Skip to main content

దోపిడీ స్వభావం

మనిషి నాగరికత నేర్చుకుంటున్న కాలం నించీ అనివార్యంగా సాగుతున్న కార్యక్రమం దోపిడీ. కాలానుగుణంగా దోపిడీ స్వభావం మారింది కాని దోపిడీ అలాగే ఉంది.

అసలు దోపిడీ అంటే ఏమిటి? ఒకడి కష్టార్జితాన్ని ఇంకోడు కొల్లగొట్టడం. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది, కష్టార్జితం కాకపొతే కొల్లగొట్ట వచ్చునా, అని. ఇవన్నీ నిర్ణయించడానికి, లెక్కగట్టడానికి కారల్ మార్క్స్ ఒక పెద్ద పుస్తకమే రాశాడు. ఇప్పుడు ఆవివరాలలోకి పోవడం నా ఉద్దేశం కాదు.

ఆసలు ఈ దోపిడీ ఎలా పుట్టింది అని ఆలోచిస్తే, ఆదిమ సమాజంలోనే దీనికి బీజాలు పడి ఉంటాయి అని చెప్పక తప్పదు. మనిషి జంతువులా జీవించిన కాలంలో దోపిడీ అంతగా ఉండే అవకాశం లేదు. అయితే గియితే కుటుంబంలోనే బలవంతుడు బలహీనుడు నోటి దగ్గరి కూడు లాక్కునివుంటాడు. అది కూడా దోపిడీయే! కాని వ్యవస్థీకృతం కాదు.

నాగరికత పెరుగుతున్న కొద్దీ జనం జానపదాలుగా (గ్రామాలు) గుమికూడడం మొదలు పెట్టారు. వ్యవసాయం చేసి కొంత అదనపు ధాన్యమో, పనిముట్లో కూడబెట్టుకోనే అవకాశం కలిగింది. ఇలా మొదలైంది ప్రైవేటు ఆస్తి. అయితే వ్యవస్థ పై నియంత్రణ లేక పోవడం వలన కొంత మంది బలవంతులు సహజంగానే బలహీనులను బెదిరించి ఇలా కూడబెట్టిన ఆస్తులను కొల్లగొడుతూ ఉంటారు. మొదటిసారిగా ఇలా మొదలైవుంటుంది దోపిడీ.

ఇలాంటి దోపిడీని ఎదిరించడానికి ప్రజల్లోంచే నాయకత్వం తప్పకుండా బయట పడుతుంది. ప్రభావశీలురైన మనుషులు మిగతా ప్రజలకు నాయకత్వం వహించి దోపిడీని ఎదిరించడం సహజ సిద్ధంగా జరిగే పరిణామం. మన పురాణాలలో కనబడే పాత్రలు ఇలాంటి నాయకత్వానికి ప్రతీకలుగా భావించవచ్చు. దోపిడీని ఎదిరించడంలో సఫలీకృతుడైన నాయకుడు అక్కడితో ఆగడు. అతడు నేతగా, చివరికి రాజుగా రూపాంతరం చెందుతాడు.

ఆ విధంగా వచ్చిందే రాజరిక వ్యవస్థ. ఈ విధంగా రాజరిక వ్యవస్థ కూడా దోపిడీని ఎదిరించడానికి పుట్టిందే కాని, దోపిడీ కోసం పుట్టింది కాదు.

చరిత్రని గమనిస్తే అది నిత్యం మార్పు చెందుతూ ఉంటుంది. అది మార్పు చెందకుండా జడంగా ఉండడం మొదలు పెడుతుందో, అప్పుడు మళ్ళీ డానికి రోగాలు పెరుగుతాయి. అలాగే రాజరిక వ్యవస్థ ముదిరిన కొద్దీ దాని రోగాలు కూడా అనివార్యంగా పెరగ సాగాయి. అలా వేళ్ళూనుకున్నదే  ఫ్యూడల్ వ్యవస్థ.

ఏ దోపిడీకి వ్యతిరేకంగా రాజరిక వ్యవస్థ మొదలైందో, ఆ దోపిడీనే వేళ సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగించింది రాజరిక/ఫ్యూడల్ వ్యవస్థ. దోపిడీ కొనసాగిన కొద్దీ, అనివార్యంగా దోచుకోబడే వారి సంఖ్య పెరగడం, దోచుకునే వారి సంఖ్య తగ్గడం జరుగురుంది. దోపిడీకి గురయ్యే వారు సంఘటితం కావడం కూడా తప్పనిసరిగా జరిగే పరిణామం.

విప్లవాలు వచ్చాయి, రాజ్యాలు కూలాయి. 'ప్రజాస్వామ్యం' అనే ఆలోచనలకు బీజాలు పడ్డాయి.

సరిగ్గా ఈదశలో రెండురకాల ఆలోచనా విధానానికి అంకురార్పణ జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ, కమ్యూనిస్టు వ్యవస్థ. ఇక్కడ గమనించాల్సింది ఈ రెండు రకాల వ్యవస్థలు కూడా దోపిడీ వ్యతిరేక ఉద్యమాలు లేదా విప్లవాల మూలంగానే ఏర్పడ్డాయి. చరిత్ర తనను తాను సవరించు కోవడంలో భాగంగానే ఈ పరిణామాలు సంభవించాయి.

అయితే కాలానుగుణంగా ఈ రెండురకాల వ్యవస్థలలోనూ లోపాలు బయటపడ్డాయి.

పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బు అధికంగా సంపాదించిన వాడు శక్తివంతుడిగా మారాడు. తద్వారా ప్రభుత్వాలను ప్రభావితం చేసి మరింత దోపిడీకి సమకట్టాడు. సంపాదనా సమరంలో వెనుక బడ్డవాడు మరింత పేదవాడుగా మారాడు, బతుకీడ్చలేక మరణించిన సందర్భాలు కూడా కోకొల్లలు.

కమ్యూనిజంలో డబ్బురూపేణా దోపిడీ జరిగే అవకాశం లేదు. అయితే అక్కడ అధికారం ఉన్నవాడే శక్తివంతుడు. అధికార వర్గాలు నానాటికి బలపడి, సాధారణ జన జీవితాన్ని దుర్భరం చేసిన సంఘటనలు జరిగాయి. అంతేకాదు, దోపిడీ అంటే ఇతరుల కష్టార్జితాన్ని దోచుకోవడమే కాదు, తాను కష్ట పడకుండా ఇతరుల కష్టఫలితాన్ని అనుభవించడం కూడా దోపిడీయే అవుతుంది. ఈరకంగా కమ్యూనిస్టు సమాజంలో కూడా దోపిడీ స్వభావం అలాగే ఉంది.

చరిత్ర పరిశీలించినప్పుడు తెలిసేది ఏమంటే, దోపిడీస్వభావం కాలానుగుణంగా గుణాత్మకమైన  మార్పులు సంతరించుకుందే తప్ప దోపిడీ మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

Comments

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...