Skip to main content

కసబ్ కి ఉరిశిక్ష తక్కువా?

కసబ్ కి ఉరిశిక్ష విధిస్తూ కోర్టులో తీర్పు వెలువడిన దరిమిలా రక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ శిక్ష సరిపోదని, అసలు ఖండ ఖండాలుగా నరికి కాకులకు, గద్దలకు వేయాలని; మరికొందరు చావనీయ కుండా, బ్రతుకు అంటే అసహ్యం కలిగేలా చిత్ర హింసలు పెట్టాలని; ఇంకొందరు ముస్లిం ఆచారాల ప్రకారం అంతిమ క్రతువు నిర్వ హించక పోతే సరిపోతుందని ఇలా రక రకాలుగా చెప్తున్నారు.

అసలు కసబ్ ఎవరు? పాకిస్తాన్ లోని ఒక దరిద్రుల కుటుంబంలో జన్మించాడు. దారిద్ర్యం, అపరిమిత సంతానం అవిద్యకు, మూర్ఖత్వానికి దారి తీసాయి.  దుర్భర దారిద్ర్యం నేర ప్రవృత్తికి, దొంగ తనాలకు పురికొల్పింది. ఇలాంటి వారు టెర్రరిస్టులని తయారు చేసే ముష్కర మూకలకు శ్రేష్టమైన ముడిసరుకు అవుతారనేది జగమెగిన సత్యమే. చాలా సహజంగానే వారు ఇతన్ని తమ గుంపులోకి లాగారు. అందుకు ప్రతిఫలంగా ఇతని తండ్రికి డబ్బు ముట్టిందని కూడా వార్తలు ఉన్నాయి.

చదువు, సంస్కారం లేని యితడు ఇస్లామిక్ తీవ్రవాద సాహిత్యాన్ని ఔపోశన పట్టి కరడు గట్టిన టెర్రరిస్టుగా మారాడని అనుకోలేం. ఇన్ని రోజుల విచారణలో కూడా ఈ విషయం తెలుస్తుంది. కసబ్ ఎన్నోసార్లు రక రకాల అబద్ధాలు చెప్పాడు. తానూ టెర్రరిస్టు కాదని, టూరిస్టు అని బుకాయించ బోయాడు. శిక్ష ఖరారైన తర్వాత కూడా ఏడ్చాడని తెలుస్తోంది. కరడు గట్టిన టెర్రరిస్టు అయితే, నమ్మిన దానికోసం చావడాన్ని గర్వంగా భావిస్తాడు. జిహాద్ కు సంబధించిన నినాదాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. 

ఛత్రపతి శివాజీ టర్మినస్ లోపల ఇతను జరిపిన మారణ కాండకు తప్పకుండా ఉరిశిక్ష పడాల్సిందే. వేయడానికి మన శిక్షా స్మృతి లో అంతకన్నా పెద్ద శిక్ష కూడా లేదు. నిజానికి ఇతనికి శిక్ష విధించే విషయంలో ఇంతటి భావోద్వేగాలకు గురి కావాల్సిన అవసరం లేదు. నిజానికి మొత్తం వ్యవస్థలో కసబ్ ది ఒక పిపీలిక మాత్రమైన పాత్ర మాత్రమే.

మనం మన దేశం లోనే రహస్యంగా నడుపుతున్న తీవ్రవాద శిక్షణా వ్యవస్థని రూపు మాప లేక పోతున్నాం. POK  లో, సరిహద్దుల లో ఉన్న  తీవ్ర వాద స్థావరాలని నాశనం చేయడానికి అంతర్జాతీయ మద్దతును కూడగట్ట లేక పోతున్నాం. కనీసం అమెరికా వ్యతిరేక ఇస్లామిక్ టెర్రరిజం, ఇండియా వ్యతిరేక టెర్రరిజం ఒకటే అని అమెరికాని కన్విన్స్ చేయ లేక పోతున్నాం. ఇవన్నీ ఎవరి వైఫల్యాలు?

ఇంతెందుకు? కనీసం టెర్రరిస్టులపై ప్రాణాలర్పించి పోరాడుతున్న పోలీసులకు సప్లయ్ చేసే బుల్లెట్ ప్రూఫ్ ల విషయం లో కూడా లాలూచీ పడుతున్నాం. సాక్షాత్తూ పార్లమెంటు పై దాడి చేసి అయిదు వందల నలభై మంది ఎంపీలను అదుపులోనికి తీసుకోవాలని ప్రయత్నిచినవారిని ఐదు సంవత్సరాలుగా ఉరి తీయకుండా ఉపేక్షిస్తున్న వారిని ఏం చేయాలి? లుంబినీ పార్కు, గోకుల్ చాట్లో జరిగిన మారణ కాండకు ఇప్పటివరకు విచారణలో పురోగతి లేక పోవడానికి కారకు లెవ్వరు? 

మన దేశంలో అనేక దారుణాలకు పాల్పడుతున్న దావూద్ ఇబ్రహీం దగ్గరుకు వెళ్లి బహిరంగంగా విందులు చేసి వచ్చే బడా బాబులను ఏం చేయాలి?

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కేవలం కసబ్ ని అత్యంత దారుణంగా చంపి రాక్షసానందం పొందడం అనేది, తాత్కాలికంగా ఉపశమనం కలిగించ వచ్చు, కాని ఆ ఆనందం అసలు విషయాలన్నీ మరుగున పడి పోవడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది. ఇలా ఎప్పటికప్పుడు జరిగిన విషయాలని మరిచి పోయి మళ్ళీ మళ్ళీ మోసపోవడం, తిరిగి ఏదో ఒక దాడి జరగ్గానే భావోద్వేగాలకు లోను కావడం మనకేమీ కొత్త కాదుగా.

Comments

  1. ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధం
    ఇస్లాం దృష్టిలో ఇది హరామ్ (నిషిద్ధం). ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదని, ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉందని జమీయతుల్ ఉలమాయె హింద్ ఫత్వా జారీచేసింది.
    * ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.ఆంధ్రజ్యోతి 4.12.2008.
    * ఇలాంటి మంచిని కోరే ముస్లిములు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నారు.ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా వారికి నరకమే వస్తుంది.హింసను ప్రోత్సహించే మతలేఖనాలను లెక్క చెయ్యవద్దు.సర్వేజనా సుఖినోభవ తో ముస్లిములూ గొంతుకలుపుతారు.
    * హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు ఏ మతగ్రంధాలలో ఉన్నాపట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి. ఇస్లాం మతం తీవ్రవాదాన్నిఉగ్రవాద చర్యలను ఖండిస్తుంది . ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే భావించాలి. చంపడమే తీవ్రవాదమైతే 17 లక్షల మందిని చంపిన మాజీ అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్రవాది.ఇస్లాం ప్రపంచంలోని సర్వ మానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది.---ఇస్లామిక్ అకడమిక్ కంపారిటివ్ రిలీజియన్ (ఐఏసీఆర్) అధ్యక్షుడు ఆసిఫుద్దీన్ ముహమ్మద్ (ఈనాడు కర్నూలు 16.2.2009).
    *ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రహ్మెత్‌ఖాన్ (ఈనాడు హైదరాబాదు 16.2.2009)
    *బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు ఉరిశిక్ష
    ఉగ్రవాదులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్సును బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.ఉగ్రవాదులకు మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారికి సైతం మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది.
    *ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.---- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా

    ReplyDelete
  2. కసబ్ కంటే ముందు అఫ్జల్ ని ఉరి తీయాలి,పార్లమెంటు మీద దాడి చేసినందుకు కాదు,వాడి గురి తప్పిననదుకు.వాడి ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఉంటే(కనీసం కొంతమంది ఎంపీల ప్రాణాలు తీసి ఉంటే) హాయిగా దేశానికి పట్టిన సగం దరిద్రం వదిలేది.

    ReplyDelete
  3. ఒకరి ప్రాణము తీసె హక్కు వెరొకరికి లెదు.

    ReplyDelete
  4. చ౦పడ౦ కాదు, వాడిని క్షమి౦చాలి.
    అత్య౦త గౌరవ౦గా, మరణి౦చిన వారి కుటు౦బాలన్నీ కలగలసి, సైనిక లా౦చనాలతో వాణ్ణి వాఘా సరిహద్దుల దగ్గర ది౦పేయాలి. ఎ౦తో మ౦దిని చ౦పి, తానూ చావాలని వచ్చినవాడికి, బతకటమ౦టే ఏమిటో తెలియజెప్పాలి.

    ReplyDelete
  5. రహమతుల్లా గారు,
    సమాచారానికి ధన్యవాదాలు. ఇప్పుడు తీవ్ర వాదం వాళ్ళ ఇస్లామిక్ దేశాలే ఎక్కువ నష్ట పోతున్నయండి.

    రుషి గారు,
    కాల్చడానికి ప్రయత్నించి నందుకే ఉరి తీయలేదు. కాల్చకుండా దొరికిపోయి నందుకు ఉరి తీస్తారా మన ప్రభువులు?

    ప్రతిభ గారు,
    ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. మరి వందల ప్రాణాలు హరించి, ఆ హక్కును చేతిలోకి తీసుకున్న వారినేం చేయాలి?

    పెదరాయుడు గారు,
    గాంధీ మార్గానికి రోజులు లేవండి. మీరు చెప్పినట్టు చేస్తే అది మన చేతగాని తనం కింద భావిస్తారేమో.

    అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ