Skip to main content

లోక్ పాల్ కమిటీ మరో తెలంగాణా కమిటీ అవుతుందా?

హజారే విజయంతో అవినీతిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. లోక్ పాల్ బిల్లు ఎంతవరకు పాస్ అవుతుందో తెలియదు కాని అవినీతి పై దేశ ప్రజలు చర్చించేలా చేయగలిగినందుకు అన్నా ఎంతైనా అభినందనీయుడు.

అయితే హజారే దీక్షకు అంత సులభంగా కాంగ్రెస్ తలవొగ్గడం విచిత్రంగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ స్వభావ సిద్ధంగా ఉద్యమాలకు, దీక్షలకు తలొగ్గే రకం కాదు. సమస్యలు నాన్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు ఎన్నో జరిగినా కూడా మిన్నకున్న చరిత్ర ఉంది ఈ ప్రభుత్వానికి. భవిష్యత్తులో ఉధృత రూపం దాల్చేదేమో కాని, సమస్యను పరిష్కరించే సమయానికి పట్టణాల్లో ప్రదర్శనలు తప్ప పెద్దగా ఉద్యమం కూడా ఏమీ కనిపించ లేదు. మరి హజారే నాలుగు రోజులు దీక్ష చేయగానే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఒక అంగీకారానికి ఎలా వచ్చింది? 

సమస్యను పరిష్కరించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తారేమోనని అనుకున్నా కూడా అలాంటిదేమీ చేయలేదు.   తానొక్కటే మొత్తం క్రెడిట్ తీసుకోవాలనేమో, ఏక పక్షంగా ఆందోళన కారులతో చర్చలు జరిపింది. ఆ రెండువర్గాలు తప్ప మరే ఇతరులకు కూడా బిల్ డ్రాఫ్టు కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు.

2G, కామన్వెల్త్ మొదలైన కుంభకోణాలతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట 'నానాటికి తీసికట్టు, నాగంభొట్లు' అన్నట్టుగా తయారయ్యింది. 2G పై, CVC ఎంపికపై ప్రధాన మంత్రిపైనే సుప్రీం అక్షింతలు పడ్డాయి. పులిమీద పుట్ర లాగా ఇప్పుడే ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చి పడ్డాయి. 

ఎటూ దిక్కు తోచకుండా ఉన్న కాంగ్రెస్ కు అన్నా దీక్ష అనుకోని వరంలా వచ్చి పడింది. అన్నాతో సంధి కుదుర్చుకోవడం ద్వారా తాము అవినీతి నిరోధకులమని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు. ఇక బిల్లు సంగతా, అది పార్లమెంటుకు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఈ బిల్లు అమలు లోకి రావడం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి అన్ని పార్టీలు కలిసి నానా కొర్రీలు పెట్టి ఎలాగూ అటకెక్కిస్తాయి. ఈలోపల క్రెడిట్ మనం కొట్టేయొచ్చు. ఇదే కాంగ్రెస్ ఆలోచనగా కనపడుతుంది.

కాంగ్రేస్ తెలివితేటలు లేటుగా తెలుసుకున్న బీజేపీ, వామపక్షాలు డ్రాఫ్టు కమిటీలో తమకు ప్రాతినిధ్యం లేకపోవడం పై ఇప్పుడు గుర్రుమంటున్నాయి. అయితే అవినీతిపై ఏనాడూ నిజాయితీగా ఉద్యమించని ఆ పార్టీలు గట్టిగా అడిగే నైతిక హక్కును కోల్పోయాయని చెప్పొచ్చు.

జన్ లోక్డ్ పాల్ బిల్లు డ్రాఫ్టు కమిటీ మెంబర్లు 
ప్రణభ్ ముఖర్జీ అధ్యక్షతలో ఈ కమిటీ మరో తెలంగాణా కమిటీ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అలా జరిగినట్టయితే ఈ కళంకిత మీడియా ఇప్పుడు చేసినంత హడావుడి అప్పుడు కూడా చేస్తుందా అనేది అనుమానమే. ఏమైనప్పటికీ ఈ బిల్లు అమలులోకి వచ్చేదాకా దేశ ప్రజలు నిరంతర అప్రమత్తతతో మెలగాల్సి ఉంటుంది. లేకపోతే ఇంతే సంగతులు.            

Comments

  1. శ్రీకృష్ణ కమిటీ సభ్యులకి హొటెల్స్‌లో చాలా లగ్జరీ సౌకర్యాలు కల్పించారు. అందుకే శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. లోక్‌పాల్ పెట్టడం కంటే CBIకి ఉన్న అధికారాలు పెంచడం మేలు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చెయ్యలేక ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులని మాత్రమే CBI దర్యాప్తు చేస్తుంది కానీ స్వతంత్రంగా కేసు నమోదు చేసే అధికారం CBIకి లేదు. CBIకి ఉన్న అధికారాలు పెంచితే కొత్త కమిటీలు వెయ్యాల్సిన ఖర్చు ఉండదు.

    ReplyDelete
  2. లోక్‌పాల్ బిల్‌కి మద్దతు ఇస్తున్నామంటూ బ్లాగుల్లో హడావుడి చేసినవాళ్ళు నిజంగా ఆ బిల్‌లో ఏముందో చదవలేదేమోనని నాకు అనుమానం. CBI అధికారులైనా నిజాయితీగా పని చేస్తారంటే నమ్మొచ్చు కానీ అధికార పార్టీ నియమించిన లోక్‌పాల్ కమిటీ నిజాయితీగా పని చేస్తుందంటే నమ్మడానికి చెవిలో పువ్వులు పెట్టుకోవాలి.

    ReplyDelete
  3. ప్రవీణ్ గారు,

    తెలంగాణా కమిటీ అంటే నేనన్నది ప్రణభ్ కమిటీ గురించి. ప్రణభ్ కమిటీ అంటే ఎడతెగని కమిటీ అని పేరుకదా! దీనికి కూడా ప్రణభ్ ముఖర్జీ చైర్మన్ గా ఉన్నారు. అందుకని అనుమానం వస్తుంది.

    ఒకవేళ లోక్పాల్ ఏర్పడితే CBI లోని అవినీతి వ్యతిరేక విభాగాన్ని లోక్‌పాల్‌లో విలీనం చేయవచ్చు. దానికి ఏయే అధికారాలు ఉండాలో నిర్ణయించేందుకే ఈ కమిటీ వేసారు. అది బిల్లుగా వస్తే ఆ అధికారాలు వస్తాయి. కాని ఇదంతా జరిగేదాకా నమ్మలేం, గత అనుభవాల దృష్ట్యా.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...