Skip to main content

పద్యాలతో కుస్తీ


పదో తరగతి చదివేటప్పుడు తెలుగు టీచర్ అనంతాచార్యుల వారు చందస్సు నేర్పించారు. ఆ సందర్భంగా  ఆటవెలది పద్యాన్ని బోధిస్తూ, ఒక పద్య పాదాన్ని ఇచ్చి పూరించమని చెప్పారు. అది...

'ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు'

చందస్సు నేర్చుకున్న ఆనందంతో సమధికోత్సాహంతో ఇలా పూరించాను.

 ఆ. వె.ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు
పాడునపుడు మనము పరవశించి 
మేను పులకరించి మేఘ మధ్యంబునం
దాటలాడుచున్న యట్లు దోచు

తర్వాత ఇంగ్లీషు మీడియం చదువు, సాంకేతిక విద్య కావడంవల్ల పద్యాల గురించి పూర్తిగా మరిచే పోయాను. మళ్ళీ ఇలా బ్లాగులోకం లోకి వచ్చిన తర్వాతనే పద్యాలు రాయడానికి ప్రయత్నం చేశాను. చింతా రామకృష్ణా రావుగారి ఆశీర్వచనం, ఆచార్య ఫణీంద్ర గారి వద్ద శిష్యరికం, కండి శంకరయ్య గారి ప్రోత్సాహం లేకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ పద్యం రాసి ఉండే వాడిని కాదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగా వివిధ బ్లాగులలో నేను వ్రాసిన కొన్ని పద్యాలు.

ఆ. వె.ఆశ లేని బ్రతుకు అడవిలో వెన్నెల
ఆశ యందె కలుగు ఆశయములు
ఆశ యుండు టెల్ల అత్యాశ కాబోదు
ఆశ లోనె కలదు దేశ భవిత
చం.సరుకులు కొందమన్న మరి చాలవు జీతపు డబ్బు లేటికిన్
తిరుగుద మన్న రోడ్లపయి తిప్పలు తప్పవు పాటు హోల్సుతో
ఎరుగము నీటి పంపు ప్రతి యింటికి తప్పక వచ్చు రోజులన్
మరతుము వీటినన్నిటిని మానము వేతుము వోటువారికే
మ.జలమోయంచును చేయు పూజలకు కాస్తంతన్ దయే లేని ఆ
కలియే నాట్యము చేసెనా యనగ, పొంగారెన్ నదీ మాతలే !
కలలోనైనను గాంచ నోపుదుమె ’ హా ’ కారాల ఆర్త ధ్వనుల్ ?
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే !
తే. గీ. బియ్య మదిజూడ నింగితో నెయ్యమందు
కూరగాయలా అరపూట గూడరావు
ధరల గతిజూడ దడపుట్టు ధరణిలోన
పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు !
కం. అసమర్థు లాడు వాండ్రని
నసిగెడు వారెల్ల రింక నచ్చెరు వందే
దెస సోనియ ’ప్రతిభ’ను లో
క సభాధ్యక్షతను పొందె కాంతామణియే.
ఉ.'సీమ'ను క్షామ మెక్కువని చెప్పుచు కొందరు; కాదు కాదు మా
సీమన క్షామ మెక్కువని చెప్పెద రింకొక ప్రాంత నాయకుల్;
క్షామము తాండవించుటకు కారణ మౌచును, సిగ్గు లేకయున్
క్షామము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్.
కం.బాధను విలవిల లాడె వి
రాధుడు గాయము లగుటను రాముని వలనన్
క్రోధము నంతట వీడి వి
రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్.
ఉ. తీయని మాటలాడుచును ధీమతి వోలెను పోజు బెట్టుచున్
మాయలు చేయువాడొకడు, మై నలుపై నొకడొప్పు తక్కువై
గాయపు మచ్చలుండినను గుణ్యత గల్గిన వాడు గావుటన్
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.
ఆ. వె. పడకటింటగూడ ప్రాజెక్టు పనులాయె
తెల్లవారుదాక తీరదాయె
ఝాము పొద్దు కాగ జవరాలు నీవంటు
వేళ కాని వేళ బిలువ దగునె
కం.చూపెన్ పడతుల సొంపులు
ఆపయి వయలెన్సు నింపి ఔరా యనగన్
చూపెను దుబాయి లండన్
సూపరు హిట్ చిత్రము కయి సుతుడే కోరన్
తే. గీ. మాటి మాటికి ఫోనులో మంతనాలు
తప్పు కొనవలెనన్న యేదారి లేక
కాన్ఫరెన్సు యుందని చెప్పి కల్ల లాడ
సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్చె
ఆ. వె. జబ్బు చేసినంత డబ్బు సాయ మడుగ
ప్రాణ మిత్రుడొకడు పారి పోయె
వైరిగా తలచిన వాడు సాయ పడిన
ధనమె గొప్ప మంచితనము కంటె.
ఆ. వె.ఫాక్షనిజము సల్పి పలు నేరముల జేసి
పదవి వచ్చినంత ఫ్రాడు జేసి
తాను జచ్చినంత తనయుడు అరుదెంచి
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను.
తే. గీ.ధనము కలిగిన మనసుకు తృప్తి లేదు
కొంత యుండిన మరియింత కోర నగును
తనను మించిన కలుగును తామసంబు
కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము. 

మరిన్ని ఇంకో టపాలో...

Comments

  1. మీరు చాల బాగా పద్యరచన గావిస్తున్నారు.
    శంకరాభరణం బ్లాగులో మీరుచెసిన కొన్ని పూరణలు నాకు అద్భుతంగా తోచాయి.
    పద్యలాతో కుస్తీ ల్లో పెద్ద వస్తాదు కావాలని అభిలషిస్తున్నాను

    ReplyDelete
  2. అసంఖ్య గారు,

    మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  3. బాగున్నాయి.
    చివరి తేటగీతి " ధనము గలిగిన" చాలా బాగుంది.

    ReplyDelete
  4. మందాకినీ గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  5. హరి గారూ,
    మంచిమంచి పద్యాలు రాస్తున్నారు. మీ పద్యాలు అర్థవంతంగాను, పాడుకోటానికి వీలుగానూ ఉంటాయి. పదాలను అతికించినట్టు ఎక్కడా కనబడదు. అభినందనలు!

    ReplyDelete
  6. మీ బ్లాగు కూడళ్ళలో కనబడుతున్నట్టు లేదేంటి సార్?

    ReplyDelete
  7. చదువరి గారు,

    మే అభినందనలకు ధన్యవాదాలు.

    నా బ్లాగు కూడలి, హారం, మాలికలలో ఇండెక్స్ అవుతుందండి.

    ReplyDelete
  8. చదువరి గారు,

    మీ పద్యాలు ఇంకా బాగుంటాయి.

    ReplyDelete
  9. పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.

    ReplyDelete
  10. నచికేత్ గారు

    దన్యవాదాలు

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...