Skip to main content

మతం మంచిదా, చెడ్డదా?

మతం మంచిదా, చెడ్డదా అనే విషయం మీద రక రకాల చర్చలు జరుగుతున్నాయి. మంచి, చెడుల స్వభావం గూర్చి గతం లోనే ఒక వ్యాసం వ్రాసి ఉన్నాను. మంచి, లేదా చెడు అనేవి విశ్వంలో ముందే నిర్ణయించ బడి లేవు. అవి దేశ కాల పరిస్థితుల కనుగుణంగా మారుతుంటాయి. ఒక దృష్టి కోణం లోంచి మంచిగా కనపడిన విషయం మరో దృష్టి కోణం నుంచి చెడుగా కనపడేందుకు ఎంతైనా అవకాశం ఉంది.

ఇంతకీ మతమంటే ఏమిటి? మతమంటే ఒక మార్గం. ఒక జీవన విధానం. ఇప్పటి వరకు ఎన్నో మతాలు ఉద్భవించాయి, కొన్ని మతాలు స్థాపించ బడ్డాయి. చాలా మంది పుట్టుకతో మతాన్ని వారసత్వంగా పొందుతున్నారు. కొంతమంది ఇష్ట పడి మతాన్ని స్వీకరిస్తున్నారు.

దార్శనికులైన వ్యక్తులు తాము చూసిన ప్రపంచం లోని రకరకాల అవకరాల గురించి తీవ్రంగా ఆలోచించి కొన్ని నియమాలను ప్రతిపాదిస్తారు. ఈ నియమాలనే జనానికి ప్రభోధిస్తారు. ఎక్కువ మంది జనం ఈ నియమాలు నిజంగా తమ సమస్యలని పరిష్కరిస్తాయని భావించినప్పుడు వారంతా ఒక మతంగా మారటం మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఇలా ఏర్పడ్డ మతంలోని అనుయాయులు తరువాత తరంలో తమ మత సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేక దిశలో పయనించడం కూడా చూశాం. ఉదాహరణలు కోకొల్లలు. క్రీస్తు, 'తప్పు చేయని వాడు మొదటి రాయి విసరాల్సింది'గా తన అనుయాయులను కోరాడు. కాని తరువాత తరాల క్రిస్టియన్లు అన్య మతస్తులను రాళ్ళతో కొట్టి, సజీవ దహనాలకు పాల్పడి ఎలా హింసించారో మనం చూశాం.  

ఈవిధంగా మతం మహాపురుషుల సదాశాయాలతో ప్రారంభమైనప్పటికీ ఎలాంటి వికృత రూపలోకి మార్పు చెందగలదో చరిత్రను పరికిస్తే అర్థమౌతుంది. మతం సమూహశక్తిగా మారినప్పుడు, ఆ శక్తి అసాంఘిక శక్తుల నేత్రుత్వంలోకి వచ్చినప్పుడు దాని అసలు విధ్వంసక శక్తి బయట పడుతుంది. మతం అంటే మార్గంగా ముందే నిర్వచించు కున్నాం. నా దృష్టిలో ఆలోచనా రహిత సమూహశక్తిగా మారిన కమ్యూనిజం కూడా ఒక మతమే. సిద్ధాంతాలను తుంగలో తొక్కి అది పాల్పడిన దురాగతాలు కూడా మనం చరిత్రలో చూశాం.

ఇక పోతే ప్రతి మతం లోనూ కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాలు మతం పుట్టిన కాలంలో ఉన్న పరిస్థితుల వలన అప్పటి మేదావులైన ప్రవక్తలు హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయించినవిగా ఉంటాయి. ఆ కాలంలో ఆయా నిర్ణయాలు, నియమాలు మంచివి గా భావించి ఉండవచ్చు. అంత మాత్రాన అవి సార్వకాలీన సత్యాలుగా భావించ వలసిన అవసరం కనిపించదు. ఉదాహరణకి ఇస్లాం మతం లో నలుగురు భార్యలను పెళ్లి చెసుకోవడానికి అనుమతి ఉంది. బహుశా ఆ కాలంలో విపరీతమైన యుద్ధాల వలన పురుషులు మహిళల కన్నా తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు, సామాజిక సంబంధాలను కాపాడడానికి ఇలాంటి వెసులు బాటు కల్పించి ఉంటారు. ఆ కాలంలో మహిళలకు వెసులుబాటుగా ఉన్న ఈ అవకాశం, ఈనాడు వారి హక్కులకు భంగకరం కావడం చూస్తున్నాం. అలాగే పూర్వ కాలంలో మన దేశంలోని రాజులు, పరపతి గలవారు అధిక సంఖ్యలో భార్యలు కలిగి ఉండడం, ఆ కారణంగా కొందరికి వధువులు దొరక్క పోవడం వలన, దాన్ని కట్టడి చేయడానికి హిందూ మతంలో ఏక పత్నీవ్రతం విధించి ఉంటారు.   

అలాగే మనం అన్ని  మతాల లోనూ ఎన్నో రకాలైన ఆచారాలను చూస్తుంటాం. ఇవన్నీ సంబధిత కాలంలో ఎంతో అవసరమైనవీ, హేతుబద్ధంగా అలోచించి నిర్ణయించినవీ కావచ్చు. కానీ ప్రస్తుత కాలంలో ఆ ఆచారాలు కాని, సాంప్రదాయాలు కాని యదాతధంగా అనుసరించడం మంచిది కాక పోవచ్చు. ఎందుకంటే ముందే అనుకున్నాం మంచి లేదా సత్యం అనేది కాలాన్ని, పరిస్థితులను బట్టి మారుతుందని.

నా ఉద్దేశంలో పైన చెప్పిన అవకరాలన్నిటికీ కారణం ఒక్కటే. సత్యం లేదా మంచి అచంచల మైనదిగా (immutable) నమ్మడం. తమ ప్రవక్త, లేదా నాయకుడు చెప్పిందే సత్యమని నమ్మడం. తమ నమ్మకాలకు, విశ్వాసాలకు అతీతంగా కూడా సత్యం ఉండే అవకాశం ఉంటుందని ఒప్పుకో లేక పోవడం. తమ విశ్వాసాలకు విరుద్ధంగా ఆలోచించడం తమ పైన దాడిగా భావించడం. ఇలా నమ్మడం వలన తాము సత్యం అనుకున్న దాన్ని రక్షించ డానికి ఎంతకైనా తెగిస్తారు.

ఏ మతాధిపతి కూడా తమ 'ప్రవక్త, లేదా ఆది గురువు చెప్పింది పూర్తిగా సత్యం కాకపోవచ్చని, కేవలం సమకాలికంగానే సత్యం కావచ్చు' అనే విషయాన్ని ఒప్పుకోడు. అలా ఒప్పుకుంటే ప్రవక్తపై విశ్వాసం సన్నగిల్లి మతం మొత్తం కకావికలం అయిపోయే ప్రమాదం ఉంది.

సత్యం అచంచలమైనదిగా నమ్మడం వలన మన దృష్టిలో డానికి ఒక రకమైన పవిత్రత ఏర్పడు తుంది. అచంచల మైన దానికి విరుద్ధంగా తర్కించడం, దాన్ని ప్రశ్నించడం కూడా  దుస్సాహసంగా కనబడుతుంది. తమ విశ్వాసాలకు విరుద్ధంగా ఇతరులు  అభిప్రాయాలను వ్యక్తీకరించి నపుడు వారిపై శతృత్వ భావం కలుగు తుంది. 

ఎప్పుడైతే సత్యం జడపదార్థంగా కాక నిరంతరం మార్పు చెందే విషయంగా గుర్తిస్తామో, అప్పుడు దాని గురించి ఆలోచించగల, తర్కించ గల వెసులుబాటు కలగుతుంది. చర్చించడానికి సుహృద్భావ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి వాతావరణం అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.   

Comments

  1. మీరు వ్రాసిన ప్రధానాంశంతో సంబంధం లేని ఒక అవాంతర విషయం గురించి నావీ రెండు పైసలు :

    హిందూ పురుషుడు ఎంతమంది స్త్రీలని చేసుకోవాలనే విషయమై హిందూ ధర్మశాస్త్రాలలో ఏ విధమైన నిర్దేశాలూ లేవు. కొద్దిమంది రామభక్తులు ఏకపత్నీవ్రతాన్ని ఒక ఆదర్శంగా ప్రచారంలోకి తెచ్చారు. కానీ రాములవారి అనంతరం చాలా యుగాలపాటు మన సమాజంలో బహుపత్నీకత్వం కొనసాగుతూనే ఉంది. మన ప్రస్తుత ఏకపత్నీవ్రత చట్టాలకు కారణం క్రైస్తవ రాజ్యాంగాల అనుసరణే తప్ప రామభక్తి కాదు. అయితే ఇప్పుడు కూడా మన హిందూసమాజంలో ఇద్దరు భార్యలతో కాపరం చేసేవాళ్ళు లక్షలాదిగా ఉన్నారు, చట్టం సంగతెలా ఉన్నా !

    ReplyDelete
  2. మతం గురించి రాసుకుంటూ మద్యలో కమ్యూనిజంపై అక్కసు వెళ్ళగక్కడం దేనికి. సమాజానికి శాస్త్రీయమైన ఆలోచననిచ్చింది కమ్యూనిజం. సమసమాజం గురించి ఆలోచించలేని వాళ్ళకు అలానే కనిపించవచ్చు.

    ReplyDelete
  3. ఓబుల్ రెడ్డి గారు,

    బహు భార్యత్వం పై మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. సమకాలీన పరిస్థితుల కనుగుణంగానే మాట నియమాలు ఉంటాయి అని చెప్పడమే నా ఉద్దేశం.


    కేక్యూబ్ వర్మ గారు,

    కమ్యూనిజం పై నా కెలాంటి ద్వేషం లేదు. ఆలోచనారహిత సమూహశక్తిగా మారిన కమ్యూనిజంపై మాత్రమే నా అభ్యంతరం. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన కొన్ని దేశాలలో జరిగిన మితిమీరిన వ్యక్తిపూజ, సామూహిక జనహననం వాస్తవాలు కాదంటారా?

    ReplyDelete
  4. ఇస్లాము నలుగురు భార్యలు అనుమతించడం పై నాకో సందేహం.
    నాలుగే ఎందుకు, ఆరో పదిహేడో ఎందుకు కాకూడదు? ఇస్లాము కొంత గమ్మతు గా చాలా సార్లు అంకెను quantify చేస్తుంది. జిహాదు చేస్తే 42 మంది కన్యలతో స్వర్గం లో గడపవచ్చు అని .
    ఈ అంకెలు బేరం జరిగి ఒక ఒప్పందానికి వచ్చినట్లు అనిపిస్తుంది.

    మతాల వల్ల ప్రధానం గా మంచే జరిగింది (?). మీరు అన్నట్లు మతం నియమాలను చెపుతుంది, మూల సూత్ర fundamental ) నియమాలు అన్ని మతాల్లోనూ అవే ఉంటాయి.
    సామజిక జీవనం సాఫీ గా సాగడానికి ఇది ఇంతో ముఖ్యం. కాకపోతే .. మిగతా నియమాల తోటే సమస్య.

    ReplyDelete
  5. tana manugadaku,jeevanaaniki,santhosaaniki sahakarinche ye mathannina,evaraina sweekarinchavachhu.manusyulandaru samaaname ane bhavanaku oka siddanthamgaa chebite adi communism.aacharanalo konthamandi manusyulu thamaswardamto thappulucheste adi communism thappu kaadu.gajula

    ReplyDelete
  6. @RaPaLa
    ఇస్లాం మతం భార్యల సంఖ్యను ఆరో పదిహేడో నుండి నలుగురికి కుదించింది.జిహాదు చేస్తే 42 మంది కన్యలతో స్వర్గంలో గడపవచ్చు అని ఖురాన్ లో లేదు.యుద్ధాల వలన పురుషులు మహిళల కన్నా తక్కువవుతారు.స్త్రీల భద్రత కోసమే ఇది కల్పించారు.ఈనాడు 99% ముస్లిములు ఎవరూ బహు భార్యాత్వాన్ని పాటించటంలేదు.కారణం ముస్లిం స్త్రీలు తమ హక్కులకు భంగం కలగకూడదని జాగృతం అయ్యారు.రెండో పెళ్ళాన్ని తెస్తే తిరగబడి కొడతారు కూడా.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...