Skip to main content

రాష్ట్ర విభజన తప్పదా?

శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు రానే వచ్చింది.

మొదటి సూచనగా రాష్ట్రం యధాతథంగా కొనసాగడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టింది. ఈవిషయం ఇప్పటికైనా సమైక్యవాదులు గుర్తిస్తే మంచిది.

శ్రీక్రిష్ణ కమిటీ ఆరు సూచనలు చేసింది. అందులో నాలుగు ఆచరణసాధ్యం కాదని చెప్పింది. అది ఈ ఆరు సూచనలే ఎందుకు చేసిందనేది అంతు పట్టని తర్కం. ప్రజల నుండి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుందనుకుందామంటే,  ప్రజల్లోంచి ఇంకా చాలా సూచనలు వచ్చాయి. ఉదాహరణకు ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, వన్యసీమ మొదలైనవి. వాటిని కూడా చర్చించి సాధ్యాసాధ్యాలు వ్యాఖ్యానించాలి కదా! అందులో కూడా గ్రేటర్ రాయలసీమ, ప్రత్యెక రాయలసీమ, ప్రత్యేక ఆంధ్ర (సీమ లేకుండా) అనేవి బలంగా వినిపించాయి. మరి వీటిని కనీసం చర్చించనైనా లేదెందుకు? వాటిని కూడా చర్చించి సాధ్యం కాదని నిర్ణయం చేసి ఉండవచ్చు కదా?

పోనీ, ఈ ఆరు సూచనలు చేసిందా అంటే, ఆరింట్లో నాలుగు పనికిరానివని తానే చెప్పింది. మరి పనికి రాని సూచనలు కమిటీ ఎందుకు చేస్తుంది? ఎవరిని గందరగోళంలో పడేద్దామని? నివేదిక ఈవిధంగా రావడం అంతుబట్టని చిదంబర రహస్యంగానే మిగిలి పోయింది.

తానే సూచనలు చేసి, వాటిని కొట్టివేసి, చివరకు రెండు సూచనలు మాత్రం మిగిల్చింది. అందులో ఒకటి (ఐదో సూచన) హైదరాబాదు రాజధానిగా తెలంగాణా విభజన. ఇక ఆరోది 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదికగా తెలంగాణాకి ఒక  ప్రాంతీయ అబివృద్ధి కౌన్సిల్ ఏర్పాటు చేసి, దానికి రాజ్యాంగ బద్ధత కల్పించి తెలంగాణాకి ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ సమైక్యాంధ్రని కొనసాగించడం.

ఆరో సూచనకు కమిటీ ప్రాధాన్యత నిచ్చినప్పటికీ, దానిలో పెద్దగా పస లేదనే విషయం చిన్న పిల్లవాడు కూడా చెపుతాడు. ఎందుకంటే ఈ సూచనలు కొత్తవి కావు. 1956 లో పెద్దమనుషుల ఒప్పందం వ్రాసుకున్నప్పుడు అమలు చేయాలని నిర్ణయించు కున్నవే. కానీ గడిచిన యాభై సంవత్సరాల కాలంలో అవి అమలు కావడం అసాధ్యం అని తేలిపోయింది.

మరి అమలు కాని సూచనలు ఎందుకు చేసినట్టు? రాష్ట్రం సమైక్యంగా ఉండి, తెలంగాణా ప్రయోజనాలు వీగిపోకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటే, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనే ఆలోచన కమిటీ వారికి ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఇలాంటి ఆలోచనతోటే కదా 1956 లో ఆంధ్రా, తెలంగాణాల మధ్యన ఒప్పందాలతో కూడిన విలీనం జరిగింది? ఇప్పుడు ఆ ఒప్పందాలన్నీ ఎంతకీ అమలు కాని ఎండమావులుగా మిగిలి పోయాయనే కదా మళ్ళీ విభజన కోరుతున్నది? మరి అటువంటప్పుడు పాతచింతకాయ పచ్చడినే మళ్ళీ వడ్డించడంలో ఔచిత్యం ఏమిటి?

శ్రీకృష్ణ కమిటీ వారు బంతిని మళ్ళీ కేంద్రం కోర్టులోకి తోసారని స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణా ప్రజలకు నమ్మకం కలిగించ గలిగిన రక్షణ వ్యవస్థ నెలకొల్ప గలిగినట్టైతే సమైఖ్యాంధ్ర కొనసాగించమని వారు సూచించారు. లేకపోతే వారు చెప్పిన రెండో ఆప్షను, విడిపోవడం ఎలాగూ ఉంది. అయితే ఇలాంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడాన్ని కూడా కొన్ని సీమాధ్ర శక్తులు వ్యతిరేకిస్తున్న విషయం గమనార్హం. అలాంటిది ఏర్పాటు చేస్తే, గతంలో అన్యాయాలు జరిగాయని ఒప్పుకున్నట్టు అవుతుందని వారు భావిస్తున్నారు.

యాభై ఏళ్ళుగా ఇలాంటి వ్యవస్థలు ఎలా పని చేస్తాయో స్పష్టంగా చూసిన తెలంగాణా వారు ఇలాంటి రక్షణ ఏర్పాట్లకు ఒప్పుకునే పరిస్థితిలో ఎలాగూ లేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలుగా విభజించడం తప్ప వేరే మార్గం లేదు. కాకపోతే కొత్త రాజధాని ఏర్పరచుకొనే వరకు కొన్ని సంవత్సరాలు హైదరాబాదుని ఆంధ్రా రాజధానిగా కూడా వాడుకునే వెసులుబాటు కల్పించ వచ్చు.

అలాగని ఏ చర్యా తీసుకోకుండా మిగతా మూడేళ్ళు గట్టెక్కే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇంకా ఎక్కువగా నాన్చుడు ధోరణి అవలంబిస్తే తెలంగాణా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలకు దిగే అవకాశం ఉంది. ఆ పనే జరిగితే కేంద్ర ప్రభుత్వం సంగతెలా  ఉన్నా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగితే, తెలంగాణలో kcr, ఆంధ్రాలో జగన్ clean sweep చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అంత సులభంగా తనగొయ్యి తానే తొవ్వుకుంటుందని ఊహించడం కష్టం.

అయితే ఇప్పటిదాకా గోడమీదిపిల్లి ఆట రక్తి కట్టించిన కాంగ్రెస్ కి ఇక ముందు అంత సులభంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఫిబ్రవరిలో పార్లమెంటులో తెలంగాణా పై బిల్లు పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తరువాత విభజన ప్రక్రియ ఎలాగూ రెండు మూడేళ్ళు పడుతుంది. తర్వాత ఎలక్షన్లు ఆధ్రాలో, తెలంగాణలో వేరువేరుగా జరిగేలా జాగ్రత్త పడితే సరి. తెలంగాణలో ఎలాగూ kcr తో జతగట్టి, తెలంగాణా ఇచ్చామని చెప్పుకొని కొన్ని సీట్లు గెలుస్తారు. ఇక చిరంజీవి సమైక్యవాదిగా ఆంధ్రాలో ఒక వెలుగు వెలిగేలా చేస్తారు. ఎలక్షన్లు దగ్గర పడ్డ తరువాత ప్రజారాజ్యాన్ని కాంగ్రేసులో విలీనం చేసుకునే అవకాశం ఎలాగూ ఉంది. చిరంజీవి సరిపోడేమో అనుకుంటే జగన్ ని సొంత గూటిలోకి ఆహ్వానించే అవకాశం కూడా కాదనలేం. విడిపోయిన రాష్ట్రంలో అధిష్టానాన్ని సవాలు చేసేంత శక్తి జగన్ కి ఉండదు.

ఒక వేళ సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే? అప్పుడు జగన్ ని అర్జంటుగా రంగంలోకి దింపాల్సి ఉంటుంది. జగన్ తెలంగాణా సమస్యపై ఇప్పటికీ తేల్చి చెప్పక పోవడం గమనించాల్సిన విషయం.

ఎలా చూసినా కూడా రాష్ట్రం విడిపోవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

  1. మంచి విశ్లేషణ. ఎప్పుడయితే చిరును తిరుమల లో కలసి గంటల కొద్ది చర్చించి తనతో కాశయ్య, డిల్లీ పెద్దలు సమైక్యం అనిపించారో, అప్పుడే కాంగీ భవిష్యత్తు ఎత్తుగడలు బయట పడ్డాయి. కోస్తా, సీమల గొఱ్ఱెల కోసం మెగా జీరో గారు జెండా పీకి అయినా, పీకకుండానయినా కాంగీ కి మద్దతు కు రెడీ.

    ఇక తెలంగాణా వానిని కాక, కిరణ్ ను ముఖ్యమంత్రి ని చేసారో, అది ఇంకోసారి నిర్ధారణ అయ్యింది. ఇక దొర గారితో కె. శవరావు గారి మంతనాలు, దొరగారు కాంగీ ని బలపరుద్దాము అనే డవిలాగులు అన్నీ ఆ స్క్రిప్టు లో భాగమే అనిపిస్తుంది. తెలంగాణా గొఱ్ఱెలకోసం దొరగారు కాంగీ జత కట్టటం రెడీ.

    యువరాజా గారిదేముంది, అక్కడక్కడా ఇంకా కాస్త మిగిలి ఉన్న భూములన్నీ అమ్ముకోమని, బయ్యారం, సరస్వతి, ఓబులాపురాలకు అనుమతులు ఇస్తే చాలు. మరో లక్ష కోట్లు పైనే సంపాదించుకొని, వాటా మూటలు హాయిగా డిల్లీ పంపటానికి రెడీ.

    ఇక మిగిలింది డిల్లీ రాణి గారి execution మాత్రమే. వాటికన్ ను సంప్రదిస్తా ఉండి ఉంటారు, మంచి మహూర్తం కోసం :)

    ReplyDelete
  2. ధన్యవాదాలు కృష్ణ గారు,

    జగన్ స్పీడు చూస్తుంటే, రాష్ట్రంలో అతితొందరలో పెను మార్పులు సంభవిస్తాయనిపిస్తుంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...