Skip to main content

కాకరాపల్లిలో మానవమేధం

గంగవరం, ముదిగొండ మరపుకైనా రాలేదు. సోంపేట నెత్తురు తడి ఆరనైనా ఆరలేదు, మళ్ళీ కాకరా పల్లిలో మానవమేధం. ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తాకట్టు పెట్టి పెట్టుబడి దారుల పాదాలకు మడుగులోత్తే క్రమంలో ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాల్సి ఉందో ఆలోచిస్తేనే భయం గొల్పుతుంది.



ఆ ప్రాంతపు ప్రజలు ప్రాణాలొడ్డి థర్మల్ ప్లాంటు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటేనే అది వారికి ఎంత నష్టదాయకమో చెప్పకనే చెపుతుంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్టు అక్కడే పెట్టాలనే యావ ఈ ప్రభుత్వానికెందుకు? సమాధానం జగద్విదితం. ఆ ప్రాంతం పెట్టుబడి దారులకు అనుకూలమైనది. నీటి లభ్యత ఉంటుంది. పోర్టు దగ్గరగా ఉంటుంది. అనగా పెట్టుబడి దారునికి అధిక లాభాలు వస్తాయి. లోపాయికారీగా తమకు ఎక్కువ కమీషన్లు ముడుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పెట్టుబడి దారుడు చెప్పిన దానికి గంగిరెద్దులా తలూపడం తప్ప ప్రజల గురించి ఏమాలోచిస్తుంది?

అసలు రక్షణలన్నీ పెట్టుబడి దారునికేనా? ప్రజల కేమీ లేవా? అన్న సందేహం కలుగుతుంది. పంట భూములను నాశనం చేసి ఫ్యాక్టరీలు నిర్మించడం ఏమిటి? అలా నిర్మించడానికి రాష్ట్రంలో బీడు భూములు చాలా ఉన్నాయి. అక్కడ పనులు లేక ఎంతోమంది కార్మికులు ఉన్నారు. అలాంటి ప్రదేశాల్లో ఇలాంటి ప్రాజెక్టులు కడితే ఎవరూ అభ్యంతరం చెప్పారు, పైగా స్వాగతిస్తారు. పెట్టుబడి దారునికి కొన్ని అనుకూలతలు ఉంటే ఉండవచ్చు, కాని ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టే హక్కు ఈ ప్రభుత్వాల కెవరిచ్చారు?  

ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సింది పోయి తానే భక్షించడం మొదలు పెట్టింది. పర్యావరణం, పంట భూములు ఎలా నాశనం అయినా ఫరవాలేదు, కొంతమంది గుట్ట పెట్టుబడి దారులకు కోట్లు సమకూర్చే మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగితే చాలు అన్న పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఈనాడు పౌరునికి తన భూమి, తన ఇల్లు పై హక్కు లేకుండా పోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ప్రజల భూములు, ఇల్లు పద్ధతీ పాడూ లేకుండా ఒక్క కలంపోటుతో ప్రభుత్వం లాగేసుకునే పరిస్థితి. ఎవరైనా అడ్డం చెపితే తుపాకులు పైకి లేస్తాయి. తూటాలు స్వైర విహారం చేస్తాయి.

అసలు ఈ ప్రభుత్వాలకు ఇంతటి నిరంకుశమైన అధికారాలు ఎలా వచ్చాయి? రాజ్యాంగ లోపమా? దాని అమలులో లోపమా? ఏదైనప్పటికీ అది ప్రజలకు శాపంగా మారింది. తమ న్యాయమైన కోరికలు సాధించడానికి న్యాయస్థానంలో పోరాటం సాయపడడం లేదు. ప్రతి చిన్న విషయం పైనా ప్రత్యక్ష కార్యాచరణకు దిగి రక్తం చిందించాల్సి వస్తుంది.

ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత ఉంటే, ప్రధాన ప్రతిపక్షం ఉద్యమంలో పాలు పంచుకుని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించక తూతూ మంత్రపు స్టేట్మెంట్లు ఇవ్వడం దాని దోపిడీ మనస్తత్వాన్ని చెప్పకనే చెప్పుతుంది. నిజానికి ఏ పక్షమైనా అధికారం లో ఉన్నప్పుడు అదే భాష మాట్లాడడం గత పదిహేను సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇలా పాలక పక్షాలు, ప్రతిపక్షాలు కుమ్మక్కై దేశాన్ని పందేరం చేస్తుంటే ప్రజలు ఈజిప్టు తరహా ఉద్యమం చేసి వీరిని దేశం నుండి తరిమి కొట్టడం తప్ప వేరే మార్గం లేదేమో ననిపిస్తుంది. 

Comments

  1. చిత్తడి భూములు (బురద నేలలు) దగ్గర థర్మల్ విద్యుత్ కేంద్రం కడితే ఆ భూములు ఎండిపోతాయని తెలియదా? ఈ జిల్లాలో వ్యవసాయానికి అంతగా యోగ్యం కాని మెట్ట భూములు ఉన్నాయి. పక్క జిల్లాలో కూడా ఉన్నాయి. ఒరిస్సాలోని తాల్చేర్ బొగ్గు గనులకి ఈ జిల్లాయే దగ్గర. అందుకే ఇక్కడే భారీ విద్యుత్ కేంద్రాలు పెట్టాలనుకుంటున్నారు.

    ReplyDelete
  2. ఇంకో సందేహం. బొగ్గు గనులకి దగ్గరగా ఉండడమే ముఖ్యం అనుకుంటే సింగరేణి బొగ్గు గనులు ఉన్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో థర్మల్ విద్యుత్ కేంద్రం పెట్టొచ్చు. తాల్చేర్ నుంచి దిగుమతి చేసే బొగ్గు కోసం ఉత్తరాంధ్రలో పెట్టడం ఎందుకు? ఒరిస్సాలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయి. అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాలు పెట్టకుండా అక్కడి బొగ్గుని ఇక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రాలకి ఎలా అమ్ముతున్నారు?

    ReplyDelete
  3. సామాజిక నపుంసకులమై చూస్తున్నాం, ప్రజాస్వామ్యం అని చెబుతూ ప్రజల అనుమతి లేకుండా వారి ఆస్తుల్ని పక్కాగా లాగేసుకునే వెసులుబాటున్న ఆధునిక అద్భుతమైన వ్యవస్థని ఏమనాలో తెలియక ! ఈ రోజు కాకరాపల్లి. అది ఱేపు కూకట్‌పల్లే కావచ్చు. మన దాకా వస్తే గానీ తెలియదు. బేగం బజారులో ఒక గూండా పన్నెండు ఇళ్ళు కబ్జా చేశాడట. వాడికీ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకీ తేడా ఏంటో, మూడుసింహాల బొమ్మ తప్ప !

    విని చాలా బాధపడుతున్నాను, ఈ కార్పొరేటోక్రసీ గుఱించి !

    ReplyDelete
  4. ప్రవీణ్ శర్మ గారు,

    అలా పెట్టడం వెనుక వారి లెక్కలు వారికుంటాయి. వ్యాపారికి పైసా మిగలడమే ముఖ్యం. మిగతా విషయాలు పట్టవు. ఆ విషయం పట్టించుకోవలసింది ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వమే ఇప్పుడు దోషిగా నిలబడింది.

    తాడేపల్లి గారు,

    గూండా కబ్జా చేస్తే కనీసం ప్రభుత్వానికి మొర పెట్టుకోవచ్చు. ప్రభుత్వమే గూండాగా మారితే, ప్రజలు రోడ్లెక్కక తప్పదు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...