Skip to main content

జూనియర్ డాక్టర్ల సమ్మె - ఒక దీర్ఘ కాలిక పరిష్కారం


జూనియర్ డాక్టర్ల సమ్మె మళ్ళీ మొదలైంది.  ప్రతి సంవత్సరం వీరి సమ్మె ఒక తంతుగా జరుగుతూ వస్తుంటుంది, మనం చూస్తుంటాం.  నిబంధనల ప్రకారం చదువు పూర్తయ్యాక వీరు తప్పని సరిగా గ్రామాల్లో ఒక సంవత్సరం పాటు చేయవలసి వుంటుంది. వీరి సమ్మె జరిగిన ప్రతిసారీ ఆ నిబంధనను తీసివేయడమే పరమావధిగా ఉంటుంది. గ్రామాల్లో డాక్టర్ల లభ్యత లేక పోవడం వల్ల ప్రభుత్వం కూడా ఆ విషయంలో సడలింపు ఇవ్వలేక పోతుంది.

అవసరాలకు సరిపడా డాక్టర్లు లేకపోవడమే సమస్యకు మొత్తం మూలకారణంగా కనిపిస్తోంది. నగరాల్లో అధిక మొత్తంలో వేతనాలతో అవకాశాలు లభిస్తున్నప్పుడు ఊళ్లల్లోకి వెళ్లి స్టైపెండ్ పైనే ఉద్యోగం చెయ్యమంటే సహజంగానే వారికి నిరాశ కలుగుతుంది కదా. గొప్ప ఆశయాలతో, కొంత సేవా దృక్పథంతో వారు కూడా గ్రామాల్లో సర్వీస్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ పోటీ సమాజంతో అంతటి దేశభక్తి కాని, మానవతా దృక్పథం కాని కలిగిన వారు పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో జుడాలు మాత్రం అందుకు అతీతంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమో.

వారు కోరుతున్నట్టు అధిక వేతనాలు ఇచ్చి ఊళ్లకు పంపవచ్చు, కాని దానివల్ల అనేక ఇతర ఇబ్బందులు, ఉద్యోగుల కేడర్ల వేతనాల సమతుల్యత దెబ్బతిని మరిన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. నిజానికి నగరాల్లో కన్నా గ్రామాల్లో వారికి కర్చు చాలా తక్కువ. ఆ విధంగా ఎక్కువ మొత్తం మిగులుతుంది. కాబట్టి వారి అభ్యంతరాలకు డబ్బు సమస్య కారణం కాదని తెలిసి పోతూనే వుంది. నగరాల్లో ఉండే తళుకు బెళుకుల వల్లో, మరే ఇతర కారణాల వల్లనో కానీ వారు ఒళ్లకు వెళ్ళడానికే ఇష్టపడడం లేదు.  అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కువ వేతనాలు చెల్లించడానికి ముందుకు వచ్చినా కూడా ఫలితం ఉండేటట్లు అనిపించడం లేదు.

ఆవశ్యకత, లభ్యత మధ్య అంతరం తగ్గనంత వరకూ ఈ సమస్య కొనసాగుతూనే వుంటుంది. కాబట్టి డాక్టర్ల సంఖ్యను పెంచడమే సి సమస్యకు ఉన్న ఒకే ఒక పరిష్కారం. ఒకవైపు నగరాల్లో అడుగడుగునా డాక్టర్లు కనపడితే గ్రామాల్లో మండలానికి ఒక్కరు కూడా ఉండడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరు కారు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు అసలే ఉండరు.  ఇక మిగిలింది RMP డాక్టర్లే.  గ్రామాల్లో 90% వైద్యావసరాలు వీరివల్లనే తీరుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.  కాని వీరికి సరియైన శిక్షణ లేక పోవడం వల్ల ఎన్నోఇబ్బందులు కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా సంభవిస్తున్నాయి.

కాబట్టి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పెంచడానికి దీర్ఘ కాలిక ప్రణాళికను రూపొందించు కోవాలి. మెడికల్ కాలేజీల స్థాపన అంత సులభం కాదు, అంతేకాక కేవలం మరికొన్ని మెడికల్ కాలేజీలు అదనంగా స్థాపించినంత మాత్రాన కూడా ఈ సమస్య పరిష్కారం కాదు.

పూర్తిగా MBBS పట్టభద్రుల పైనే ఆధార పడకుండా వైద్యంలో డిప్లొమా పట్టభద్రులను కూడా తయారు చేసుకోగలిగితే ఈ సమస్యకు దీర్ఘ కాలిక పరిష్కారం లభిస్తుందేమో నని అనిపిస్తుంది. అస్సలు శిక్షణ లేని RMP డాక్టరు కన్నా కొంతమేరకు శాస్త్రీయ శిక్షణ పొందిన డిప్లొమా డాక్టరు అన్ని రకాలుగా ఉత్తమ సేవలు అందించ గలడు. డిప్లమా డాక్టరుకు నగరాల్లోని కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవకాశాలు లభించవు కాబట్టి వారు తప్పనిసరిగా ఊళ్లల్లోకి వెళ్లి సేవలు అందించే అవకాశం ఎక్కువ.

 ఈ డిప్లమా డాక్టరు కోర్సులను మూడేళ్ళకు పరిమితం చెయ్యాలి. ప్రతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానించి వీరికి కళాశాలను స్థాపించాలి. రోజులో సగం తరగతి గది శిక్షణ, మిగతా సగం ఆస్పత్రిలో పనితో కూడిన శిక్షణ ఉండాలి. నాకు మెడికల్ విషయాలపై అంత అవగాహన లేదు, కాని మూడు సంవత్సరాల నిష్ణాతుల శిక్షణ, ఆస్పతులలో ప్రత్యక్ష అనుభవం వాళ్ళ ఒకింత మేరకు వారు మంచి వైద్య సహాయం అందించ గలరని అనిపిస్తోంది. ఏది చేయాలో, ఏది చేయగూదదో కూడా వారికి శిక్షణలో భాగంగా అవగాహన కల్పించ బడుతుంది. కాబట్టి వారు దుస్సాహసాలు చేసి ప్రాణాల మీదకు తీసుకు వచ్చే అవకాశం తక్కువ. వీరివల్ల తప్పకుండా డివిజనల్, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో MBBS డాక్టర్లకు బదులుగా వీరిని నియమించవచ్చు.  ఇది కేవలం నాకు కలుగుతున్న ఒక ఆలొచన. దీని సాధ్యాసాధ్యాలను గురించి నిష్ణాతులైన వారు ఎవరైనా స్పందిస్తే బాగుంటుంది.

Comments

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...