Skip to main content

ఓటు ఎవరికి వేయాలి?

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయ నాయకులు వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నగదు బదిలీ, కలర్ టీవీలతో అగ్ర భాగాన నిలిచింది. మొదట వంద రూపాయలకే ఇంటి సరుకులు వగైరా హామీలతో ముందుకొచ్చిన ప్రజా రాజ్యం పార్టీ వెనుక బడింది. కాంగ్రెస్ అయితే ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచిత కరెంటు పథకాలు, జలయజ్ఞం ఇప్పటికే ఆచరించి చూపాం అంటుంది. ఇప్పుడు బీజేపీ కొత్తగా సెల్ ఫోనులు, పదివేలకే లాప్ టాపులు, బ్రాడ్ బ్యాండ్ వగైరాలతో బయలు దేరింది. మిగతా వారితో పోల్చి చుస్తే ఇది కొంచెం హైటెక్ గా కనపడుతుంది.. ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారో మరి!

నిజానికి ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలే. ప్రజోపయోగమైనవే. అయితే ముఖ్య మైన ప్రశ్న ఏమిటంటే ఇవి ఎంత వరకు ఆచరణ సాధ్యాలు? రైతులు, చేనేత కార్మికులు ఆత్మ హత్యలు చేసుకునే తరుణంలో కలర్ టీవీలు అవసరమా? రెండువేల రూపాయలు ఎవరికి ఇస్తారు? లబ్ది దారులను గుర్తించటానికి ప్రాతిపదిక ఏమిటి? నిజంగా గర్భ దరిద్రులకే ఆ సొమ్ము చేరుతుందని భరోసా ఏమిటి? గతంలో తెదేపా హయాములో పనికి ఆహార పథకం బియ్యం నాయకుల ఇళ్ళలోకి పోయాయన్న విషయం జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఆ నాయకులే జోక్యం చేసుకుని అనుచర గణానికి సంతర్పణ చేయరని గ్యారంటీ ఏమిటి?

ఇక అధికార పార్టీ అవినీతి చరిత్ర కనీ వివీ ఎరుగ నటువంటిది. ప్రాజెక్టులలో, గృహ నిర్మాణం పనులలో అవినీతి ఏరులై పారిన వైనం ఇంకో యాభై ఏండ్లకైనా మరపుకు రాదు. సూక్ష్మం లోంచి మోక్షం సృష్టించి నట్టుగా సాక్షి పత్రిక, ఛానెల్ ఎలా పుట్టాయో చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వీరికి మరోసారి ఓటు వేయమని ఎలా అడగాలనిపిస్తుందో మరి!

ఇక ప్రజా రాజ్యం విషయానికొస్తే... ఇంతవరకు పరిపాలించిన రికార్డు లేదు కాబట్టి ఏ రికార్డైనా బజాయించు కునే సావకాశం ఉంది వారికి. దానికి తగ్గట్టుగానే అవినీతి రహిత, సామాజిక న్యాయం మొదలైన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడు ప్రజా రాజ్యం లోని ముఖ్య నాయకుల్లో ఎంతమంది సామాజికంగా అట్టడుగు వర్గాల వారు ఉన్నారో చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. పైగా పార్టీ పురిట్లోనే ఒక బంధువుల సముహంలా మారింది.

ఇలాంటి తరుణంలో నిజమైన మార్పు కావాలంటే నిశ్శబ్ద విప్లవమొక్కటే మార్గం. నిశ్శబ్ద విప్లవమెందుకంటే... మన దేశం ఇప్పటికీ ఫ్యూడల్ వ్యవస్థ దాటి ముందుకు వెల్ల లేదు. ముఖ్యంగా గ్రామాలలో తమ వానిని ధైర్యంగా వినిపించే పరిస్థితి లేదు. ఏదో ఒక బలిసిన రాజకీయ పక్షానికి కొమ్ము కాయాల్సిన పరిస్థితి. అందుకే నిశ్శబ్ద విప్లవం.

కష్టాలకోర్చి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకున్న రోజు ప్రజలో కనపడ్డ చైతన్యం తర్వాత తర్వాత తాము నమ్మిన నాయకుల కుహనా చేష్టల వల్ల పూర్తిగా అణగారి పోయింది. అప్పుడు బ్రిటిష్ వారి నుండి విముక్తి లభిస్తుందని ప్రతి ఒక్కరు నమ్మారు. ఎందుకంటే నమ్మకమే కార్య దీక్షకు పునాది. కాని ఇప్పుడు ఈ స్వదేశీ అవినీతి పాలకుల నుండి తమకు విముక్తి లభిస్తుందని ఇంకా ప్రజలకు నమ్మకం కలగటం లేదు. దీన్ని బట్టి ప్రజలను ఈ అరవై ఏళ్ళలో ఎంతగా దిగజార్చారో అర్థం కావటం లేదూ?

అయితే ఏ పాలన కూడా కల కాలం సాగదనేది చరిత్ర చెప్తున్న సత్యం. మహా మహా సామ్రాజ్యాలు కూడా ప్రజల ఆగ్రహ జ్వాలలకు కూలి పోయాయి. ఈ అవినీతి సామ్రాజ్యం అందుకు మినహాయింపు కాదు. అదృష్ట వశాత్తు ఇప్పుడు మునుపటిలా త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం విచక్షణ తో ఓటు వేయడమే కావలసినది. లోక్ సత్తా కే ఓటు వేయాలని కాదు. బరిలో నిలచిన అభ్యర్థులలో అత్యంత నీతి పరులేవరోవారికే వోటు వేయాలి. అప్పుడు మార్పు అదే వస్తుంది.

Comments

  1. మీరన్నట్టు లోక్ సత్తా పార్టీ కొన్ని గ్రామాలనైనా దత్తత తీసుకుని ప్రజలలో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. అయితే దీనింకి చాలా సమస్యలున్నాయి.

    ఇప్పుడు పార్టీ కేవలం పట్టణాల్లోనే వ్యాపించి వుంది. సభ్యులు కూడ విద్యావంతులైన ఉద్యోగులు మాత్రమే. వారికి ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలలో పాల్గొనే సమయం లేదు. ఇతర పార్టీల కార్యకర్తలకు అధికారం వస్తే చాలు, ఎంతైనా సంపాదించులోవచ్చు అనే అలోచన వుంటుంది. అందుకని స్వంత డబ్బు, కాలం వెచ్చించైనా సరె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లోక్ సత్తా కి అలాంటి అవకాశాలు తక్కువ.

    ఇలాంటి తరుణంలో విద్యావంతులైన, ఆలోచననా పరులైన వారంతా స్వచ్చందంగా నడుం బిగిస్తే తాముండే, పనిచేసే ప్రదేశాల్లో తొటివారి ఆలొచనల్లో మార్పు తీసుకు రాగలరు. గత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఓదిపోవడానికి ముఖ్య కారణం ఉద్యోగులు, మేధావి వర్గాలే. వారు తలుచుకుంటే అట్టడుగు వర్గాలలో కూడా మార్పు తీసుకు రాగలరు. అయితే ముందుగా చాలామంది విద్యావంతుల, మేధావుల ఆలోచనా ధోరణి లో మార్పు రావాలి.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...