Skip to main content

ఎవరిదీ పాపం?

కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల్లో గత ఇరవై నాలుగ్గంటలుగా జరుగుతున్న దారుణ విలయం, అలాగే విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పొంచి వున్న ముప్పు కేవలం ప్రకృతి విలయం కాదనే విషయం హృదయాన్ని కలచి వేస్తుంది. ఈ పరిస్థితికి కారణం అహంకార పూరిత రాజకీయం, అధికారుల నిర్లక్ష్యం అని టీవీల్లో పేపర్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను.

  • సుంకేసుల ఆనకట్ట నిండింది. అయినా గేట్లు తెరుచు కోకుండా మొరాయించాయి. ఫలితంగా మట్టికట్ట తెగిపోయి నీరు పొంగి పొర్లింది. ముందుగా కర్నూలు మునగడానికి ఇదే కారణం. వేసవి కాలం లో గేట్లకు సరియైన నిర్వహణ, పరిశీలన జరిపి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.
  • శ్రీశైలం ప్రాజెక్టు పన్నెండవ గేటు ఇప్పటి వరకు తెరుచు కోలేదు. బాగా తుప్పు పట్టి తెరుచుకోక, ఒక ఉపకరణం విరిగి పొతే వెల్డింగు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదీ మన సన్నద్ధత. కొత్త ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించ డానికి ఉబలాట పడే ప్రభుత్వం పాత ప్రాజెక్టులు, చెరువుల మరమ్మత్తులకు పైసా విదిలించటం లేదని ఆరోపణ.
  • నాగార్జున సాగర్ నీటిని నిలువ చేయడానికి ఉద్దేశించ బడింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని నిలువ చేయ డానికి రూపొందించిన ప్రాజెక్టు కాదు. కేవలం జలవిద్యుత్తు కొరకై నిర్మించ బడింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు రెండు కొండల మధ్య నిర్మించ బడింది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే నీటిని వదల డానికి మట్టి కట్ట లేదు. పైగా నీరు నిండితే కర్నూలు మునిగి పోతుంది.
  • మన జల నిర్వహణ అసలు ప్రణాళిక ప్రకారం నాగార్జున సాగర్ ఎప్పుడూ నిండుగా ఉంచాలి, శ్రీశైలం ఎప్పుడూ నిండ నివ్వ కూడదు. కాని జరిగేది దీనికి విరుద్ధంగా వుంది.
  • పోతిరెడ్డి పాడు నిర్మాణం జరిగిన దరిమిలా శ్రీశైలం డ్యాములో మిగులు జలాలు ఉన్నాయని చూపించుకోవ డానికి గేట్లు ఎత్తడానికి కావలసిన కావలిసిన అధికారాల్ని ముఖ్య మంత్రి కార్యాలయం లో అట్టి పెట్టుకున్నారు. అలాగే నియమిత నీటి నిలువ పరిమితిని కూడా ప్రాజెక్టు నిర్మించినప్పుడు విధించిన పరిమితి కన్నా అధికంగా పెంచి వేశారు. ఇంజనీర్లు తీసుకోవలిసిన నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలుగా మారి పోయాయి.
  • అలమట్టి, నారాయణ పూర్ డ్యాం లనుండి నీటిని వదులుతున్నట్టు మూడు రోజుల నుండే సంకేతాలున్నా శ్రీశైలం డ్యాం లో నీటి నిలువను తగ్గించ డానికి చర్యలు తీసుకోలేదు. ఖాళీగా ఉన్న నాగార్జున సాగర్ లోకి నీటిని ముందుగా వదిలి వుంటే పరిస్థితి వేరుగా వుండేది.
  • తప్పి పోయిన ముఖ్య మంత్రిని వెదక డానికి ఆఘ మేఘాల మీద హెలికాప్టర్లు, వెతికే విమానాలు, చివరికి అత్యాధునిక సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా వచ్చాయి. లక్షల మంది ప్రజలు ప్రమాదంలో చిక్కు కున్నప్పుడు మాత్రం కనీసం హెలికాప్టర్లు కూడా జాడ లేవు. వచ్చిన హెలికాప్టర్లను కూడా ఇంధనం లేదని ఉపయోగించుకోలేక పోవడం కన్నా సిగ్గుచేటు లేదు.
  • ఇన్ని లక్షల మంది ప్రాణాలు ప్రమాదం లో పడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు గా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరమైన విషయం.

Comments

  1. అంతా చచ్చినోడి దయ అంటారు.

    ReplyDelete
  2. oremuna గారు

    ఒక్క ముక్కలో తేల్చేసారు!

    ReplyDelete
  3. ఈ పనికిమాలినవాళ్ళని ఆఫ్టరాల్ రెండొందల రూపాయల పింఛన్ల కోసం ఎన్నుకున్న బౌద్ధిక బడుద్ధాయిలున్నారు గదా ! వాళ్ళకి కళ్ళు తెఱిపించగలవారెవరైనా ఉంటే....

    సామూహిక పాపాన్ని సామూహికంగానే అనుభవించాలి ప్రజలు. అనుభవించనివ్వండి.

    --తాడేపల్లి

    ReplyDelete
  4. అవును నిజమే, ఎవరిది ఈ పాపం? చాలా బాగా విశ్లేషించారు.

    ReplyDelete
  5. ఆయన మొదటిసారి వచ్చాక
    -కనీస మట్టాన్ని (MDDL) 836 అడుగుల నుంచి 854కు పెంచేసాడు.
    -పోతిరెడ్డీపాడు రెగ్యులేటరును 11 వేల క్యూసెక్కుల నుంచి 44వేలకు పెంచే పని మొదలెట్టాడు.
    -సొంత కర్మాగారాలు మొదలెట్టాడు.

    సొంతలాభం సుంత కూడా మానుకోలేదు.

    ReplyDelete
  6. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల్ని రాజశేఖర్ రెడ్డి ఎలా కాలరాశాడనేది మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇది మొదటిది మాత్రమే.

    ReplyDelete
  7. oremuna, LBS, AMMA ODI, చదువరి, కత్తి మహేష్ కుమార్ గార్ల కామెంట్లకు ధన్య వాదాలు.

    ReplyDelete
  8. చదువరి గారు,

    మీరిచ్చిన వివరాలకు ధన్య వాదాలు, అవి సరిగా గుర్తు రాక నేను వ్రాయ లేదు.

    ReplyDelete
  9. అన్నిటికన్నా పెద్ద పాపం మనదే - ఎడాపెడా చెట్లు నరికెయ్యడం. దీనివల్ల ప్రవాహానికి అడ్డులేకుండా పోయి ఊహించలేని వేగంతో నదుల్లో, వాగుల్లో నీరు చేరుతోంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...