Skip to main content

అవినీతిపై యుద్ధం

ప్రతిరోజూ ట్రాఫిక్ పోలీసు వాడికి, తహసీలు ఆఫీసు గుమాస్తాకి, మున్సిపాలిటీ ఇంజనీరుకి, ఎమ్మెల్యేకి, మంత్రికి మామూళ్ళు సమర్పించుకుంటూ బతుకులీడ్వడం అలవాటైన మనకు అన్నా హజారే చేస్తున్న ప్రయత్నం ఏటికి ఎదురీదడంలా కనిపించవచ్చు. 

అవినీతి ఇప్పుడు దేశంలో ఎంతగా పాతుకు పోయిందంటే, అదొక తప్పనిసరి వ్యవహారంలా ప్రతి ఒక్కరికి అలవాటై పోయింది. ఊళ్లలోకి వెళ్లి పరిశీలిస్తే క్రిందిలాంటి సంభాషణలు వినడం సర్వ సాధారణం.

"కలెక్టర్ ఆఫీసుకు వెల్లినవ్ కదా? పనైందా?"

"కాలేదన్నా, పైసలు అడుగుతున్నడు".

"అరే, పిచ్చోనివా? పైసలు లేందే పనులైతయా?"

పై సంభాషణ ఏం చెప్పుతుంది. ప్రజలు అవినీతి పై నిరసన వ్యక్తం చేయడం లేదు. అదొక ట్రాఫిక్ రూల్ లాగా, ఇంటి పన్నులాగా, కరెంటు బిల్లు లాగా ఇష్టం ఉన్నా లేకపోయినా చేయక తప్పని పనిగా భావిస్తున్నారు. అరవై సంవత్సరాల 'ప్రజా'స్వామ్య పాలన చూసాక ఇక దీన్ని ఎవరూ మార్చలేరన్న భావనకు వచ్చేశారు. ఇక ఇలాంటి భావనకు వచ్చిన తర్వాత "ఎలాగూ మీరు తింటున్నారుగా, వోటేస్తే మాకేమిస్తారు?" అన్న ప్రశ్నలు కూడా మొదలు పెట్టడంలో ఆశ్చర్యమేముంది?

కాని, భూతంలా పెరిగిపోయిన అవినీతికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్ట వలసిన అవసరం ఉంది. దీనికి అన్నా హాజారే పూనుకొని ముందుకు రావడం, జనలోక్పాల్ బిల్లు కోసం పోరాడడం ఏంటో సంతోషించా దగ్గ విషయం. ఆయన తన ప్రాణాలనైనా పణంగా పెట్టి, బిల్లు కోసం చివరి శ్వాస వరకూ పోరాడుతానని ఖరాఖండీగా చెప్పి తన నిబద్ధతను చాటుకున్నారు. ఇక నిబద్ధతను చూపవలసిన అవసరం దేశ ప్రజలపై ఉంది. ప్రజలు ఆయనకిచ్చే మద్దతుపైనే జయాప జయాలు ఆధారపడి ఉంటాయి.

ఇప్పటికే దేశమంతటా అనేక ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా ప్రజలు తమ మద్దతును స్వచ్చందంగా తెలుపు తున్నారు. ఇది చాలా సంతోషించా దగ్గ విషయం. ఇటీవల మరే విషయం పై కూడా ప్రజలంతా ఒక్క తాటిపై నిలబడ్డ దాఖలాలు లేవు. 

సమస్యలను నాన్చుతూ, అవినీతి రాజభోజ్యంగా భావించే కాంగ్రెస్ పార్టీ "అన్నా హాజారే లోక్ పాల్ కమిటీ చైర్మన్ గా ఉండడానికి దీక్ష చేపట్టారని" అర్థంవచ్చేలా వదంతులు వ్యాప్తి చేయడం మొదలు పెట్టింది. దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ అన్నా ఆ పదవికి ఇద్దరు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సూచిస్తూ అధికార పార్టీ కుట్ర పూరిత ఆలోచనలకు ఆదిలోనే అడ్డుకున్నారు.

దేశాన్ని అవినీతి రహిత సమాజంగా మార్చడానికి ఇది సరయిన సమయం. దేశ భక్తులందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం తక్షణావసరం.

Comments

  1. ప్రాంతీయ విద్వేషక విభజన కారులు, కెసిఆర్ అనుచరులు కూడా అవినీతి మీద మాట్లాడుతున్నారహో .. :)))

    ReplyDelete
  2. Snkr

    తెలంగాణా విభజనవాదం మొదలయ్యిందే రాష్ట్రాన్ని తమ పెరటిగేదెలా మార్చుకుని అడ్డూ ఆపూ లేకుండా వేల కోట్లు దిగమింగిన, మింగుతున్న ఆంధ్రా నాయకులకు వ్యతిరేకంగా. సమైక్యవాదాన్ని నర నరానా నింపుకున్న రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, లగడపాటి, రాయపాటి, కావూరి, తిక్కవరపు etc, రాష్ట్రంపై ప్రేమతో అలా మాట్లాడుతున్నారని తమరిలాంటి అమాయకులు భావిస్తున్నారేమో కాని, తెలంగాణా వారికి ఎలాంటి భ్రమలు లేవు.

    ఇక విద్వేషం గురించి మాట్లాడాలంటే, ఒక ప్రాంతం వారిపై నిలువెల్లా ద్వేషం నింపుకుని బ్లాగు బ్లాగూ తిరుగుతూ తమరు పెట్టే కామెంట్లు చదివిన వారికెవరికైనా తెలుస్తుంది, విద్వేషం అంటే ఎలా వుంటుందో!

    ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టడానికి మరోసారి ఇక్కడికి రావద్దు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...