Skip to main content

అడవులు

ఈ మధ్య ఒక శుభ కార్యానికి హాజరు కావడానికి వరంగల్ జిల్లాలోని ఒక ఊరికి వెళ్లాను. ఇదివరలో చూసినప్పుడు ఆ వూరిలో నిండుగా చెట్లు ఉండేవి. ఈ సారి ఒక్కటి కూడా కనపడక పోయేసరికి ఊళ్ళో ఒకతన్ని విషయం అడిగాను.

'ఏం చెప్ప మంటారు సార్. పనికి ఆహార పథకం కింద ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నారు.' అని సమాధానం.

పనికి ఆహార పథకం క్రింద ఉన్న పనుల్లో చెట్లు నరకడం ఒకటి. డబ్బులు పంచుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి కనపడిన చేట్టునల్లా నరికేస్తున్నారు. దీనివల్ల ఊరికి, పర్యావరణానికి ఎంత అపకారం జరుగుతుందో ఎవరికీ పట్టడం లేదు.

నలభయ్యేడు డిగ్రీల ఉష్ణోగ్రత. ఎండా భగ భగ మండి పోతుంది. నిలబడదామంటే చెట్టు కనిపించ లేదు.

'ఊళ్ళో చెట్లు సరే, మరి ఇళ్ళల్లో చెట్లు ఏమయ్యాయి?'

మళ్ళీ అతనే చెప్పాడు. 'ఈ మధ్య ఊరిలో వాస్తు పిచ్చి ఎక్కువయ్యింది. ఇంట్లో ఉండ కూడదని మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, యూకలిప్టస్ చెట్టు, పొప్పడి చెట్టు... ఇలా రక రకాల చెట్లను నరికేస్తున్నారు.'

నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎవరు ఏది చెపితే అది నమ్మే ఈ జనం ఎప్పుడు బాగు పడతారో అర్థం కాదు!

పల్లెటూళ్ళలో విద్యాగంధం లేని ప్రజలు ఇలా చేస్తుంటే మరి ప్రభుత్వం ఎలా చేస్తుందో ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే తెలిసింది. తీర ప్రాంతంలో చెట్లు విచక్షణా రహితంగా నరికి వేయడానికి, తుఫాను విధ్వంస తీవ్రతకు సంబంధం ఉంది. ఈ విషయం ప్రపంచ పర్యావరణ సంస్థ మాజీ సలహాదారు శ్రీ జీవానంద రెడ్డి తెలిపారు. ఆయన ఇంకా ఈ క్రింది విషయాలు తెలిపారు.

శతాబ్దాల నుండి మడ అడవులు, గడ్డి దుబ్బులు, రబ్బరు చెట్లు, జీడి మామిడి తీర ప్రాంతానికి సహజ రక్షణగా ఉండేవి. మితి మీరిన పారిశ్రామికీకరణలో భాగంగా వీటిని నేల మట్టం చేస్తున్నారు.

ఇలా తూర్పు గోదావరిలో 32000 ల హెక్టార్లు, కృష్ణాలో 30000 ల హెక్టార్ల మడ అడవులు ఈ విధంగా కనుమరుగు అయ్యాయి. చేపల, రొయ్యల సాగుకోసం ఈ జిల్లాలలో విచక్షణా రహితంగా వీటిని నరికి చెరువులు తవ్వారు.

నిబంధనలకు విరుద్ధంగా తీర ప్రాంతాలలో పరిశ్రమలకు భూమిని కేటాయిస్తున్నారు. మచిలీపట్నం వద్ద ఒక ధర్మల్ విద్యుత్తు కేంద్రానికి భూమి కేటాయించిన కారణంగా వేల ఎకరాల్లోని మడ అడవులను కొట్టి వేశారు. ఇలాగే కాకినాడలో వేరొక సంస్థ.

చరిత్ర ఏం చెబుతుంది?
  • తీర ప్రాంతంలో అటవీశాఖ పెంచిన సరుగుడు వనాలు 1980 నుంచి 1987 వరకు వచ్చిన తుఫాన్ల తీవ్రతను చాలా వరకు అరికట్టాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇప్పుడు నిధుల కేటాయింపు జరపక పోవడం వల్ల అటవీ శాఖ ఇవి పెంచడం లేదు.
  • మడ అడవులు 1977 లో వచ్చిన ఉప్పెన నుండి గుంటూరు జిల్లాను కాపాడాయి. అప్పటికే దివిసీమ ప్రాంతంలో ఈ మడ అడవులను విచక్షణా రహితంగా నరికి వేయడం వళ్ళ పెనుప్రమాదం సంభవించింది.
  • కేరళలోని కొల్లం, అళపుళ జిల్లాలలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల, ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ఇక్కడ నష్టం అపరిమితంగా ఉంటుంది.
ఇప్పుడు వచ్చిన లైలా సృష్టించిన పెను బీభత్సానికి కారణాలేమిటి ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకనైనా ప్రభుత్వం, ప్రజలు మేల్కుని చెట్ల యొక్క విలువని గుర్తించి ప్రవర్తిస్తే మేలు.

ఆధారాలు:
  1. మన విధ్వంసం వల్లే పెను భీభత్సం 
  2. 'మడ'మ తిప్పేస్తున్నాం 

Comments

  1. అందరూ ఆలోచించాల్సిన విషయాలు చెప్పారు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...