆర్థిక విధానాలపై ఆసక్తి చూపించారు. పెట్టుబడిదారీ విధానంలో కూడా ఆర్థిక విధానాలపై అంతర్గత & బాహ్య పరిస్థితుల ప్రభావాలు చాలా ఉంటాయి.

    ReplyDelete
  9. మలక్‌పేట్ రౌడీ గారు,

    అలాగా, మీరు ఆ పదాన్ని ఎక్కడా coin చేసినట్లు లేదు. అందుకే మిస్సయినట్టుంది.

    ReplyDelete
  10. ప్రవీణ్ గారు,


    ప్రజస్వామిక పెట్టుబడిదారీ విధానమంటే, నా ఉద్దేశంలో capitalist setup in democracy అని.

    ఇప్పటివరకు వచ్చిన రాజకీయ వ్యవస్థలలో ప్రజాస్వామ్యమే గొప్పదని మీరు ఒప్పుకుంటారనుకుంటాను. ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకుండా కమ్యూనిస్టు వ్యవస్థ నడపడం ఇంతవరకు ఆచరణలో సాధ్యం కాలేదు అనే విషయం కూడా మీకు తెలుసు.

    ReplyDelete
  11. కమ్యూనిజం సాధించాలంటే ఉత్పత్తి శక్తులు బాగా వృద్ధి చెందాలి. సోవియట్ యూనియన్‌లో వనరులు ఉన్నంత వరకు అది బలమైన శక్తిగానే ఉండేది. కృష్చేవ్ టైం నుంచి వనరుల కొరత, ఉన్న వనరుల వినియోగంలో సమగ్ర విధానం లేకపోవడం వంటి వాటి వల్ల సోవియట్ యూనియన్ బలహీనపడింది. ఈ విషయాలన్నీ తెలకపల్లి రవి గారు సోషలిజం విజయాలు - విచ్ఛిన్నాలు' అనే పుస్తకంలో వ్రాసారు. విప్లవం అనేది బల ప్రయోగంతో వస్తుంది కానీ ఉత్పత్తి శక్తులు బల ప్రయోగంతో పెరగవు కదా. అందుకే లెనిన్ అన్నాడు Communism cannot be implemented by force అని. ఇదంతా చారిత్రక భౌతికవాదం చదివితేనే అర్థమవుతుంది.

    ReplyDelete
  12. ప్రవీణ్ గారు,

    గతితార్కిక భౌతికవాదం, చారిత్రిక భౌతికవాదం మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ ఏరిన రచనలు అంతో ఇంతో నేనూ చదివానండీ. ప్రగతి ప్రచురణాలయం వారి పుస్తకాలు ఒక బీరువా నిండా ఉన్నాయి మా ఇంట్లో - మా నాన్నగారు కొన్నవి. పుస్తకాలు రెండు వైపులా వుంటాయి. స్టాలిన్ కాలం నాటి రష్యా జీవన విధానం ఎలా వుండేదో కళ్ళకు కట్టినట్టు తెలియాలంటే Ain Rand వ్రాసిన We The Living అనే పుస్తకం చదవండి. ఆమె కమ్యూనిస్టు రష్యాలో స్వయంగా అనుభవించి రాసిన విషయాలు సామ్యవాదంలొ ఉన్న evilsను బహిర్గతం చేస్తాయి.

    కమ్యూనిజం సాధించాలంటే ఉత్పత్తి శక్తులు బాగా వృద్ధి చెందాలి

    అభివృద్ధి చెందేదెప్పుడు? అందరూ పని చేసినప్పుడు కదా?

    కృష్చేవ్ టైం నుంచి వనరుల కొరత, ఉన్న వనరుల వినియోగంలో సమగ్ర విధానం లేకపోవడం వంటి వాటి వల్ల సోవియట్ యూనియన్ బలహీనపడింది

    రష్యాలో వనరుల కొరత ఎప్పుడూ లేదు. పైగా అతి పెద్ద చమురు నిక్షేపాలు ఉన్న దేశం అది. చైనాలా అధిక జనాభా కూడా లేదు. మీరనే సమగ్ర విధానం ఇండియాలో కూడా లేదు. అయినా మనదేశం అంతో ఇంతో అభివృద్ధి సాధిస్తుంది, ఎన్నో రుగ్మతలు ఉన్నా కూడా. Capitalism లో ఉన్న beauty ఏమిటంటే, ఎవరో ఎక్కడో కూర్చొని విధానాలు ప్రకటించ నవసరం లేదు. System itself will take care of certain things.

    కమ్యూనిజం మీద నా అభిప్రాయాలను వివరంగా మరో టపా వేస్తాను. ఆప్పుడు దానిగురించి చర్చిద్దాం.

    ReplyDelete
  13. Russia was 80% industrialised in Stalin's era. But even in Stalin's era, southern republics like Tajikistan heavily depended on agriculture. I read books like "The Stalin Era" written by Anna Louise Strong and also articles written by John Bellamy Foster and Harry Magdoff etc.

    ReplyDelete
  14. హరి గారు,
    ఒక మనిషిని మనిషిగా గుర్తించడం, మనిషిని మనిషిగా బ్రతకనివ్వడం, మనిషి తన మనసుకు నచ్చిన పనిని చేసుకోనివ్వడం, సాటి మనిషిని గౌరవించడం, ధర్మ, అర్థ, కామ, మోక్షాల సాధనకై ప్రయత్నించడం మానవతా వాదం.

    ReplyDelete
  15. >>ఒక మనిషిని మనిషిగా గుర్తించడం, మనిషిని మనిషిగా బ్రతకనివ్వడం,>>
    yaaaaawns (((((

    ReplyDelete
  16. నీహారిక గారు. మనిషికి, సమాజానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. స్వేచ్ఛా, సమానత్వం, మానవత్వం లాంటి వాటిని ఆచరించడం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. స్లమ్ ఏరియాకి చెందిన బాలుడు బ్యాంక్ ఆఫీసర్ కొడుకు పుట్టిన రోజు ఫంక్షన్‌కి వెళ్లగలడా? బ్యాంక్ అధికారి కొడుకు అతని కంటే చాలా ధనవంతుడైన మంత్రి కొడుకుతో కలిసి తిరగగలడా? డబ్బుని బట్టి మనిషికి విలువ ఇచ్చే సమాజం ఇది. ఇక్కడ ఆర్థిక అసమానతల గురించి మాట్లాడకుండా మానవత విలువల గురించి మాట్లాడలేము. ఇందులో ఒకదానినుంచి ఇంకొకటి విడదీయలేని విషయాలు ఉన్నాయి. ఎంత స్వార్థపరుడైనా కేవలం డబ్బు సంపాదించడంతో సరిపెట్టుకోడు. అతను కూడా సమాజంలో తనకొక ఐడెంటిటీ ఉండాలనుకుంటాడు. డబ్బు/ఆర్థిక స్థితిని ఐడెంటిటీకి ఒక సాధనంగా వాడుకుంటాడు. అతను సామాజిక పరిస్థితులని తనకి అనుకూలంగా వాడుకుంటాడు కానీ సమాజం నుంచి వేరు పడాలనుకోడు. ఆర్థిక అంశాలని విడదీసి మానవత విలువల గురించి మాట్లాడితే మానవత విలువలు సాధించలేము.

    ReplyDelete
  17. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  18. Mr.ప్రవీణ్,
    నేను ఆర్ధిక అంశాన్ని ఎక్కడ విడదీసాను? ' అర్ధ ' అంటే ధనం అనే కదా అర్ధం?
    Mr.Hari,
    You Should take responsible for the comments which have made against me. How dare he talk like this?

    ReplyDelete
  19. పై అనానిమస్

    దయచేసి ఎవరిపై parsonal abuse వద్దు. అందుకే మీ కామెంట్ తొలగించ బడింది

    ReplyDelete
  20. ప్రవీణ్, నీ హారిక ఇలా ఒకరినిమించిన మేధావులు మరొకరు, లోకకల్యాణం కోసం చర్చించుకుంటుంటే తెగ ముచ్చటేస్తోంది.

    ReplyDelete
  21. నీహారిక గారు. మీరు ఆర్థిక అంశాలని వైరాధ్యాల కోణంలో అర్థం చేసుకోలేదనుకుంటాను.

    ReplyDelete
  22. వైరాధ్యాల కోణం అంటే ఏమిటి? అది వైరాగ్యాల కోణమా?

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ