Skip to main content

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది.

మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు.

మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా.

కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం.

ఆలోచిస్తే ఈ పరంపరకు షిర్డీ సాయిబాబా ఆద్యుడు అనిపిస్తుంది. నాకు తెలిసి ఆయన కన్నా ముందు వచ్చిన గురువులు అందరూ గురువులు గానే మిగిలిపోయారు. బుద్ధుడు, మహావీరుడు లాంటి వారు కూడా వందల సంవత్సరాల వరకు  గురువులుగానే భావింప బడ్డారు. 

ఇప్పటి కాలంలో మాత్రం వందలకొద్దీ బాబాలు, అమ్మలు ప్రత్యక్ష దైవాలై మనముందు తిరుగాడుతుంటే, మనం నిజంగా కలియుగంలో ఉన్నామా, లేక సత్య యుగంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. నిజంగా కలియుగంలోనే ఉంటే, ఇంతమంది దేవుళ్ళను ప్రత్యక్షంగా దర్శించుకోవడం ఎలా సాధ్య పడుతుంది?

ఆలోచిస్తే ఈ రకమైన ప్రత్యక్ష దైవాలు బయలు దేరడానికి చాలానే కారణాలున్నాయని పిస్తుంది. మొదటిది ప్రజల అమాయకత్వం. ఆలోచన లేకుండా దేన్ని పడితే దాన్ని దేవుడని నమ్మేయడం. కనీసం పురాణాల పరిజ్ఞానం కూడా లేని వారు ఇలాంటి చిల్లర దేవుళ్ళను పడి పడి పూజించడం రోజూ చూసే విషయం. వీరికి ఒక జాన్ పహాడ్ సైదులు, ఒక షేక్ షావలి, ఒక జహంగీర్ పీర్, ఒక మేరీ మాత కూడా దేవతలే, పూజకు అర్హులే. తమకు సంతానం, డబ్బు, దస్కం ప్రసాదించ గల దైవాలే. అంతటి సెక్యులరిజం (?) మన భారతీయ ప్రజలది! 

ఈ బాబాల విజృంభణకు మన పురాణాల్లోనే ఒక వెసులుబాటు ఉన్నట్టు కనిపిస్తుంది. భగవంతునికి పది అవతారాలున్నాయని పురాణాల్లో చెప్పబడినా,  బయట మాత్రం పది కన్నా ఎక్కువ రూపాలే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఇలా రక రకాల వేరియేషన్లతో, కాంబినేషన్లతో మనకు భగవంతులు దర్శనమిస్తారు. పైగా కల్కి రూపంలో భవిష్యత్తులో వచ్చే అవతారానికి ఎప్పుడూ ఒక అవకాశం ఉండనే ఉంది. చివరికి NTR కి, లక్ష్మీ పార్వతికి పుట్టబోయే సంతానం కూడా కల్కిభగవానుడు అవుతాడని ప్రచారం జరిగిందంటే, మన తర్క విహీనమైన ఊహాజనితమైన ప్రచారాలు ఎంతవరకు వెళ్ళుతాయో సులభంగానే ఊహించు కోవచ్చు.

ప్రజలకు మార్గదర్శకులుగా ఉండవలసిన లీడర్లే చండీయాగాలు, సత్యసాయి ప్రదక్షిణాలు చేస్తున్న కాలంలో పరిస్థితుల్లో మార్పు ఆశించడం అత్యాశే అవుతుందేమో. ఎవరికీ వారు మేం భగవంతులం అని ప్రకటించుకోగానే పొలోమని పరిగెత్తే జనం మారనంత వరకూ పరిస్థితులలో పెద్దగా మార్పు ఉండదేమో.

Comments

  1. ఇంతమంది ప్రత్యక్షదేవుళ్ళు నడయాడే నేలమీద పుట్టడం, వారితో సమకాలీకులవడం మన అదృష్టమే. మన పూర్వీకులే పాపం గురువులతో అడ్జస్ట్ అయిపోయారు.

    ReplyDelete
  2. @మన్మధన్ చెంబు

    :)

    ReplyDelete
  3. బాగా చెప్పారు.
    ' పూజకు అర్హులే ' అని ఉండాలి. టైపింగ్ తప్పిదాన్ని సరిచేయగలరు.

    ReplyDelete
  4. Anonymous,

    Thanks for correction, made it.

    ReplyDelete
  5. :) baagumdi mee blog.

    ReplyDelete
  6. హరిగారూ!
    చాలా బాగా రాసారు.
    ఆర్.నారాయణమూర్తి గారి సినిమా "అమ్మ మీద ఒట్టు" సినిమాలోని ఓ పాట గుర్తుకోస్తోంది - " దేవుడా నీవున్నవా...లేక మనిషిలో భ్రమనన్నవా....అనే పల్లవితో సాగే ఆ పాటలో ఓ చరణం - "మనిషి ముందుగ పుట్టి, భయం తదుపరి బుట్టి, దేవుడనిపేరెట్టి ఇలపైన గుడికట్టి ఉన్మాద ముసుగులో ఉనికినే కోల్పోగ...అంటూ సాగే ఆ పాట మనిషి దేవుణ్ణి సృష్టించాడా, దేవుడు మనిషిని సృష్టించాడా అనే విషయంలో భలే క్లారిటీ ఇస్తుంది.
    అన్నట్టు మీరు పర్మిషన్ ఇస్తే మీ టపాను నా బ్లాగులో నారాయణమూర్తి గారి పాట సహితంగా పుణః ప్రచురిస్తాను.

    ReplyDelete
  7. రెడ్డి గారు,

    ధన్యవాదాలు.

    తప్పక ప్రచురించండి.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ