Skip to main content

పద్యాలు: సమస్యా పూరణం

ఈ మధ్య నేను కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగులో పూరించిన సమస్యలు.

ఎరుపు వర్ణంలో చూపిన వరుస కంది శంకరయ్య గారిచే ఇవ్వబడిన సమస్యగా గుర్తించ గలరు.

కం.  మేలగు నాయకులెవ్వరు
చాలక డబ్బది యొసగెడి సైతానైనా
చాలను మన వోటరు పా
పాలే సజ్జనుల నెల్ల బతితుల జేయున్!

తే. గీ. చీమ పెరుగన్నమును తిని సేదదీరె
నంత లోపుగా జరిగెను వింత యొకటి
చీమ తుమ్మెను, బెదరెను సింహగణము
అదిరిపడి నిద్ర మేల్కొనెనంత చీమ!

తే. గీ. స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరి
దేశమాతనే చేజార్చె దేహి యనుచు
తిరిగి స్వాతంత్ర్యమును తెచ్చె ధీరజనులు
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె!

తే. గీ. బియ్యమును కొంద మనుకున్న భయ్యమయ్యె
కూరగాయల కొనుమాట నేరమయ్యె
ఉల్లిపాయల ధరజూడ ఉట్టి పైన
వచ్చె సంక్రాంతి లక్ష్మి యే మిచ్చె మనకు?

ఆ. వె. కాలు ముడిచి పట్టి కాసారమున నిల్చు
కొంగ కానుపించె కుంటివోలె
కుక్క వెంటపడగ కొంగ పరుగులెత్తె
కొంగ కైదు కాళ్ళు కోడికి వలె.

ఆ. వె. మకరజ్యోతి గాంచ సౌకర్యములులేని
శబరిమలకు వెడలి జనులు చావ
పన్నువేయు ప్రభుత పనితీరు మారదు
కస్తురి తిలకమ్ము గరళ మయ్యె!

తే. గీ. వందకోట్ల జనులు గూడి భరత భువిని
ఎన్నికల లోన గెలిపించి రెవరు వారు?
వారు మగ, ఆడ కానట్టి వారు; చూడ
భీష్ముఁడు శిఖండిని వరించి పెండ్లియాడె!

కం.  నవలోకపు అభిరుచులను
అవగాహన చేసికొమ్ము అతివా చూడన్
చవకే నైటీ; చీరయు
రవికెందుకు నీకు తరుణి రాతిరి వేళన్?

ఆ. వె. పగలు రాత్రి లేక ప్రాజెక్టు పనులంటు
మాట మంతి లేక మనసు గలిపి
అయిపు లేక వెడలె అంకోపరిని బట్టి
సాఫ్టువేరు మగని జాడఁ గనరె!

కం.  క్రొత్తల పండుగ కొరకై
దుత్తను బెట్టిన పలలము దొంగిలి తిని; మే
నత్తకు జెప్పెను మావటి
"మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్".

పై పద్యం అర్థం కానివారికోసం వివరణ:


రైతులు పంట నూర్పిళ్ళు జరిగినాక, ఇంటికి తెచ్చే ముందు పొలంలోనే చిన్న పండగ (క్రొత్తలు) చేస్తారు. క్రొత్త బియ్యంతొ పసుపన్నం వండి, మాంసంతొ గ్రామ దేవతకు ముందు నైవేద్యం పెడతారు. ఆ క్రమంలోనే ఒకావిడ నైవెద్యంకోసం మాంసం, అన్నం వండి, ఏదో పని రావడంతో పొలంలోకి వెళ్ళింది. ఈలోపు మావటిగా పని చేసే మేనల్లుడు ఏనుగెక్కి అటుగా వచ్చాడు. మాంసం వాసన చూసేసరికి తినాలనే ఆశ పుట్టి, మొత్తం తినేశాడు. ఇంతలో అత్త రానేవచ్చింది. సమాధానం ఏం చెప్పాలో తెలియని అల్లుడు చివరికి పై విధంగా తిక్క సమాధానం చెప్పాడు!

ఉ. ఉత్పలమాల లల్లమని ఊరక జెప్పరు శంకరార్యు లా
ఉత్పలమాల కుండవలె నో యతి నాల్గవ యక్షరమ్ముతో;
ఉత్పతనమ్ము నోపుదును, ఉత్పలమాలను ఎట్లు రాతు? నే
యుత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో?

కం.  ఇలనష్టా వకృండట
తలలైదు కరంబులారు తనువది యొకటే!
తెలుపగ వైద్యులు వివరము
తలచితి నది జన్యులోప దైహికమనుచున్

కం.  చూడగ మనసున దోచును
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్;
గోడకు వేసిన పోస్టరు
వీడదు కత్రినది యైన బిరబిర దినగన్!

కం.  అడుగగ ఫీజుల కిచ్చితి
కొడుకునకున్ వేనవేలు; కూఁతున కొకటే
బిడియము, అడగదు ఏమీ;
వెడలెద నేనే బడికిని వివరము లడుగన్.

కం.  ఒద్దని వారంటున్నను
మద్దతు నిచ్చెద నటంచు మరిమరి యనుచున్
ప్రొద్దులు పుచ్చుచు గడిపెడు
దద్దమ్మల కీజగత్తు దండుగ కాదా?

ఉ. కోరరు డబ్బు దస్కములు కోరరు ఇంపగు విందు బోనముల్
కోరరు రాజ్య సంపదలు కోరరు మెత్తని పట్టు వస్త్రముల్
కోరరు మద్య మాంసములు కోరెద రొక్కటి మెచ్చుకోలు కై
బారులు; లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.

తే. గీ. విద్య నేర్చినవాఁడె పో వింతపశువు
అన్న పశువు బాధ పడుచు విన్నవించె
తాను సేవించు నీతిని తప్పకుండ
నేటి ఆస్థాన సచివుల నీతి గనరె!

కం.  చర్యకు తప్పక దగు ప్రతి
చర్య గలుగు; కావలసిన సంతకమునకై
కార్యార్థి మంత్రి వర్యుని
భార్యకు బ్రణ మిల్లె భక్తి భావము గుదురన్!

కం.  నరుడైనను కరియైనను
ఖరమైనను జీవులెల్ల కాటికి వెడలన్
హరి గలియు నంచు నొక్కడు
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్.

కం.  ప్రతిదినము వరుస దప్పక
వ్రతములు జరిపించు వాడు వర్జ్యము రాగా
క్రతువు ముగించి చివరి హా
రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్.

ఆ. వె. దున్న ఒకటి వచ్చి తిన్నదనుచు గడ్డి
పార్కు గార్డు వచ్చి బాదుచుండ
పద్యకవిత నాపి వచ్చి కాపాడగ
దున్న 'హరి'ని జూచి సన్నుతించె.

Comments

  1. పద్యాలు బాగున్నాయండి. ముఖ్యంగా చీర రవిక పద్యం అదిరిందండి.

    ReplyDelete
  2. వేదుల బాలకృష్ణమూర్తి గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. చర్చికి సందె వార్చుతకు సాయేబు వెళ్ళెను సత్వరమ్ము గన్!

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ