Skip to main content

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం.

ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా.

మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం.

అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు పదం కూడా ఉండదు. ఏవో రెండు పదాలు కలుపుకుని సమాసం ఏర్పరచుకోవడం తప్ప.

సాంకేతిక పరమైన సాహిత్యమంటే ఇప్పటి ఆధునిక టెక్నాలజీ గురించి చెప్పడం లేదు. కనీసం గృహ నిర్మాణం, నేత పరిశ్రమ, లోహ పరిఙ్ఞానం ఇత్యాది విషయాలలో కూడా మనకు చెప్పుకో దగిన పూర్వసాహిత్యం లేక పోవడం.

చేనేత మగ్గం నేయడానికి కావలసిన పరికరాల పేర్లు ఎవరికీ తెలియవు. లోహకారుడు వినియోగించే వివిద ఉపకరణాల పేర్లు తెలియవు. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన అనేకమైన పదాలు తెలియవు. కాని ఇవన్నీ సంబంధిత వృత్తి పనివారికి మాత్రం తెలిసి ఉంటాయి. ఈ పదాలు వెలుగు చూడక పోవడానికి కారణం ఇవి సాహిత్యంలో చోటుకు నోచుకోక పోవడమే కారణం. ఇంగ్లీషు భాషలో పదాలు గమనించి నప్పుడు ఎక్కువ శాతం పదాలు వృత్తి పనులుకు సంబంధించిన పదాలే సాంకేతిక పదజాల నిర్మాణంలొ పాలు పంచుకున్నాయని అర్థమౌతుంది.

ఉదాహరణకు చూసుకుంటే మొదట mill అంటే పిండి మర అనే అర్థం ఉండేది. అది కూడా mallet అనె చెక్క సుత్తితో దంచేవారు కాబట్టి అలా దంచడం milling అయ్యింది. ఈ మిల్లును తర్వాతి రోజుల్లో యాంత్రికీకరించి గాలి మర శక్తితొ నడిపేవారు. అదికాస్తా windimill అయ్యింది. ఈ విండ్ మిల్ రిపేరు చేసేవాడు milwright mechanic అయ్యాడు.


భాష పుట్టిన తొలి నాళ్లలో వచనానికి ప్రాచుర్యం లభించి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో? వృత్తి పనుల వారికి సాహిత్యంలో ప్రవేశం లేకపోవడం కూడా కొంత వరకు కారణం. సాహిత్యంలో పట్టు కలిగిన బ్రాహ్మణులు వృత్తి పనుల పై పరిశోధించి గ్రంధస్తం చేసిన ఆధారాలు కనిపించవు. ఒక శిల్పి తన శిల్ప కళను గ్రంధస్తం చేస్తే, ఒక చేనేత కార్మికుడు, ఒక వడ్రంగి, ఒక లోహ కారుడు తమ పని విధానాలను గ్రంధస్తం చేసి ఉంటే ఆయా రంగాలకు చెందినా ఏంతో పరిభాష మనకు లభ్యమై ఉండేది. ఆ పరిభాష మొన్న మొన్నటి వరకూ వీరి నోళ్ళలో నానింది. ఇప్పుడు వారుకూడా ఇంగ్లీషు పదాలే వాడుతున్నారు. నేను చిన్నప్పుడు మాట్లాడిన వడ్రంగి 'దూగోడ' అంటే ఇప్పుడు ఆయనే Jack Plane అంటున్నాడు; 'బర్మా'ని drill అని, శానాన్ని chisel అని అంటున్నాడు. అది ఆయన తప్పు కాదు, షాపు వాడు Jack Plane అంటేనే కొత్తది ఇస్తున్నాడు మరి! 

సాంకేతిక పదాలు వదిలేద్దాం.నాచిన్నప్పుడు ఇంటికి సంబంధించిన అన్నిపదాలూ తెలుగులోనే మాట్లాడే వారం. ఉదాహరణకు hall ని జగిలి అనే వారం. kitchen ని వొంటిల్లు అనే వారం. 

అలాగే
bed room = అర్ర
godown = గర్సె
back yard = ఇంటెనక
verandaah = సాయబాన
cup board = తనాబ్బీ 
shelf = గూడు
table = మేజు
bucket = బొక్కెన
pulley = గిరుక
slab = మిద్దె

ఇలా గతం లోకి వెళ్తే మరుగున పడిన ఎన్నో పదాలు మనకు కనపడతాయి. వీటిలో కొన్ని ఇప్పటి అవసరాలకు పనికి రాకపోవచ్చు. కాని ఎన్నో పదాలను పునరుద్ధరించాల్సిన అవసరం మాత్రం ఉంది.

తెలుగు భాషను ఇప్పటికైనా అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలంటే ఒక్కప్పటి విద్యావంతులు విస్మరించిన పనిని నేటి పండితులు కొనసాగించాలి. గ్రామాల్లోకి వెళ్ళి, వృత్తులను, పని విధానాన్ని, పదాలను, మాండలికాలను పరిశీలించి పరిశోధించాలి. మరుగుపడిన పదాలను వ్యాప్తిలోకి తీసుకు రావాలి.

Comments

  1. ఇక్కడ మీరు మాండలికాలను కూడా గమనించాలి. hall ని మీరు జగిలి అనేవారా? మా వూర్లో "మెల్లా" అంటారు కొందరు.

    backyard..పెరడు లేదా దొడ్డి
    verandaah వసారా లేదా పంచ (సాయబాన అనే మాట ఇదే మొదటి సారి వినడం)
    cup board ..అలమర

    ఇవన్నీ మాండలికాలే! ప్రామాణికాలు కావు. కానీ ప్రతి ప్రాంతానికీ వేరేరు మాండలికాలు ఉంటాయి కాబట్టి వేటినీ మరుగున పడి పోకుండా కాపాడుక్ ఓవాలి అని మీ వాదన అయితే సరే!

    కానీ గ్రామాలు కూడా పట్టణాల నాగరికతకు కొంతవరకూ ప్రభావితమవుతాయి కాబట్టి ఇలాంటి పదాలు మరుగున పడి వాటి స్థానంలో ఆంగ్ల పదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి అనివార్యం!

    అందువల్ల మాండలికాలు చావకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వాటిని సేకరించి ఒక మాండలిక నిఘంటువు తయారు చేయాల్సిన అవసరముందనుకుంటా!

    ReplyDelete
  2. గ్రామాల్లోకి వెళ్ళి, వృత్తులను, పని విధానాన్ని, పదాలను, మాండలికాలను పరిశీలించి పరిశోధించాలి

    అని నేను చివరగా చెప్పడంలో ఉద్దేశం అదే అండీ. అన్ని మాండలికాలను పరిషోధించి మరుగున పడ్డ పదజాలాన్ని వెలికి తీయాలనే నా ఉద్దేశం.

    ReplyDelete
  3. cup board ..అలమర

    అలమర అంటే ఇంగ్లీషే నండీ, (Almirah) కి వికృతి.

    ReplyDelete
  4. అవును, అలమర ఇంగ్లీషే! రోడ్డు, రైలు, బస్సు లాగా తెలుగులో కల్సిపోయిన ఇంగ్లీష్ పదం

    ReplyDelete
  5. శివ గారు,

    >>>cup board = భోషాణం?


    తప్పే, సరి చేశాను.

    ReplyDelete
  6. Bedroom = పడక గది
    Godown = గిడ్డంగి
    Back yard = దొడ్డి, పెరడు
    Verandah = వసారా
    Cupboard= తనాబ్బీ ఇది తెలుగు మాటా? ఏదో పార్సీ పదం లాగ ఉన్నది. అలమర అనుకోవటంలో ఉండే కష్టం ఏమిటి?
    Shelf = అర లేదా గూడు
    Table = బల్ల
    Bucket = బొక్కెన ఈ మాటకూడా ఆంగ్లలో ఉన్న బక్కెట్టు నుండే వచ్చి ఉంటుంది. 'బాల్చీ' అని ఓ మాట ఉంది మరది ఎమిటో
    Pulley = గిలక
    ఇలా ఎక్కడికక్కడ అనేకానేక పదాలు తెలుగులోనే ఉన్నాయి. లేదా ఆంగ్లంలో ఉన్న పదాన్ని తెనుగీకరించటం జరుగుతున్నది. ఆంగ్ల పదమైన "Almirah' ను అలమర అనుకోవటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కారణం తలుపులున్న అలమరలు మనకు ఆంగ్లేయులనుండే వచ్చినాయో పాత కాలంలో మనకీ ఉన్నాయో,తెలియదు. రైలు అన్నపదం తెలుగు కాదన్నది ఎవరు. Rail అన్న ఆంగ్ల పదానికి ఉన్న అర్ధం వేరు, మనం తెలుగులో రైలు అని పిలిచే వాహనం వేరు. ఆంగ్లంలో Rail అన్న పదానికి సమానార్ధమైన తెలుగు పదం 'పట్టా'. కాని చాలామంది రైలు పట్టాలు అంటారు. అంటే దాని అర్ధం రైలు అనేది వాహనం, ఆ వాహనం పట్టా మీద నడుస్తుంది కాబట్టి అది రైలు పట్టా అయ్యింది. ఆ విధంగా ఆంగ్లంలో వాళ్ళు రైల్ అన్నపదానికి ఒక అర్ధం ఉంటే అది తెలుగులోకి వచ్చి మరొక అర్ధమైపోయింది.

    ఏ బాషైనా సరే పర భాష పదాలు లేకుండా అభివృధ్ధి జరిగిందా అని చూస్తే, ఏ బాషైతే పర భాషా పదాలను తనలో కపేసుకుని వాటిని తమ భాషా పదంగా అన్వయించుకున్న భాషలే బాగా అభివృధ్ధి చెందినాయి (ఇంగ్లీషు లాగ). మడికట్టుకుని కూచున్న లాటిన్, సంస్కృతం వంటివి మరుగున పడిపోయినాయి.

    ReplyDelete
  7. శివ గారు,

    మీరు నన్ను బహుషా తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. పరభాషా పదాలను స్వీకరించడానికి నేనెక్కడా అభ్యంతరం చెప్ప లేదు (రైలు, అలమర వగైరా). ఈ పోస్టులో నేను చెప్పాలనుకున్న విషయం: కొత్త పదాలు కనిపెట్టే ముందు మన మాండలికాలలో వివిఢ పనులకు వస్తువులకు వాడుతున్న పదాలను పరిషోధించి, ప్రాచుర్యం కల్పించాలని మాత్రమే.

    ReplyDelete
  8. హరిగారూ, నమస్తే

    మిమ్మల్ని సరిగ్గానే అర్ధం చేసుకున్నననే అనుకుంటున్నాను. నేను చేసిన వ్యాఖ్య మిమ్మల్ని ఉద్దేసించి కాదు. సామాన్యంగా ఇప్పుడు "భాషాభిమానులం" అని చెప్పుకునే వాళ్ళు చేసే పిడివాదం నచ్చక నేను ఆ వ్యాఖ్య చేశాను. ఔత్సాహికులు తెలుగు పదాలను సృష్టిస్తున్నాం అనుకుని అనేక వెబ్ సైట్లల్లో కుస్తీలు పడుతున్నారు. కాని ఆయా మాటలు మీరు చెప్పినట్టుగా వాడుకలోకి రావాలి. ప్రజల వాడుకనుండే పదాలు పుడతాయి కాని డ్రాయింగు రూముల్లోంచి పుట్టవు అని నా స్థిర అభిప్రాయం.

    ఇప్పటికి కూడ చూడండి మనకు తెలిసిన మాటలు "తక్షణం", "ఇప్పటికిప్పుడు" వంటి మాటలు మనం వాడకుండా ఇమ్మీడియట్ గా అన్న ఆంగ్ల పదాన్ని వాడేస్తున్నాము. లేదా అర్జెంటుగా అని ఆగ్ల పదాన్ని తెనుగీకరించి వాడుతున్నాము. పైన చెప్పిన మాటలు ఒకప్పుడు వాడుకలో ఉన్నవి తప్పనిసరిగా మళ్ళి వాడుకలోకి తేవాలి. కాని ఆ తేవటం అనేది, ఎలా అన్నదే ప్రశ్న. టి వి, పత్రికలు, రేడియోలల్లో వాడబడుతున్న భాష ప్రజల భాష మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఇప్పుడు టి వి చానెళ్ళు వాడుతున్న తింగ్లీష్ (తెలుగు+ఇంగ్లీషు) వాడకాన్ని తగ్గించి వీలైనతవరకు తెలుగులో వాడుకలో ఉన్న సామాన్య పదాలను వాడేట్టుగా చెయ్యగలిగితే కొంతలో కొంత ప్రభావం ఉంటుందని నా అభిప్రాయం.

    ఆ తరువాత "పరిషోధించి" సరైన పదమా "పరిశోధించి" సరైన పదమా? ' శోధన ' అన్న పదంలోంచి పరిశోధన వచ్చి ఉంటుందని నా ఉద్దేశ్యం.

    ReplyDelete
  9. షివ గారు,

    వివరణకు ధన్యవాదాలు. "పరిశోధించి" అనే రాద్దామని ప్రయత్నించి తప్పుగా టైపు చేశాను.

    ReplyDelete
  10. నాకు తెలిసిన ఒక కంప్యూటర్ హార్డ్‌వేర్ సర్వీస్‌మ్యాన్ హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ అతను శ్రీకాకుళం మాండలికంలో మాట్లాడాడు. 'బేగి రా' అంటే అవతలి వ్యక్తికి అర్థం అవ్వలేదు. అప్పుడు అతను 'త్వరగా రా' అన్నాడు. అప్పుడు అర్థమయ్యింది. మా పిన్నమ్మ గారు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఉండే రోజుల్లో ఒక కుర్రాడు తొయ్యు అనడానికి దొబ్బు అన్నాడు. ఆవిడకి అది బూతులా వినిపించింది. మాండలిక తేడాలలో ఇలాంటి తికమకలే వస్తాయి. అరబ్ బాషలోనూ అనేక మాండలికాలు ఉన్నాయి. ఇరాకీ అరబ్బులకి లిబ్యన్ అరబ్ బాష అర్థం కాదు. రచనలు వ్రాసేవాళ్లు రెండుమూడు మాండలికాలు కలిపి వ్రాస్తారు. అందుకే వాళ్ల బాష ఎక్కువ మందికి అర్థమవుతుంది. మన తెలుగులో అయితే పూర్తి తెలుగు పదాలు అర్థం కావు. నెల అంటే చంద్రుడు అని అర్థం. కానీ మనం month(చంద్రుడు ఆకారం లేకుండా పోవడానికి, తిరిగి పూర్తి చంద్రుడు రావడానికి పట్టే సమయం) అనే అర్థంతో వాడుతాము. పదాలు ఎలా ఆవిర్భవించాయో చూస్తే గమ్మత్తైన విషయాలు తెలుస్తాయి. వెండిని ఒకప్పుడు హిందీలో రూపా అనేవాళ్లు. అది రూప్యం అనే సంస్కృత పదానికి వికృతి. కొత్త హిందీ బాషలో వెండిని చాందీ అంటారు. అంటే చాంద్ (చంద్ర) రూపం కలది అని అర్థం. తెలుగులో వెండి అంటరు. కొంచెం పరిశోధించి చూస్తే వెన్నెల+అటి అనే పదానికి వికృతేమో అనిపిస్తుంది. పసిడి (పసుపు+అటికి వికృతి) కూడా అటువంటిదేమో అనిపిస్తుంది.

    ReplyDelete
  11. నమస్కారములు, తెలుగులో నా జీవితములో జరిగిన దివ్య అనుభవమును అనుభవమును పంచుకొనుటకు ఆహ్వానిస్తున్నాను.
    సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు
    పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

సాయి బాబానా, దేవుడా?

యధాలాపంగా చానెళ్ళు తిరగేస్తుంటే ABN/ఆంధ్రజ్యోతి లో ఒక వింత చర్చ కనిపించింది. 'అందరి వాడేనా' అనే టైటిల్ తో ఒక సాయి బాబా భక్తుడు గారు, ఒక శాస్త్రులు గారిని కూర్చో బెట్టి యాంకరు వీర లెవెల్లో తతంగం నడిపిస్తున్నాడు. నేను మధ్యలో జాయినైనానేమో ముందేమీ అర్థం కాలేదు. చివరకి అర్థమైన సారాంశం ఇదీ. గుంటూరు జిల్లాకి చెందినా ఒక డాక్టరు గారు 'షిర్డీ సాయిబాబా అసలు హిందూ దేవుడే కాదు' అంటూ వాదం లేవ దీస్తూ ఒక పుస్తకం రాశాడట. దాంట్లో సాయిబాబా అసలు హిందువే కాదని, నిరంతరం 'అల్లా మాలిక్' అనుకుంటూ తిరిగిన వాడిని హిందువు లెందుకు పూజించాలని ఆయన ప్రశ్నలు లేవ దీశాడు. సనాతన ధర్మం రోజు రోజుకీ అటకెక్కి, జనం సాయి జపంలో మునిగి తేలుతున్న ఈ తరుణంలో కక్కా లేక మింగా లేక గుర్రుగా వున్న సనాతన వాదులకు దీంతో కొంత బలం చేకూరినట్టే కనిపిస్తుంది. అందుకే కాబోలు, శాస్త్రులు గారు వీర లెవెల్లో వాదన వినిపిస్తున్నారు. ఎప్పుడూ నాస్తికులకు, అస్తిత్వ వాదులకు మధ్యన జరిగే వాదనలు విని విని విసుగెత్తిన తరుణంలో ఇదేదో కొత్తగా బాగానే ఉందని పించింది. వార్తల చానెల్సుకి కూడా కొత్త విషయం దొరికి నట్లుంది, రెండు వైపులా బాగానే...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

దేవుడికి ఒంట్లో బాగోలేదట

దేవుడికి ఒంట్లో బాగోలేదట! దైవభక్తులారా, మీరంతా తలో దేవున్ని పూజించండి, ఈ దేవున్ని బ్రతికించమని కోరుతూ. దేవుడైన వాడికి మా పూజలతో పనేంటి అనుకుంటున్నారా? ఒద్దొద్దు, కొత్త దేవుళ్ళకు ప్రజల తోనే పని. ప్రజాదరణే వారి బలం. మీరు పూజలు చేయండి, ఇళ్ళల్లో భజనలు చేయండి, ఎప్పటి మాదిరిగానే. వీలయితే పక్కింటి వారిని కూడా కలుపుకోండి. మంత్రులారా, మీకు మీ కమీషన్ల వ్యవహారాల్లో క్షణం తీరిక ఉండదని తెలుసు. భోలక్ పూర్ లో మునిసిపాలిటీ నీళ్ళు తాగి కుక్క చావులు చచ్చినా, మన్యసీమలో విషజ్వరాలొచ్చి  వందల మంది చచ్చినా అక్కడికెళ్ళే మాట దేవుడెరుగు, కనీసం అరగంట సమీక్షా సమావేశం ఏర్పాటు చేసే సమయం కూడా మీకు దొరకదని నాకు ముందే తెలుసు. అయినా అడుగుతున్నాను. మీరు వెళ్లి వారాల తరబడి దేవుడి పాదాల చెంతే ఉండండి. ఆయన తిరిగి లేచి తిరిగే దాకా కదలొద్దు, వదలొద్దు. రాష్ట్రం ఏమై పోతుందో అని భయం అవసరం లేదు. నడుస్తూనే ఉంటుంది ముక్కుతూ మూలుగుతూ, మీరున్నప్పుడు ఎలాగో, లేకపోయినా అలాగే. దేవున్ని మాత్రం కంటికి రెప్పలా చూసుకొండి. ముఖ్యమంత్రిగారూ, మీరు మాత్రం ఎందుకు? రాష్ట్రంలో ఏం వుంది గనక చేయడానికి? వెంటనే వెళ్లి దేవుడి సంగతి చూడండి. ...