Skip to main content

తెలుగు భాష, పదజాలం

తెలుగు భాషలో ఇంగ్లీషు పదాలు ఉండాలా ఒద్దా అనే విషయం మీద ఇటీవల తర్కాలు బాగా జరుగుతున్నాయి. దీంట్లో కొంతమంది తెలుగు భాష లో ఇంగ్లీషు పదాలు కలపాలని, కొంత మంది కొత్త పదాలు తయారు చేయాలని అంటున్నారు.

రైలు, బస్సు, కారు, కరెంటు లాంటి పదాలు ఎంతగా వాడుకలోకి వచ్చాయంటే వాటికి బదులు వేరొక సులభమైన తెలుగు పదం తయారు చేసైనా సరే, వాడుకలోకి తేవడం అంత సులభమైన విషయం కాదు.

అలా అని ఇంగ్లీషు పదాలను తెలుగు లోకి దిగుమతి చేస్తూ పోతుంటే, చివరికి తెలుగులో తెలుగే మిగలకుండా పోయే ప్రమాదం ఉంది. తాడేపల్లి గారు ఇక్కడ చెప్పినట్టుగా ఇంగ్లీషు పదాల్ని అరువు తెచ్చుకున్నా కూడా ఆ పదాల్ని పునర్నిర్మితం చేసి మరిన్ని కొత్త పదాలను తయారు చేసుకోలేక పోతున్నాం.

ఇక తెలుగు పదాల్ని సృష్టించ డానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వారంతా ఎంతో అభినంద నీయులే అయినప్పటికీ, ఈ పదాలకు ఒక దిశా నిర్దేశం లేదేమో అనిపిస్తుంది. ఎవరికీ వారే ఏదో కొన్ని పద బంధాలని కలిపి, లేదా అచ్చులను, హల్లులను కలిపి ఒక శబ్దాన్ని తయారు చేసి, పదాలను పుట్టిస్తున్నారు. అయితే కొంతమంది మేధావులు శాస్త్రీయంగా సంస్కృత పద బంధాలను, ధాతువులను, వ్యాకరణాన్ని ఆకళింపు చేసుకొని పదాలను తయారు చేస్తున్నారు. అయినా కూడా ఇవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తాయన్నది అనుమానాస్పదమే!

నా ఉద్దేశంలో ఇప్పుడు మన భాష మేధావులు చేయాల్సిన పని కొత్త పదాలను తయారు చేయడం కాదు. అంతకన్నా ముఖ్యంగా తెలుగు వ్యాకరణాన్నే సమూలంగా మార్పు చేయాలి. ఈ విషయం లో పెద్దగా పరిజ్ఞానం లేక పోయినా తల దూరుస్తున్నందుకు చదువరులు మన్నించాలి. వ్యాకరణంలో మార్పులు చేయాలంటే చాలా మందికి కోపం రావచ్చు, కాని భాష అభివృద్ది చెందాలంటే ఇది తప్పని సరి.

ఇంగ్లీషు వాడు చూడండి, పదాలను ఎలా పెంచు కుంటాడో? meta అనే పదం గ్రీకు నుండి వచ్చింది. దాన్ని ఇంగ్లీషు పదాలకు అనుసంధానించి ఎన్నో ఇంగ్లీషు పదాలను తయారు చేసారు. ఉదా: metadata, metamemory, meta-knowledge లాంటివి.

ఇక మనమో, ఒక తెలుగు పదంతో ఇంగ్లీషు పదాన్ని సంకరించలేం. అంతెందుకు? ఒక సంస్కృత పదంతో అచ్చ తెలుగు పదాన్ని సంకరించలేం. ఒక ప్రకృతిని ఒక వికృతిని కలప లేం. ఇలా మనమే భాషపై ఎన్నో ప్రతిబంధకాలని బిగించు కున్నామేమో అనిపిస్తుంది. అలాగే నాకు తెలిసి చిన్నయ సూరి వ్యాకరణాన్నే మనం ఇంకా వాడుతున్నాం. అప్పటికి, ఇప్పటికి భాషలో కాని పదాలలో కాని ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో కొత్త సాంకేతికావసరాలు ఏర్పడ్డాయి. కాబట్టి సమకాలీన అవసరాలకు సరిపడే విధంగా వ్యాకరణాన్ని తిరిగి రాసుకోవాల్సిన అవసరం వుంది.

పద బంధాలకు సంబంధించి కొన్ని నియమాలను సడలించాల్సిన అవసరం వుందేమో అనిపిస్తుంది. ఉదాహరణకు 'అమలినం' లాగ 'అమకిలి' ఎందుకు ఉండ గూడదు? మలినం, మకిలి ఎందుకు సమాన స్థాయి పదాలు కావు? మన భాషలోనే కొన్ని పదాలకు ఉన్నత స్థాయి, కొన్ని పదాలకు అధమ స్థాయి కల్పించి భాషను సంకుచితం చేసుకుంటున్నా మేమో అనిపిస్తుంది. నా ఆలోచనలు తప్పయితే విజ్ఞులు క్షమించి వివరించ గలరు.

నా ఉద్దేశంలో ఒకసారి తెలుగీక రించిన తర్వాత అన్ని పదాలకు సమాన స్థాయి కల్పించాలి. ఒక ధాతువు ఒక తెలుగు పదం పై ఉపయోగించ గలిగినపుడు ఆ ధాతువును అన్ని సంబంధిత పాదాలపై ఉపయోగించ గలగాలి, శబ్ద సంబంధిత వ్యాకరణ దోషాలు లేనంత వరకు. మరిన్ని ఆదిబంధాలను, అంతబంధాలను (prefixes and suffixes) సృష్టించాలి.

పదాల సృష్టికి కావలసిన నియమాలను నిర్దిష్టంగా నిర్వచించాలి. వీటిని అధ్యయనం చేసిన వారు తమకు కావలసిన పదాలను తామే సృష్టించుకో గలగాలి. అసలు వ్యాకరణ నియమాలు ఎలా ఉండాలంటే, ఒక క్రొత్త పదాన్ని ఆ నియామలను అభ్యసించిన వారెవరు సృష్టించినా అది ఒకే విధంగా ఉండాలి.

తెలుగు భాషను అభివృద్ది చేయడంలో తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం ఎలాగూ విఫల మయ్యాయి. అయితే మన బ్లాగులోకంలో అనేకమంది భాషావేత్తలు ఉన్నారు. వారిలో కొందరైనా పూనుకొంటే ఈ మహత్కార్యాన్ని సుసాధ్యం చేయ వచ్చేమోనని నా ఆశ.

Comments

  1. మీరు చేకూరి రామారావు గారు వ్రాసిన తెలుగువాక్యం అన్న పుస్తకం చదివారా?

    ReplyDelete
  2. చదువ లేదండి. దొరికితే కొని చదవడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...