Skip to main content

రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా ఉంది. స్వతంత్ర భారత దేశంలో బహుషా కాంగ్రెస్ పార్టీకి ఇంతటి గడ్డు పరిస్థితి ఇదివరలో ఎప్పుడూ వచ్చి ఉండదు.

ఒకవైపు జగన్ వీరంగం. మరోవైపు తెలంగాణా సమస్య. మామూలుగా అయితే అవినీతి, అధిక ధరలు, పెట్రోలు ధర పెంపు లాంటివి ఆపార్టీకి దున్నపోతు మీద నీటి బొట్ల లాంటివే అయినా ఈ పరిస్థితులలో అవి కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి తన వైపు ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని ఏకంగా దేశ రాజధానిలోనే ప్రదర్శించి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన దయాదాక్షిన్యాల మీద ఆధారపడి ఉందని ప్రకటించాడు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి.  

జగన్ వర్గం వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటే వారు రాజీనామా చేసేలా ఉన్నారు. తరువాత జరిగే ఉప ఎన్నికలలో ఎలాగూ ఆ స్థానాల్లో కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి ప్రభుత్వం పడిపోవడం ఖాయం. పోనీ ఉపేక్షిద్దామా అంటే ప్రభుత్వం ప్రతిష్ఠ నానాటికి తీసికట్టు, నాగంభొట్లు అన్న మాదిరిగా తయారౌతుంది.

ఇక తెలంగాణా విషయానికి వస్తే గత ఆరేళ్ళుగా కాంగ్రేస్ ఆడుతున్న దొంగనాటకానికి చరమాంకం దగ్గర పడింది. అతి తొందరలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి. ఈవిషయంలో ఎటువేపు వెళ్ళినా ఇంకోవర్గం వారి వ్యతిరేకతను చవిచూడక తప్పదు! ఒక పాలసీ అంటూ లేకుండా తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఆ పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. కానీ ఈ పార్టీకి అటువంటి అలవాట్లు లేవన్నది చారిత్రక సత్యం.  

ధరల పెరుగుదల, రైతుల ఆత్మహత్యలు, పెట్రోలు ధరలు, నీటి సమస్యలు మొదలైన అంశాలతో చంద్రబాబు నాయుడు పుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎన్నికలలో గెలవలేలనే శంకే లేకపోయి ఉండకపోతే ఆయన ఈపాటికే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ బలహీనతలు రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఒక వరంలా మారాయని చెప్పవచ్చు.

పద్ధెనిమిదిమంది ఎమ్మెల్యేలతో చక్రం తిప్పే అవకాశం ఎప్పుడు వస్తుందా అని చిరంజీవి రోజూ కాంగ్రేస్ తలుపు తట్టి వస్తున్నాడు, కాని ఎందుకో కాంగ్రేస్ వారే ఆయన్ను గడప దగ్గరే అపేస్తున్నారు. బహుశా ఈయన్ని తీసుకొని ఇంకొన్ని సమస్యలు కొనుక్కోవడం ఇష్టం లేనట్టుంది వారికి!

ఇలాంటి పరిస్థితులలో రేపు తెలంగాణా పై జరుగబోయే రెండో అఖిలపక్ష సమావేశంలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి ఎదురయ్యింది. వంద సంవత్సరాల చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికి ఎలాంటి సర్వరోగ నివారిణిని కనిపెడుతుందో వేచి చూడాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...