Skip to main content

పద్యాలతో కుస్తీ


పదో తరగతి చదివేటప్పుడు తెలుగు టీచర్ అనంతాచార్యుల వారు చందస్సు నేర్పించారు. ఆ సందర్భంగా  ఆటవెలది పద్యాన్ని బోధిస్తూ, ఒక పద్య పాదాన్ని ఇచ్చి పూరించమని చెప్పారు. అది...

'ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు'

చందస్సు నేర్చుకున్న ఆనందంతో సమధికోత్సాహంతో ఇలా పూరించాను.

 ఆ. వె.ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు
పాడునపుడు మనము పరవశించి 
మేను పులకరించి మేఘ మధ్యంబునం
దాటలాడుచున్న యట్లు దోచు

తర్వాత ఇంగ్లీషు మీడియం చదువు, సాంకేతిక విద్య కావడంవల్ల పద్యాల గురించి పూర్తిగా మరిచే పోయాను. మళ్ళీ ఇలా బ్లాగులోకం లోకి వచ్చిన తర్వాతనే పద్యాలు రాయడానికి ప్రయత్నం చేశాను. చింతా రామకృష్ణా రావుగారి ఆశీర్వచనం, ఆచార్య ఫణీంద్ర గారి వద్ద శిష్యరికం, కండి శంకరయ్య గారి ప్రోత్సాహం లేకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ పద్యం రాసి ఉండే వాడిని కాదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగా వివిధ బ్లాగులలో నేను వ్రాసిన కొన్ని పద్యాలు.

ఆ. వె.ఆశ లేని బ్రతుకు అడవిలో వెన్నెల
ఆశ యందె కలుగు ఆశయములు
ఆశ యుండు టెల్ల అత్యాశ కాబోదు
ఆశ లోనె కలదు దేశ భవిత
చం.సరుకులు కొందమన్న మరి చాలవు జీతపు డబ్బు లేటికిన్
తిరుగుద మన్న రోడ్లపయి తిప్పలు తప్పవు పాటు హోల్సుతో
ఎరుగము నీటి పంపు ప్రతి యింటికి తప్పక వచ్చు రోజులన్
మరతుము వీటినన్నిటిని మానము వేతుము వోటువారికే
మ.జలమోయంచును చేయు పూజలకు కాస్తంతన్ దయే లేని ఆ
కలియే నాట్యము చేసెనా యనగ, పొంగారెన్ నదీ మాతలే !
కలలోనైనను గాంచ నోపుదుమె ’ హా ’ కారాల ఆర్త ధ్వనుల్ ?
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే !
తే. గీ. బియ్య మదిజూడ నింగితో నెయ్యమందు
కూరగాయలా అరపూట గూడరావు
ధరల గతిజూడ దడపుట్టు ధరణిలోన
పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు !
కం. అసమర్థు లాడు వాండ్రని
నసిగెడు వారెల్ల రింక నచ్చెరు వందే
దెస సోనియ ’ప్రతిభ’ను లో
క సభాధ్యక్షతను పొందె కాంతామణియే.
ఉ.'సీమ'ను క్షామ మెక్కువని చెప్పుచు కొందరు; కాదు కాదు మా
సీమన క్షామ మెక్కువని చెప్పెద రింకొక ప్రాంత నాయకుల్;
క్షామము తాండవించుటకు కారణ మౌచును, సిగ్గు లేకయున్
క్షామము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్.
కం.బాధను విలవిల లాడె వి
రాధుడు గాయము లగుటను రాముని వలనన్
క్రోధము నంతట వీడి వి
రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్.
ఉ. తీయని మాటలాడుచును ధీమతి వోలెను పోజు బెట్టుచున్
మాయలు చేయువాడొకడు, మై నలుపై నొకడొప్పు తక్కువై
గాయపు మచ్చలుండినను గుణ్యత గల్గిన వాడు గావుటన్
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.
ఆ. వె. పడకటింటగూడ ప్రాజెక్టు పనులాయె
తెల్లవారుదాక తీరదాయె
ఝాము పొద్దు కాగ జవరాలు నీవంటు
వేళ కాని వేళ బిలువ దగునె
కం.చూపెన్ పడతుల సొంపులు
ఆపయి వయలెన్సు నింపి ఔరా యనగన్
చూపెను దుబాయి లండన్
సూపరు హిట్ చిత్రము కయి సుతుడే కోరన్
తే. గీ. మాటి మాటికి ఫోనులో మంతనాలు
తప్పు కొనవలెనన్న యేదారి లేక
కాన్ఫరెన్సు యుందని చెప్పి కల్ల లాడ
సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్చె
ఆ. వె. జబ్బు చేసినంత డబ్బు సాయ మడుగ
ప్రాణ మిత్రుడొకడు పారి పోయె
వైరిగా తలచిన వాడు సాయ పడిన
ధనమె గొప్ప మంచితనము కంటె.
ఆ. వె.ఫాక్షనిజము సల్పి పలు నేరముల జేసి
పదవి వచ్చినంత ఫ్రాడు జేసి
తాను జచ్చినంత తనయుడు అరుదెంచి
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను.
తే. గీ.ధనము కలిగిన మనసుకు తృప్తి లేదు
కొంత యుండిన మరియింత కోర నగును
తనను మించిన కలుగును తామసంబు
కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము. 

మరిన్ని ఇంకో టపాలో...

Comments

  1. మీరు చాల బాగా పద్యరచన గావిస్తున్నారు.
    శంకరాభరణం బ్లాగులో మీరుచెసిన కొన్ని పూరణలు నాకు అద్భుతంగా తోచాయి.
    పద్యలాతో కుస్తీ ల్లో పెద్ద వస్తాదు కావాలని అభిలషిస్తున్నాను

    ReplyDelete
  2. అసంఖ్య గారు,

    మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  3. బాగున్నాయి.
    చివరి తేటగీతి " ధనము గలిగిన" చాలా బాగుంది.

    ReplyDelete
  4. మందాకినీ గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  5. హరి గారూ,
    మంచిమంచి పద్యాలు రాస్తున్నారు. మీ పద్యాలు అర్థవంతంగాను, పాడుకోటానికి వీలుగానూ ఉంటాయి. పదాలను అతికించినట్టు ఎక్కడా కనబడదు. అభినందనలు!

    ReplyDelete
  6. మీ బ్లాగు కూడళ్ళలో కనబడుతున్నట్టు లేదేంటి సార్?

    ReplyDelete
  7. చదువరి గారు,

    మే అభినందనలకు ధన్యవాదాలు.

    నా బ్లాగు కూడలి, హారం, మాలికలలో ఇండెక్స్ అవుతుందండి.

    ReplyDelete
  8. చదువరి గారు,

    మీ పద్యాలు ఇంకా బాగుంటాయి.

    ReplyDelete
  9. పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.

    ReplyDelete
  10. నచికేత్ గారు

    దన్యవాదాలు

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...