Skip to main content

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు.

అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు.

నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న రాజకీయ శూన్యాన్ని పూడ్చగలిగి ఉండే వారేమో.

2009 ఎన్నికలలో పరిస్థితి వేరుగా ఉంది. అప్పటికే రాజశేఖర్ రెడ్డి తన ప్రభుత్వంలో రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇంకోవైపు ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ, గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా బలం పుంజుకున్నారు. ఈ పరిస్థితులలో వచ్చిన చిరంజీవి వారి వారి వోటు బ్యాంకులను చీల్చడం తప్ప పెద్దగా సాధించ గలిగింది ఏమీ లేదు.

రాజకీయ నాయకుడనే వాడికి ఒక సిద్ధాంతం ఉండాలి. తన సిద్ధాంతాన్ని ప్రజలకు బలంగా చెప్పగలిగి ఉండాలి. కానీ చిరంజీవి విషయంలో ఇవేవీ కనపడవు. మొదట మిత్రా తో కలిసి ప్రజారాజ్యం స్థాపించి నప్పుడు మార్క్సిస్టు వాసన కనిపించింది. అప్పుడు అందరూ మార్క్సిస్టు భావాలు కలిగిన పార్టీ అని భావించారు. తన మామ అల్లురామలింగయ్య మార్క్సిస్టు భావాలు కలిగి ఉండడం కూడా కొంత కారణం. కమ్యూనిస్టులు చిరంజీవి వర్గాలతో చర్చలు జరపడం కూడా కనిపించింది.

తర్వాత కత్తి పద్మారావు లాంటి వారు ప్రవేశించడంతో ఆ పార్టీ సామాజిక న్యాయం వాసనలు కొట్టడం ప్రారంభించింది. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ పార్టీ విలీనం చెందడంతో అది 'సామాజిక తెలంగాణా' గా మారింది. డిసెంబరు 10 2009 తర్వాత అది 'జై సమైఖ్యాంధ్ర' గా మారింది. చివరికి నిన్న సోనియా గాంధీని కలిసిన తర్వాత అది 'అమ్మ మాట శిరోధార్యం' క్రింద మారింది. కాకలు తీరిన నేతలే తమ దిశను మార్చుకోవడానికి పదిసార్లు ఆలోచిస్తారు, ప్రజలు గమనిస్తారేమోనని. అలాంటిది క్రొత్తగా రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి ఇన్నిరకాలుగా సిద్ధాంతాలలో మార్పు చేర్పులు చేయడం ప్రజలు గమనిస్తూనే ఉంటారు.

వాస్తవానికి చిరంజీవికి తన పార్టీని కాంగ్రేసులో విలీనం చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పటికే తెలంగాణా లో ప్రాభవం కోల్పోయారు. ఇద్దరు తెలంగాణా ఎమ్మెల్యేలు అంటీ  ముత్తనట్టుగా ఉన్నారు. ఇంకొందరు జగన్ వెంట వెళ్ళే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితులలో ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో పాలు పంచుకోకుండా పార్టీని నడపడం దాదాపు అసాధ్యం. మూడు సంవత్సరాల తర్వాత కూడా తన పార్టీ ద్వారా CM పదవి సాధించే మార్గం కానరావడం లేదు. ముందు ముందు పదవులు వచ్చినా, రాకపోయినా, పార్టీని నడపాల్సిన బృహత్తర బాధ్యత నుండి విముక్తి లభిస్తుంది.

కాంగ్రేసు పార్టీ వారికి మాత్రం తక్షణ ప్రయోజనాలు సిద్ధించడం ఇప్పటికే కనపడుతుంది. కాంగ్రెస్ బాలహీన పడి ఉప ఎన్నికలు వస్తాయేమోనని జగన్ వెంట ఉన్నవారు తాజా పరిణామాలతో ఒక్కక్కరే మాయం కావడం మొదలు పెట్టారు. ఈ లెక్క కాంగ్రెస్ వ్యూహం ఫలించి నట్టే. తర్వాత్తర్వాత కాంగ్రెస్ వారు కూరలో కరివేపాకులా చిరంజీవిని పక్కకు పెడతారా, పెద్దపీట వేసి కూర్చోబెడతారా అన్నది వేచి చూడాల్సిందే.

Comments

  1. నాకు తెలిసి ప్రజారాజ్యం పార్టీని సిద్ధాంతాల పునాదుల మీద స్థాపించలేదు. సినిమా గ్లామర్ పునాదుల మీద స్థాపించిన పార్టీ అది. సిద్ధాంతాల పునాదుల మీద స్థాపించబడిన మార్క్సిస్ట్, మావోయిస్ట్ పార్టీలలో అంతర్గత విభేదాల వల్ల చీలికలు వచ్చినా సిద్ధాంతాల మీద నమ్మకంతో వాటిలో పని చేసేవాళ్లు ఉంటారు. గురు గోల్వాల్కర్ సిద్ధాంతాలని నమ్మే RSSలోనైనా సరే చీలిక వచ్చినా అందులో సభ్యులు కొనసాగుతారు. కానీ ఇతర పార్టీలలో అలా కాదు. కేవలం పదవుల కోసం పార్టీలో చేరుతారు. పదవి రాకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతారు. ప్రజారాజ్యం పార్టీలో అలాగే జరిగింది.

    ReplyDelete
  2. ప్రవీణ్ శర్మ గారు,

    లోపల ఉన్నది అధికార సిధ్ధాంతమే అయినా, పైకి మాత్రం సిధ్ధాంతాలు చెప్పారుగా! వారు అధికారమే మా సిధ్ధాంతం అని చెప్పి వస్తే గొడవే లేదు.

    ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె