Skip to main content

సాయి బాబానా, దేవుడా?

యధాలాపంగా చానెళ్ళు తిరగేస్తుంటే ABN/ఆంధ్రజ్యోతి లో ఒక వింత చర్చ కనిపించింది. 'అందరి వాడేనా' అనే టైటిల్ తో ఒక సాయి బాబా భక్తుడు గారు, ఒక శాస్త్రులు గారిని కూర్చో బెట్టి యాంకరు వీర లెవెల్లో తతంగం నడిపిస్తున్నాడు. నేను మధ్యలో జాయినైనానేమో ముందేమీ అర్థం కాలేదు. చివరకి అర్థమైన సారాంశం ఇదీ.

గుంటూరు జిల్లాకి చెందినా ఒక డాక్టరు గారు 'షిర్డీ సాయిబాబా అసలు హిందూ దేవుడే కాదు' అంటూ వాదం లేవ దీస్తూ ఒక పుస్తకం రాశాడట. దాంట్లో సాయిబాబా అసలు హిందువే కాదని, నిరంతరం 'అల్లా మాలిక్' అనుకుంటూ తిరిగిన వాడిని హిందువు లెందుకు పూజించాలని ఆయన ప్రశ్నలు లేవ దీశాడు. సనాతన ధర్మం రోజు రోజుకీ అటకెక్కి, జనం సాయి జపంలో మునిగి తేలుతున్న ఈ తరుణంలో కక్కా లేక మింగా లేక గుర్రుగా వున్న సనాతన వాదులకు దీంతో కొంత బలం చేకూరినట్టే కనిపిస్తుంది. అందుకే కాబోలు, శాస్త్రులు గారు వీర లెవెల్లో వాదన వినిపిస్తున్నారు.

ఎప్పుడూ నాస్తికులకు, అస్తిత్వ వాదులకు మధ్యన జరిగే వాదనలు విని విని విసుగెత్తిన తరుణంలో ఇదేదో కొత్తగా బాగానే ఉందని పించింది. వార్తల చానెల్సుకి కూడా కొత్త విషయం దొరికి నట్లుంది, రెండు వైపులా బాగానే ఎగ దోస్తున్నారు.

మన శాస్త్రుల వారు, రామాయణం, భాగవతం వగైరాలను ఉటంకిస్తూ అనర్ఘళంగా వాదించారు. దీనికి ప్రమాణం ఏంటి, దానికి ప్రమాణం ఏంటి అంటూ అడిగేసరికి బిత్తర పోవటం సాయి బాబా భక్తుల పని అయ్యింది. ఓహో, భక్తి విశ్వాసాలకు కూడా ప్రమాణా లుంటాయా? అని నేననుకునే లోపే మన సాయి భక్తులు తేరుకున్నారు. వారేం తక్కువ తిన్నారా? వీరికన్నా గొప్ప భక్తులు వారుకదా!

'సాయి చేసిన పరోపకారం చాలు సాయిని పూజించడానికి' అని ఒకాయన అందుకున్నాడు. ఓహో, పరోపకారం చేస్తే చాలు, పూజ లందు కోవచ్చన్న మాట అని నేననుకునే లోపే ఇంకొకాయన 'సాయి ఎన్నో మహిమలు చూపించాడు' అని మొదలు పెట్టాడు. మహిమలు చూపిస్తే దేవుడంటారా? అయితే టీవీ సీరియల్లో రాక్షసులకు కూడా బోల్డన్ని మహిమ లుంటాయే! మరి వారిని కూడా పూజించొచ్చా అనే ధర్మ సందేహం నాకోచ్చే లోపే, మన శాస్త్రుల వారు ఊరుకుంటారా? 'కుష్టు వ్యాధినే నయం చేసుకోలేని వాడు, ఇంకా మహిమలేమిటి? ఠాట్, అదంతా ఇంద్రజాలం' అంటూ కొట్టి పారేశారు.

దీనికి చిర్రెత్తు కొచ్చిన మన సాయి భక్తుడు, 'అసలు పదహారు వేల భామలతో కులికిన కృష్ణున్ని, భార్యను అడవులకు పంపిన రామున్ని పూజించగా లేనిది, సాయిని ఎందుకు పూజించ కూడదు?' అంటూ ఎదురు తిరిగాడు. 

ఏదయితే నేంగాని, చాలా రోజుల తర్వాత, భక్తులు భక్తులు కొట్టుకునే కార్యక్రమం ఒకటి చూడ్డానికి లభించింది. ఇందుకు ఆంధ్రజ్యోతి వారిని అభినందించాల్సిందే. మొత్తానికి మన భక్త బృందం తర్కాన్ని ఉపయోగించి (ఎదుటి వారిని తిట్టడం కోసమైనా సరే) వాదించడం సంతొషించ దగ్గ పరిణామం!

Comments

  1. అయ్యా తమరెవరోగానీ ఆ చర్చ నాముందు జరిగి ఉంటే ఆ శాస్త్రులు గారికి తగిన సమాధానం ఇచ్చి ఉండేవాడిని :)

    ReplyDelete
  2. శ్రీనివాస్ గారూ, చర్చ నా ముందు జరగ లేదండి, ABN ఆంధ్రజ్యోతి వారి చానెల్లో జరిగింది.

    ReplyDelete
  3. మా వీధిలో షిర్డీ సాయిబాబా కూడా కాదు, సత్యసాయిబాబాకే భక్తులు ఎక్కువ. క్రైస్తవులు, ముస్లింలకి ఎంత మంది ప్రవక్తలు ఉన్నా ఒకే దేవుడిని నమ్ముతారు. మనవాళ్ళలాగ కొత్త దేవుళ్ళని సృష్ఠించుకోరు.

    ReplyDelete
  4. ఏ పుట్టలో ఏ పాముందో కాసిని పాలు పోద్దాం, ఏ రాయిలో ఏ మహిముందో ఓ మొక్కు పడేద్దామనే మన వాల్లకు సాయిబాబా అయితేనేమీ, కసాయి బాబు అయితేనేమి.

    బ్లాకు టికెట్లమ్ముకున్న బాలసాయిబాబాకి కూడా బహుషా ఓ యాభై ఏల్లు దాటితే ఊరూరా గుళ్ళు కడతారేమో.

    ReplyDelete
  5. This is Hilarious! Those two people proved themselves.


    రాముడు మనకి నేర్పించింది విరోధికి కూడా తగిన గౌరవమివ్వడం. షిరిడీ సాయిబాబా నేర్పించింది అనవసరమైన వాదనలకి దిగకపోవడం.

    వీళ్ళిద్దరూ కొట్టుకున్న విధానాన్ని చూస్తే వీళ్ళెలాంటి రామ/సాయి భక్తులో తెలియట్లేదా? :))

    ReplyDelete
  6. well said Rowdeejee. Such worthless discussions these are. Even to read such an article is a sheer waste of time. సాటి మనిషికి సహాయం చెయ్యలేని స్వార్ధపరులు ప్రజల కోసమే జీవించినవారిని మాటలనటం. ఇంతకన్నా హాస్యాస్పదం ఉండదేమో.

    ReplyDelete
  7. ఇక్కడ ఎవరూ మానవ సేవ చెయ్యడం తప్పు అనలేదు. మానవ సేవ పేరుతో మూఢ నమ్మకాలు ప్రచారం చెయ్యడం ఎందుకు? షిర్డీ సాయిబాబాకి మహిమలు ఉన్నాయని చెపుతున్నారు కాబట్టే విమర్శలు. మంత్రాలు, మహిమలు లాంటి మూఢ నమ్మకాలు మానసిక వికాసానికి అభివృద్ధికరమా, అభివృద్ధి నిరోధకమా? యండమూరి కాష్మోరా నవలని విమర్శించినవాళ్ళు అలాంటి మూఢనమ్మకాలనే నమ్మడం హాస్యాస్పదంగా ఉంది.

    ReplyDelete
  8. నేనూ నిన్న చూసా ఈ చర్చ.నవ్వు వచ్చింది నాకు.ఎదొ ఒకటి కెలకందే మన టీవీ వాల్లకీ త్రుప్తి ఉండదు,సో కాల్డ్ సనాతన వాదులకీ తోచదు.సాయి బాబా నన్ను పూజించండి అని తనకు తాను ఎప్పుడూ చెప్పలేదు.ఇష్టమయిన వాళ్ళు పూజిస్తున్నారు.ఈ పుస్తక రచయిత ఇప్పుడు కొత్తగా ఆయన గురించి చెప్పేదేమిటో నాకు అర్ధం కాదు.

    ఇలా మనలో మనమే ఇన్ని రకాలుగా కొట్టుకుంటాము కాబట్టే మత మార్పిడులు ఎక్కువ అయ్యాయి అని నా అభిప్రాయం

    ReplyDelete
  9. షిర్డీ సాయిబాబా 1990 తరువాతే పాపులర్ అయ్యాడు. 1990కి ముందు ఆ బాబా ఎవరో మాకు తెలియదు. 1990 తరువాత కరీంనగర్ లో కొంత మంది షిర్డీ సాయిబాబా భక్తులు పరిచయమైన తరువాత తెలిసింది.

    ReplyDelete
  10. నచికేత గారు. కల్కి భగవాన్ కి కూడా ఆలయాలు కట్టేవాళ్ళు ఉన్నారు.

    ReplyDelete
  11. పద్మ గారు,

    "సాటి మనిషికి సహాయం చెయ్యలేని స్వార్ధపరులు" అని మీరు ఎవరిని గురించి అన్నారో తెలియదు కానీ, ప్రజలకోసం జీవించిన వాల్లందరికీ మనం గుడి కట్టి పూజించం. ఒక గాంధీ, తిలక్, అంబేద్కర్, పటేల్, బోస్, భగత్ సింగ్ లాంటి వారికెవ్వరికీ గుడులు లేవు.

    వెర్రి జనం ఎవరి మాజిక్లు చూసి మోసపోతారో వాల్లనే దేవుడు అని అనుకుని గుడులు కడుతారు.

    ReplyDelete
  12. అసలు ఈ టివీ ల వాళ్ళూ ముఖ్యంగా tv9, ఆంద్రజ్యోతి పని కట్టుకొని విషయం తెలిసిన వాళ్ళను కాక పనికి మాలిన వాళ్ళను ఇంటర్వూ చేస్తుంటారు.వాళ్ళ మోటివ్ ఇలాంటి అలజడి సృష్టీంచటమే. అసలు సాయి భక్తులు రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎలా కించపరచ గలుగు తారు? అది ఆయన స్పూర్తి కే విరుద్దం.
    ఒక సారి పూరి జగన్నాధ్ గుడి గూర్చి ఒకాయన చేత పనికిమాలిన మాటలు చెప్పించారు.
    అసలు విషయం ఏమిటంటే, గురువుని దైవం గా భావించటం, యోగుల్ని పూజించటం హిందూ మతం ఒప్పుకొనే విషయమే. అయితే అందరు ఆయా గురువుల్ని పూజించక పొవచ్చు, ఒప్పుకోక పోవచ్చు. అయినంత మాత్రాన ఇతరుల్ని తప్పు పట్టాల్సిన పని లేదు. హిందూ మతం గొప్ప తనమే ఆ స్వేచ్చ. ఆ మాటకు వస్తే ఆది శంకరుల వారు, రామానుజాచార్యులు కూడా గురువులేకదా. వారిని ఆయా సంప్రదాయాలు పాటించేవారు దైవ సమానులుగా భావిస్తారు. గురు పూజ తప్పుకాదు. ఇది ముక్తికి సులభ మార్గం. మనకు ఎందరు పనికి మాలిన గురువులు పుట్టినా అంతకంటే ఎక్కువ సంఖ్యలొ అధ్భుత మైన గురువులు ఉన్నారుకనుకనే ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. రమణ మహర్షి, వివేకానంద స్వామి లాంటి వారిని కన్నది ఈ భరతమాత.

    ReplyDelete
  13. గుళ్ళు, వ్యక్తి పూజల గూర్చి చెప్పాలంటే మరి కుష్బూకి, నగ్మాకు రజనీకాంత్ కి, వైయస్సార్ కి ఆఖరికి నమితకు గుళ్ళు కట్టించారు. ఈ పిచ్చికి, అమాయకత్వానికి, స్వార్ధానికి మతాన్ని ముడి పెట్టనక్కరలేదు. దేవుళ్ళని కాదన్న వాళ్ళు రాజకీయ నాయకుల్ని, సినిమావాళ్ళని పూజిస్తున్నారు అంతకు మించిన ఎదుగుదల లేదు.

    ReplyDelete
  14. కాషాయం కట్టుకున్న ప్రతివాడిని పూజించడమే? విశ్వామిత్ర, శాండిల్య, భరద్వాజ మహర్షులు కూడా కాషాయం కట్టుకున్నారు. వాళ్ళకి గుడులు లేవు కానీ సాయిబాబాలకి ఎందుకు ఉన్నాయి?

    ReplyDelete
  15. మైత్రేయి గారు. నాస్తికులు ఎక్కడా వ్యక్తి పూజ చెయ్యరు. చిరంజీవికి, రజనికాంత్ కి ఆలయం కట్టిన నాస్తికులు ఎక్కడ ఉన్నారు?

    ReplyDelete
  16. మనము ఇలాగే కొట్టుకుంటూ ఉందాము,ఎంచక్కా చాప కింద నీరులాగ "దేవుని బిడ్డలు" etc తమ పని కానిచ్చెస్తారు.అప్పుడు మన తరువాత తరాల వాళ్ళకి చెప్పుకోవచ్చు "హిందూ" మతం అని ఒక మతం ఉండేది అప్పుడు అని.

    పనికిమాలిన టీవీలుపనికిమాలిన చర్చలు.సానియా,ఆయెషా,లలిత్ మోడీ గోల అయింది అనుకుంటే ఇదా ఇప్పుడు.వేరే మతం లో కూడా కాస్తో కూస్తో భిన్న అభిప్రాయాలు ఉంటాయి అవి ఎందుకు హైలైట్ చెయ్యరో మన టీవీల వాళ్ళు.అంత దమ్ము లేదు కనుక ఎవరికీను.ఎవరినీ ఏమీ అనకుండా చవటల్లాగ ఎవరయినా చర్చ లేవదీస్తే కొట్టుకునేది మనము మాత్రమే అని టీవీ ల వాళ్ళకి కూడా తెలుసు కనుక.ఎవరినీ నొప్పించాలి అని కాదు ఇలా రాసింది,ఎందుకు ఇలా వాదులాటలు,ఎవరికి ఇష్టమయిన దేవుడిని/బాబాని/యాక్టర్ ని వారు పూజించుకోక.

    ReplyDelete
  17. ప్రవీణ్, నేను తమిళ సోదరులని చూసి చెప్తున్నాను. డి యం కె మొత్తం నాస్తికులే వాళ్ళ మూల సిద్దాంతమే అది కాని వాళ్ళు వాళ్ళ నాయకుల కాళ్ళ పై పడటం, పూజలు చెయ్యటం కామన్. కమ్యూనిష్ట్ నాస్తికులు వ్యక్తి పూజ చెయ్యని మాట ఒప్పుకోవచ్చు.

    ReplyDelete
  18. రుషి గారు,

    భక్తి వ్యక్తి గతం. ఎవరికీ నచ్చిన దేవుణ్ణి వారు తప్పకుండా పూజించుకోవచ్చు. సంస్తాన్ ట్రస్టులు, వగైరాలు పెట్టి భక్తిని కార్పోరాటే స్థాయికి, రాజకీయాల స్తాయికి దిగజార్చు తున్నారు.

    పైగా భక్తి నమ్మకంతో, విశ్వాసంతో కూడుకున్నది. 'అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమః' అన్న విధంగా తమ తమ కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి భక్తికి మించిన మందు లేదు. పరిపూర్ణ విశ్వాసంతో దేవున్ని పూజించే వారిని ఈ కాలంలో వెల్ల మీద లెక్క పెట్ట వచ్చు. తొంభై శాతం మంది 'చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద' అన్న చందంగా ఉంటారు.

    విశ్వాసంతో కూడి ఉండవలసిన భక్తికి ప్రమాణాలు, తార్కాణాలు వెదకడం, తర్క వివరణ చేయడం హాస్యాస్పదం కాదూ? పైగా తాము విశ్వసించేదే ఒప్పని, ఇతరులు విశ్వసిన్చేది తప్పనీ.

    మైత్రేయి గారు,

    చర్చలో కూర్చున్న వారు పనికి మాలిన వారేమీ కాదండి. వారి వారి విభాగాల్లో గొప్ప స్తానాల్లో ఉన్న వారే.

    పద్మ గారు,

    బ్లాగులు వ్రాయడం చదవడం కూడా కాలయాపనకే అన్న విషయం మీకు తెలియనిది కాదనుకుంటాను. ఏదో కామెడీ గా వుందని నాలుగు ముక్కలు రాశాను. మీ సమయాన్ని వృధా చేసుకుని ఈ వ్యాసం చదవడమే గాకుండా, తీరిక చేసుకిని వ్యాఖ్యానించి మరింత కామెడీ పంచినందుకు సంతోషం.

    పైన వ్యాఖ్యానించిన వారందరికీ ధన్యవాదాలు

    ReplyDelete
  19. దొంగ సాముల చేతులు , కాళ్ళు నరికేయాలి అప్పుడు వాళ్ళు కషాయం దుస్తులు వేసుకోలేరు. ఏమంటారు చె.శ గారు ?

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...