Skip to main content

సమస్యాపూరణం

శ్రీ కంది శంకరయ్య గారు నిర్వహిస్తున్న శంకరాభరణం బ్లాగులో ఇటీవల నేను చేసిన పూరణలు.

ఆ.వె.

జడలు ముడియ గట్టి జపమాల చేబట్టి
దొంగ స్వామి నగరి దూరి నంత
చేరె చక్రధరుని చెల్లియే తనచెంత
కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె

కం.

మిడిమేళపు దొర యొక్కడు
కడ గ్రేడు సిమెంటు వాడి కట్టగ డ్యామున్
నడిరేయి గండి పడెనట
గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్!

కం.

ఏమూలో దాగిన కవి
సాముగరిడి చేసె కంది శంకరు మహిమన్
ఆ మాన్యు ప్రోద్బలము చే
పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్.

కం.

హవ్వా యనగను సిబియై
చివ్వున బోఫార్సు కేసు చీపుగ మార్చెన్
ఇవ్విధమగు శోధనమున
పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్

తే.గీ.

రైతు మరచిన హైటెక్కు రాజకీయు
డతని నోడించి నొక 'దేవు' కందల మిడ
వేల కోట్లతో పుత్రు కుబేరు జేసె
పామునకు బాలు వోసిన ఫలిత మిదియె?

కం.

తానధికారము నుండగ
ఏనాడూ కానలేదు ఈయన రైతున్
కానగ రైతులపై అభి
మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్.

ఆ.వె.

దారి తప్పుటెల్ల తప్పుకాదెచటను
దారి మరచినంత తప్ప నగును
దారి వెతికి వెతికి దరిజేరకున్నను
దారి తప్పు వాడు; ధర్మ విధుడు

తే.గీ.

వీధివీధిలో భిక్షకై వేడుకొనగ
దొరకలేదెట నొక రొట్టె తునకయైన
కోర మృష్టాన్నమును; సద్ది కూడు, గొడ్డు
కార మొసఁగు జల్లదనము కన్నుఁ గవకు

కం.

లడ్లా స్వీట్లవి పడదుర
గ్రుడ్లా వద్దుర అరుగవు కుక్షికి బరువై
గుడ్లను కన్నీరు దిరుగు
ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

కం.

మర మనుషుల కాలంబున
తెరువరియై మనిషి జేయ దీటుగ క్లోనింగ్
అరయగ నచ్చెరువెందుకు?
"సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్"

తే.గీ.

పరమ గురువు నిత్యానంద బాబ యైన
కల్కి భగవానుడని చెప్పు కపటుడైన
తనకు కోర్కెలు కలిగి సందడిని చేయ
యతి విటుఁడు గాకపోవునే యతివ బిలువ.

కం.

ఓదార్పు యాత్రలనుచును
గోదాలో దిగిన జగను కొంపల పైనన్
సోదా జరుగునని తలచి
ఆదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్.

కం.

భాషించడు దుర్భాషలు
ద్వేషించడు వెనుక గొయ్యి తీసెడు జనులన్
దోషుల గాంచుచు పలుకక
రోషమ్మును వీడు వాడె రోషయ్య యగున్

కం.

ఓదార్చెద నేనంచును
ఓదారుపు యాత్ర చేయ నొక్కడు వెడలెన్
'ఓదార్పు' పదవి కైనను
ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!

కం.

వినినంత జనులు ఆగక
తనగొప్పలు చెప్పి చెప్పి దంచుచు ఊకన్
జనులను ఊదర గొట్టగ
వినువారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.

Comments

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...