Skip to main content

కడప జిల్లా పేరు మార్పు

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన జిల్లా కడప. రాయల సీమ ప్రాంతానింకి చెందిన ఈ ప్రాంతానికి ఎప్పటినుంచి గుర్తింపు ఉందో ఇదమిద్ధంగా తెలియక పోయినా రామాయణంలోని కిష్కింధ కాండ ఈ ప్రదేశం లోనే జరిగినట్లు చెపుతారు. 7వ శతాబ్దంలో చైనా చరిత్ర కారుడు హుయాన్ త్సాంగ్ ఇక్కడ పర్యటించి గ్రంథస్తం చేసినట్టు తెలుస్తుంది. కనీసం పదవ శతాబ్దం నుంచి ఈ పేరుతొ ప్రసిద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

పదకొండవ శతాబ్దం నుండి చోళుల ఆధీనం లో ఉన్న కడప పధ్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. దరిమిలా క్రీ శ 1565 లో నిజాం చేత ఆక్రమించుకో బడింది. క్రీ శ 1800 లో నిజాం నవాబు సీడెడ్ జిల్లాలలో భాగంగా దీన్ని బ్రిటిష్ వారికి సమర్పించాడు. 1820 నుండి 1829 వరకు జిల్లా కలెక్టరు గా ఉన్న సి.పి.బ్రౌన్ ఇక్కడి భాష, సంస్కృతుల పై విశేష కృషి జరిపాడు. బ్రిటిష్ వారి హయాం లో Cuddapah గా వ్యవహరించ బడిన జిల్లా పేరును 2005 ఆగస్టు 19 నుండి తిరిగి అధికారికంగా Kadapa గా మార్చారు.

ఈ ప్రాంతం యోగి వేమన, అన్నమా చార్యులు, పోతులూరి వీర బ్రహ్మం, కవయిత్రి మొల్ల మొదలైన గొప్ప కవులు, వాగ్గేయ కారులకు పుట్టినిల్లు. వీరే కాక అల్లసాని పెద్దన, అయ్యలరాజు రామ భద్రుడు, రామరాజ భూషణుడు, తాళ్ళ పాక తిమ్మక్క, నాచన సోముడు, కవి చౌడప్ప కూడా ఇక్కడి వారే అని చెప్ప బడుతుంది. వీరే కాక ఆధునిక కాలానికి చెందిన గడియారం వెంకట శేష శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాచమల్లు రామచంద్రా రెడ్డి, మొదలైన వారు కూడా ఇక్కడి వారే.

కడప జిల్లాకి ఆపేరు 'గడప' అనే తెలుగు పదం నించి వచ్చిందని చెపుతారు. భారత దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమల దేవస్థానానికి ముఖ ద్వారం గా వుండడం వల్ల కడప అనే పేరు వచ్చినట్లుగా ప్రచారంలో వుంది.

ఇంతటి సంస్కృతి, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన జిల్లా జిల్లా పేరును ఒక్క కలం పోటుతో Y.S.రాజ శేఖర్ రెడ్డి జిల్లా గా మార్చి వేసారు. దేశ సంస్కృతీ సంపదల ఆన వాళ్ళను రాజకీయ కారణాలతో నాశనం చేసే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడి నుండి వచ్చింది? రాజ శేఖర రెడ్డి కన్నా ముందే గొప్ప నాయకులైన యన్. టి. రామా రావు, పి. వి. నరసింహా రావు ల పేర్ల పైన ఏ జిల్లాలకు పేర్లు పెట్టారు? అయినా ఇప్పుడు ఇంత అత్యవసరంగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?

ఇప్పటికే తురుష్క దండ యాత్రల వల్ల కొన్ని, బ్రిటిష్ వారి హయాంలో మరిన్ని చారిత్రక అవశేషాలైన పట్టణాల, మండలాల పేర్లను కోల్పోయాం. ఇప్పుడిక ఈ రకమైన ఆనవాయితీ ఎక్కడి వరకు వెళ్తుందో మరి!

Comments

  1. ఇంత పొడవైన పేర్లు మన జిల్లాలకి అవసరమా ? ఇలాంటి చర్యల వల్ల పేరుప్రతిష్ఠలు లేకుండా దెబ్బతినేది జిల్లాకేంద్రాలు. అసలే వాటికి ఏ ప్రాధాన్యమూ లేదు. ఇదివఱకు కడపజిల్లా అంటే దాని ముఖ్యపట్టణం కడప అని గుర్తుపట్టేవాళ్ళం. ఇప్పుడు డా|| (ఈ బిరుదు కూడా జిల్లాపేరులో కలిపేశారు) వై.ఎస్.(ఇంటిపేరు కూడా జిల్లాపేరులో కలిపేశారు) రాజశేఖరరెడ్డి (కులం పేరు కూడా జిల్లా పేరులో కలిపేశారు) జిల్లా అని పలకాలన్నా రాయాలన్నా ఎంత ఇబ్బంది ? చనిపోయిన వై.ఎస్. తప్ప కడపజిల్లాలో మహానుభావులెవరూ పుట్టలేదా ? అనే ప్రశ్నకూడా తలెత్తుతోంది ? అన్నమాచార్యులేమయ్యాడు ? వేమన ఏమయ్యాడు ? పండిత పుట్టపర్తి నారాయణాచార్యులేమయ్యారు ? (ఈ చివఱాయన విగ్రహాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆ మధ్య ప్రొద్దుటూరులో కూలగొట్టారు)

    -- తాడేపల్లి

    ReplyDelete
  2. విజయనగరం జిల్లాకి ఫ్రెంచ్ సామ్రాజ్యవాదుల్ని ఎదిరించిన తాండ్ర పాపారాయుడు పేరు పెట్టలేదు. ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులతో అవకాశవాద పేరు పెట్టుకున్న విజయరామ గజపతి పేరు విజయనగరం జిల్లాకి ఉంది. ఇప్పుడు కడప జిల్లాకి ఒక ఫాక్షనిస్ట్ పేరు పెట్టడం జరిగింది.

    ReplyDelete
  3. ఇలాంటి దురాచారాల్ని ఎదించలేని మన బలహీనత వికృత చేష్టలు చేసేవారికి బలం . ఆబలంతోనే కదా ఏడుకొండలనే మింగాలని చూసినది .

    ReplyDelete
  4. పొట్టి శ్రీరాములు గారి పేరు ఒక జిల్లాకు పెట్టటానికి యాభై సంవత్సరాలు పట్టింది, అదే రాజశేఖరుడి పేరెట్టటానికి యాభై రూజులు కూడా పట్టలేదు.

    ReplyDelete
  5. చరిత్రకెపుడో చెదలు పట్టాయి. బలవంతుడిదే రాజ్యం. కానీ ఎప్పుడో చలిచీమలు లేవవా !

    ReplyDelete
  6. బహుశ చరిత్ర, సంస్కృతులను 'నామ' రూపాల్లేకుండా నాశనం చేయడం అంటే ఇదే నేమో?

    తాడేపల్లి, ప్రవీణ్, దుర్గేశ్వర, కన్న గాడు, ఎస్. ఆర్. రావు గార్ల వ్యాఖ్యలకు ధన్య వాదాలు.

    ReplyDelete
  7. ఇది జోక్ కాకపోతే మరేమిటి? మా తాత మూడు సార్లు MLAగా, ఒక సారి MPగా పని చేశారు. అతని నియోజక వర్గంలో అతను పుట్టిన మండలానికి అతని పేరు పెట్టాలని డిమాండ్ చెయ్యగలను. ఆ మండలం నుంచి ఇంకొకాయన ఒక సారి MLA, ఒక సారి జిల్లా పరిషత్ చైర్మన్, ఒక సారి పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. అతని కొడుకో, మనవడో ఆ మండలానికి అతని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తారు. మండలాల పేర్లు సరిపోవంటే గ్రామాల పేర్లు కూడా మార్చాలి. గోపాలరావు అని పేరు ఉన్న MLA గారు చనిపోతే అతని మండలానికి గోపాల మండలం అని పేరు పెట్టారు. అతని తరువాత అదే మండలానికి చెందిన సుగ్రీవ రావు అనే పేరు ఉన్న అతను MLAగా పని చేసి చనిపోయారు. అప్పుడు ఆ మండలంలోని MLA స్వగ్రామానికి సుగ్రీవపురం అని పేరు పెట్టాలంటారు. ఆ MLA అవినీతిపరుడైనా ఫర్వాలేదు, చనిపోయిన మనిషిని స్మరించడం సంప్రదాయం అంటారు.

    ReplyDelete
  8. భారత దేశాన్ని కూడా ఓ రోజు సోనియా దేశంగానో, రాజీవ్ దేశం గానో మారుస్తారు వీళ్ళు. ఇదివరకు ఓ కూడలికో, ఓ రోడ్డుకో పేర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ఊళ్ళకు పేర్లు పెడుతున్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ నుండి దేవుడే రక్షించాలి.

    ReplyDelete
  9. గాంధీ రోడ్, నెహ్రూ చౌక్, అంబేద్కర్ జంక్షన్ లాంటి పేర్లు ఉన్న వీధులు చూశాను. వాళ్ళు జాతి నాయకులుగా భావించబడే వ్యక్తులు. వాళ్ళ సంగతి వేరు. హైదరాబాద్ లోనూ, శ్రీకాకుళం జిల్లాలోనూ జళగం వెంగళరావు పేరు ఉన్న వీధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జిల్లాలకే రాజకీయ నాయకుల పేర్లు పెడుతున్నారు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...